‘ఇంజనీరింగ్‌’ కౌన్సెలింగ్‌ నిర్వహించండి

ABN , First Publish Date - 2021-10-07T09:42:48+05:30 IST

ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తక్షణమే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది.

‘ఇంజనీరింగ్‌’ కౌన్సెలింగ్‌ నిర్వహించండి

  • అడ్మిషన్లకు వెంటనే నోటిఫికేషన్‌ ఇవ్వండి
  • 250 కోట్ల ట్యూషన్‌ ఫీజు బకాయిలు చెల్లించాలి
  • సీఎంకు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘం లేఖ

అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను తక్షణమే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌  ఇంజనీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. యూజీ, పీజీ కలిపి రూ.250 కోట్లు ట్యూషన్‌ ఫీజుల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, వాటిని తక్షణమే విడుదల చేయాలని విన్నవించింది. బుధవారం సీఎం జగన్‌కు ఈ మేరకు లేఖ రాసినట్లు అపెక్స్‌మా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, ట్రెజర్లు సీహెచ్‌ గంగిరెడ్డి, ఎం శ్రీధర్‌, ఎస్‌ కీర్తికుమార్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్‌ అడ్మిషన్లకు తక్షణమే నోటిఫికేషన్‌ ఇచ్చి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు. ఆగస్టు 25న పరీక్ష నిర్వహించి సెప్టెంబరు 13 ఫలితాలు విడుదల చేసి ఇప్పటి వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించకపోవడం వల్ల ఎక్కువ  మంది విద్యార్థులు ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారన్నారు. ఇఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించపోవ డం వల్ల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. త్వరగా నోటిఫికేషన్‌ విడుదల చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు.


2018-19 విద్యాసంవత్సరానికి గాను ట్యూషన్‌ ఫీజు రూ.250 కోట్లు పెండింగ్‌లో ఉందన్నారు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌ కళాశాలలకు రూ. 400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జగనన్న దీవెన పథకం కింద 2020-21 విద్యాసంవత్సరంలో 3, 4 విడతల నగదు పెండింగ్‌ లో ఉందన్నారు. దీంతో సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కళాశాలలకు లేదన్నారు. ఈ నెల 31 తేదీలోపు బకాయిలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-10-07T09:42:48+05:30 IST