ఆనందయ్యను మళ్లీ తీసుకెళ్లారు!

ABN , First Publish Date - 2021-05-30T08:24:00+05:30 IST

సురక్షిత ప్రాంతం పేరుతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఇంటి నుంచి బొనిగి ఆనందయ్యను పోలీసులు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన ఇంటి వద్ద హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే.

ఆనందయ్యను మళ్లీ తీసుకెళ్లారు!

పట్టువిడవని పోలీసులు.. తెల్లవారుజామున తరలింపు

అడ్డుకున్న గ్రామస్థులు.. సర్దిచెప్పిన ఆనందయ్య 

తరలింపుపై సర్వత్రా అనుమానాలు


ముత్తుకూరు, మే 29: సురక్షిత ప్రాంతం పేరుతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఇంటి నుంచి బొనిగి ఆనందయ్యను పోలీసులు తరలించారు. శుక్రవారం రాత్రి ఆయన ఇంటి వద్ద హైడ్రామా నడిచిన విషయం తెలిసిందే. ఆనందయ్య బయటకు వచ్చి, తాను ఎక్కడికీ వెళ్లనని చెప్పిన తర్వాతే పరిస్థితి సద్దుమణిగింది. అయినా స్థానికులు అక్కడే వేచి చూశారు. వారంతా అనుమానించినట్లే, శనివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో పోలీసులు ఆయన్ను కారులో తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడే ఉన్న గ్రామస్థులు కారును అడ్డుకున్నారు. ఆనందయ్యను తీసుకెళ్లేందుకు వీలులేదని స్పష్టం చేశారు. అయితే అప్పటికే ఆనందయ్యతో పాటు ఆయన సతీమణి ఇంద్రావతికి అధికారులు శతవిధాలా నచ్చజెప్పి ఒప్పించినట్లు సమాచారం. దీంతో స్థానికులతో ఆనందయ్య మాట్లాడారు. తనను ఎవరూ బలవంతంగా తీసుకెళ్లడం లేదని, మళ్లీ ఇంటికే వస్తానని సర్దిచెప్పడంతో గ్రామస్థులు అడ్డు తొలగారు. 


అయితే డీఎస్పీతో పాటు పోలీసు అధికారులు పట్టుబట్టి తెల్లవారుజాము వరకు వేచి ఉండి ఆనందయ్యను తరలించడం వెనుక ఇతర కారణాలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆనందయ్య ఊళ్లో ఉంటే అధిక సంఖ్యలో ప్రజలు వస్తారని, భద్రతా పరంగానూ ఇబ్బందులు ఉంటాయని పోలీసు అధికారులు చెబుతున్నా, అసలు కారణాలు వేరే ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులోనూ ఆనందయ్యను కృష్ణపట్నం పోర్టులోని సీవీఆర్‌ కాంప్లెక్స్‌కు తరలించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో నిషేధాజ్ఞలు విధించి, మీడియాను రానివ్వద్దన్నారని రూరల్‌ డీఎస్పీ హరినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఆనందయ్యను బీసీ వెల్ఫేర్‌ కమిషనర్‌ ఆచార్య శనివారం కలిశారు. ఆయన పంపిణీ చేస్తున్న కరోనా మందు వివరాలను అడిగి తెలుసుకున్నారు.


అనుమతులొచ్చాకే ‘ఆనందయ్య’పై నిర్ణయం

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): ఆనందయ్య తయారు చేసిన మందుపై ఆయుష్‌ శాఖ ఇంకా తుది నివేదిక ఇవ్వలేదని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడి ్డ తెలిపారు. ఆయుష్‌ నివేదిక అం దాక... కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-30T08:24:00+05:30 IST