‘అనంత’ విషాదం!
ABN , First Publish Date - 2021-05-05T08:20:37+05:30 IST
ప్రాణవాయువు అందక ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో వరుసగా మూడో రోజు మృత్యుఘోష కొనసాగింది

వరుసగా మూడోరోజు ఆక్సిజన్ అందక కష్టం
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఏడుగురి మృతి
మధ్యాహ్నమే రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ రాత్రి ఏడు గంటలకు చేరుకున్న వైనం
ఈలోపే ప్లాంటులో ప్రాణవాయువు ఖాళీ
నలుగురు మరణించారన్న ఎమ్మెల్యే
ఎలాంటి ప్రకటనా చేయని అధికారులు
ఆరు బయటే ఆస్పత్రి
ఇది అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి. కొవిడ్ బాధితులతో కిటకిటలాడుతోంది. దీంతో... ఆరుబయట వరండానే వార్డుగా మార్చేశారు. ఔట్ పేషంట్ విభాగంతోపాటు చికిత్స కూడా ఇక్కడే అందిస్తున్నారు. ఎక్స్‌రే యంత్రాన్ని కూడా బయటే పెట్టి... అక్కడికక్కడే పరీక్షలు చేస్తున్నారు.
అనంతపురం, మే 4: ప్రాణవాయువు అందక ప్రాణాలు పోతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో వరుసగా మూడో రోజు మృత్యుఘోష కొనసాగింది. ఆదివారం అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రిలో, సోమవారం హిందూపురం ఆస్పత్రిలో ‘ఆక్సిజన్ అందక’ విషాదాలు చోటు చేసుకోగా... మంగళవారం అనంతపురం లోని సూపర్ స్పెషాలిటీ కొవిడ్ ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ అందక ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. అయితే... ఆక్సిజన్ కొరతతో నలుగురు మాత్రమే మరణించినట్లు స్థానిక ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో సుమారు 500 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి మంగళవారం మధ్యాహ్నం రావాల్సిన ఆక్సిజన్ ట్యాంక్... రాత్రి 7 గంటల సమయానికి వచ్చింది. అంతకు కొద్దిసేపటి ముందే ఆస్పత్రి ఆవరణలోని ప్లాంట్‌లో ఆక్సిజన్ ఖాళీ అయిపోయింది. దీంతో మొదటి అంతస్తులో (సెకండ్ బ్లాక్)లో ఆక్సిజన్ ఆధారంగా చికిత్స పొందుతున్న సుమారు 25 మంది ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకున్నారు. వైద్య సిబ్బంది అప్రమత్తమై వారిని ఇతర విభాగాలకు తరలించారు. విడిగా ఉన్న సిలిండర్ల నుంచి ఆక్సిజన్ అందించారు. అయితే... అప్పటికే పరిస్థితి విషమించడంతో ఏడుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. అయితే... ఆక్సిజన్ అందక నలుగురు మాత్రమే చనిపోయారని స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు.
అధికారుల సమీక్ష
కొవిడ్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అయిపోయిన సంగతి తెలియగానే జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు, జేసీలు, ఎంఎల్‌ఏ అనంత వెంకటరామిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు... ఎవరూ లోపలికి రాకుండా ప్రధాన గేట్‌ను మూసి వేశారు. క్యాన్సర్ యూనిట్ వద్ద నుంచే అధికారులు, ఎంఎల్‌ఏ తదితరులు పరిస్థితిని సమీక్షించారు. మృతి చెందిన వారి బంధువులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. జిల్లా అధికారులు ఈ సంఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో...
మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం ఒక్కరోజే ఆరుగురు మరణించారు. ఆక్సిజన్ అందకపోవడమే దీనికి కారణమనే ఆరోపణలు వచ్చాయి. అయితే... ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు దీనిని ఖండించారు. వారంతా ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం వల్లనే చనిపోయారని స్పష్టం చేశారు.