ఆక్వా హబ్‌గా ఆంధ్ర!

ABN , First Publish Date - 2021-12-25T08:39:14+05:30 IST

పలు, రొయ్యల ఉత్పత్తి రైతులకు గిట్టుబాటుధర అందించడమే ప్రధాన లక్ష్య మని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

ఆక్వా హబ్‌గా ఆంధ్ర!

  • రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌లు.. 14 వేల రిటైల్‌ షాపులు
  • పట్టా, ఇంటి నిర్మాణంతో అక్కచెల్లెమ్మలకు 6 లక్షల స్థిరాస్తి: సీఎం జగన్‌ 
  • సొంత నియోజకవర్గంలో మెగా టౌన్‌షిప్‌, ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన


కడప, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): చేపలు, రొయ్యల ఉత్పత్తి రైతులకు గిట్టుబాటుధర అందించడమే ప్రధాన లక్ష్య మని సీఎం జగన్‌ అన్నారు. రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లు, 14 వేల చేపలు, రొయ్యల విక్రయ రిటైల్‌ షాపులు ప్రారంభిస్తున్నామని తెలిపారు. కడప పర్యటనలో రెండోరోజు శుక్రవారం ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 8,042 ఇళ్లు నిర్మించే జగనన్న మెగా టౌన్‌షిప్‌, రూ.110 కోట్లతో నిర్మించనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, రిటైల్‌ యూనిట్‌కు భూమిపూజ చేశారు. పులివెందులలో రూ.2.60 కోట్లతో నిర్మించిన ఆక్వా హబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన పులివెందులకు ఎంత చేసినా తక్కువేనని.. ఇక్కడ చేపలు, రొయ్యలు విక్రయించే ఆక్వా హబ్‌ ప్రారంభిస్తామని కలలో కూడా అనుకోలేద న్నారు. 323 ఎకరాల్లో 8,042 మందికి ఇంటి పట్టాలు, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం తనకెంతో ఆనందాన్నిచ్చిందని, ఈ మెగా టౌన్‌షిప్‌లో మరో రూ.147 కోట్లతో తాగునీరు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని ప్రకటించారు.


 ‘రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి పట్టాలిచ్చి, పక్కా ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ఇంటి స్థలం రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణ వ్యయం రూ.1.80 లక్షలు, మౌలిక వసతులకు మరో రూ.2 లక్షలు కలిపి సరాసరి ప్రతి పేద అక్కాచెల్లెమ్మలకు రూ.6 లక్షల స్థిరాస్తి ఇస్తున్నాం. రెండేళ్ల తర్వాత అది రూ.10 లక్షలకు చేరుతుంది’ అని చెప్పారు. రూ.4.70 కోట్లతో చీనీ శీతల గిడ్డంగులను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పులివెందులలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేంపల్లిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మంజూరు చేస్తున్నట్లు తెలి పారు. రూ.5,036 కోట్లతో చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా ఎత్తిపోతలను 2023 జూన్‌లోగా పూర్తి చేస్తామన్నారు.


బిర్లా యూనిట్‌ ఏర్పాటు అభినందనీయం

పులివెందులలో ప్రముఖ కంపెనీ ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, రిటైల్‌ ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమని సీఎం చెప్పారు. ఆ సంస్థ ఎండీ ఆశీష్‌ దీక్షిత్‌కు ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అపెరల్‌ విస్కోస్‌ ఫిలమెంట్‌ యార్న్‌లో దేశంలోనే ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటని, 2019లో రూ.8,700 కోట్లు టర్నోవర్‌ కలిగిన సంస్థ పులివెందులలో రూ.110 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్‌ గార్మెంట్‌ తయారీ యూనిట్‌ పెట్టడం, ఆ సంస్థ నిర్మాణానికి భూమిపూజ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కంపెనీ ద్వారా 2,112 మందికి ఉపాధి లభిస్తుందని, ఇందులో 85 శాతం మహిళలకేనని తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంబించిన అపాచీ షూ కంపెనీ ద్వారా మరో 2 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. దీక్షిత్‌ మాట్లాడుతూ పులివెందులలో తమ యూనిట్‌ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 

Updated Date - 2021-12-25T08:39:14+05:30 IST