బాబు.. ఫోర్‌ట్వంటీ వెధవ
ABN , First Publish Date - 2021-10-21T08:24:38+05:30 IST
‘‘ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలెవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ తాట తీసి మా నాయకుడికి చెప్పులు కుట్టిస్తా’’నంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
- నీ తాట తీసి జగన్‌కు చెప్పులు కుట్టిస్తా
- పట్టాభి ఓ పెయిడ్ ఆర్టిస్టుగాడు
- రెండు కుర్చీలు విరిగితే పవన్‌కు ఎందుకంత బాధ?: కొడాలి నాని
అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రిపై టీడీపీ నేతలెవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ తాట తీసి మా నాయకుడికి చెప్పులు కుట్టిస్తా’’నంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్‌ట్వంటీ వెధవ అని, పట్టాభి పెయిడ్ ఆర్టిస్టు అని మంత్రి దూషించారు. ‘‘రాష్ట్రంలో గంజాయి,హెరాయిన్ ముఖ్యమంత్రి సరఫరా చేయిస్తున్నారని పదిరోజులుగా పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు వాగిస్తున్నాడు. పెయిడ్ ఆర్టిస్టు పట్టాభిగాడితో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నాడు. జీతం కోసం పనిచేసే పట్టాభి, మీడియాలో చంద్రబాబు రాసిన స్ర్కిప్టును చదువుతాడు. వాడిని పట్టించుకోం’’ అని నాని ఆగ్రహించారు. పట్టాభి వ్యాఖ్యలపై నిలదీసేందుకు టీడీపీ కార్యాలయానికి వైసీపీ అభిమానులు వెళ్లారని చెప్పారు. రెండు కుర్చీలు, అద్దాలు పగలగొడితే ఏదో అయిపోయిందనట్లుగా పవన్‌కల్యాణ్ ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. ‘‘సినీరచయిత పోసాని మురళి ఇంటిపై దాడి జరిగితే ఎందుకు పవన్ ఖండించలేదు. తిరుపతిలో నాడు అమిత్‌షాపై చంద్రబాబు రాళ్లు వేయించాడు. మోదీకి నిరసన తెలియజేశాడు. చంద్రబాబు గురించి వారికి పూర్తిగా తెలుసు’’ అని చెప్పారు. తాడేపల్లి ప్యాలెస్ వదిలిరావాలని జగన్‌కు లోకేశ్ సవాల్ విసిరి.. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్దకు జగన్ అభిమానులు వచ్చినప్పుడు అక్కడ లేడెందుకని ఎద్దేవా చేశారు.