అమరావతే రాజధాని

ABN , First Publish Date - 2021-12-30T08:27:00+05:30 IST

విజయవాడలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి.

అమరావతే రాజధాని

  • ఉత్తరాంధ్ర, సీమను అభివృద్ధి చేయాలి
  • మద్యంపై ఆధారపడి ‘సంక్షేమం’ దుర్మార్గం
  • సీపీఎం రాష్ట్ర మహాసభ తీర్మానాలు


అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): విజయవాడలో మూడు రోజులపాటు జరిగిన సీపీఎం రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా మహా సభ పలు తీర్మానాలను ఆమోదించింది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దునుమాడింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విస్పష్ట తీర్మానాన్ని ఆమోదించిన మహాసభ... వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాజధాని అమరావతి అభివృద్ధికి పోటీ పెట్టడం తగదని వివరించింది. సభ ఆమోదించిన ముఖ్యమైన తీర్మానాలు...


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలని సీపీఎం రాష్ట్ర 26వ మహాసభ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.

భౌగోళికంగా అమరావతి రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉంది. శాసనసభ, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే చోట ఉండాలి. అన్నీ పక్షాలు గతంలో అమరావతి రాజధానిని ఆమోదించాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించడం శ్రేయస్కరం.

రాజధాని అమరావతి ప్రాంత రైతులు, ప్రజలకు ఇచ్చిన చట్టబద్ధ హామీలు నెరవేర్చాలని చేస్తున్న ఉద్యమానికి సీపీఎం మరోసారి సంఘీభావం ప్రకటిస్తోంది.

వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిచ్చి కృషి చేయాలి. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి జరిగితేనే రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి చెందుతుంది. ఈ రెండు ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశ్రమలను స్థాపించి ఉపాధి కల్పనకు కృషి చేయాలి. 

వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కపట నాటకాలు ఆడుతోంది. కేంద్ర బడ్జెట్‌లో రాజధానికి చట్టబద్దంగా ఇవ్వాల్సిన నిధులివ్వకుండా కాలయాపన చేస్తోంది. 

విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ, కేంద్ర విద్యా, వైద్య సంస్థల ఏర్పాటు, బడ్జెట్‌ లోటు భర్తీ తదితర అంశాలలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది.

2019 ఎన్నికలలో మద్య నిషేధం అమలు చేస్తామని ప్రజలను నమ్మించి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆమేరకు మద్యాన్ని రద్దుచేయకపోగా ఏదో విధంగా మద్యం అమ్మకాలను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న జగన్‌ ప్రభుత్వం వాగ్దానాలను వమ్ము చేస్తోంది.  

మద్యం అమ్మకాల మీద ఆధారపడి సంక్షేమ చర్యలు అమలు దుర్మార్గం. మద్యానికి వ్యతిరేకంగా మహిళలు సాగించే ప్రతి ఉద్యమానికీ సీపీఎం   సంఘీభావం ప్రకటిస్తోంది. 

రాష్ట్రంలోని 124 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను పెంపుదల నిలిపేయాలని, చెత్తపన్ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

మైనారిటీల అభివృద్ధికి సబ్‌ప్లాన్‌ అమలు చేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. 

నవరత్నాలనే కాకుండా... గత ప్రభుత్వాల హయాంలో అమలు జరిపిన పథకాలన్నింటినీ పునః ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నాం.

ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచాలి. వైద్య  సేవలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. 


బీజేపీ వస్తే మేము రాం: రాఘవులు

ఒక్క కేసు బయటకు తీస్తే చాలు..: మధు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సీపీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల రాజధాని రైతు లు సీపీఎం అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎం అగ్ర నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు, మధును బుధవారం విజయవాడలో రాజధాని రైతులు కలిశారు. రాజధాని సమస్యను పార్లమెంట్‌ లో ప్రస్తావించేలా సీపీఎం చొరవ తీసుకోవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూ రి.. ‘‘అమరావతి రైతులకు పూర్తి మద్దతు ఇస్తు న్నాం. పార్టీపరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం’’ అని స్పష్టం చేశారు. బీజేపీని ఆహ్వానించే సభలకు తమను ఆహ్వానించొద్దని రాజధాని రైతులకు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. మూడు రాజధానుల వివాదం రాజుకోవడానికి కారణం బీజేపీనేనని మధు సృష్టం చేశారు. మోదీ ఒక మాట చెబితే మూడు రాజధానుల అంశం పక్కకు వెళ్లదా? అని ప్రశ్నించారు. కేంద్రం ఒక్క కేసుని బయటకు తీస్తే చాలు.. ఈ ప్రభుత్వం అమరావతే రాజధాని అని ప్రకటింస్తుందని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-12-30T08:27:00+05:30 IST