పాజిటివిటీ రేటు 1.1 శాతానికి తగ్గింది
ABN , First Publish Date - 2021-10-21T09:39:07+05:30 IST
కరోనా కట్టడికి సర్కారు తీసుకున్న చర్యలు కారణంగా పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గి ప్రస్తుతం 1.10 శాతానికి చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి సర్కారు తీసుకున్న చర్యలు కారణంగా పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గి ప్రస్తుతం 1.10 శాతానికి చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని పేర్కొంది. స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై విచారణ పూర్తి చేస్తామని ప్రతిపాదించింది. అమికస్ క్యూరీ వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం పర్యవేక్షణతోనే కొవిడ్ పరిస్థితులు మెరుగపడ్డాయని, మరికొంత కాలం వ్యాజ్యాలను మూసివేయవద్దని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను జనవరి 24కి వాయిదా వేసింది. బుధవారం జరిగిన విచారణ లో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సుమన్ వాదనలు వినిపిస్తూ.. కొవిడ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మొమో రూపంలో కోర్టుకు సమర్పించామని చెప్పారు.