డిగ్రీ తరగతులెప్పుడు?

ABN , First Publish Date - 2021-10-07T09:42:00+05:30 IST

కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్‌లో అందరినీ పాస్‌ చేసేశారు. దీంతో ఇక డిగ్రీ కళాశాలల్లో చేరడమే తరువాయి అనుకున్నారు.

డిగ్రీ తరగతులెప్పుడు?

  • మేనేజ్‌మెంట్‌ ‘కోటా’తో ఆగిన అడ్మిషన్లు
  • తిరిగి ఎప్పుడు చేపడతారో తెలియని అనిశ్చితి
  • 1 నుంచే తరగతులు నిర్వహించాలన్న యూజీసీ
  • తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోను ప్రారంభం
  • రాష్ట్రంలో విద్యార్థులు, తల్లిదండ్రుల అయోమయం
  • 2.63 లక్షల మంది డిగ్రీ విద్యార్థులపై ప్రభావం
  • సమాధానం చెప్పలేక యాజమాన్యాల ఫోన్లు స్విచ్ఛాఫ్‌
  • కొన్ని కాలేజీల రాజకీయ పైరవీతోనే ‘కోటా’ ప్రతిపాదన
  • 80 వేల మందికి రీయింబర్స్‌మెంట్‌ నిలిచిపోయే ప్రమాదం
  • ఆ డబ్బు మిగుల్చుకునేందుకేనా ప్రభుత్వ నిర్ణయం?


(అమరావతి-ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్‌లో అందరినీ పాస్‌ చేసేశారు. దీంతో ఇక డిగ్రీ కళాశాలల్లో చేరడమే తరువాయి అనుకున్నారు. యూజీసీ(యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) కూడా అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలని మార్గదర్శకాలిచ్చింది. దాని ప్రకారం ఒకటో తేదీ నుంచే డిగ్రీ కళాశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులిచ్చింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల కోసం సెప్టెంబరు చివరిలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే, డిగ్రీలోనూ 30శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా కింద పెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దాంతో ఆ నిర్ణయం తుదిరూపు తీసుకుని, ఉత్తర్వులు వచ్చేవరకు డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్లను ఆపేయాలని ఆదేశించడంతో అడ్మిషన్ల ప్రక్రియ ఆగిపోయింది. అడ్మిషన్లు తిరిగి ఎప్పుడు చేపడతారో? ఎప్పుడు పూర్తవుతాయో? తెలియని పరిస్థితి. రాష్ట్రంలోని 1138 డిగ్రీ కళాశాలల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న సుమారు 2.63 లక్షల మంది విద్యార్థులు ఏం జరుగుతోందో తెలియక అయోమయంలో ఉన్నారు. కళాశాలల మేనేజ్‌మెంట్లదీ అదే పరిస్థితి కావడంతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక చాలామంది ఫోన్లు ఎత్తడం లేదు. కొన్ని మేనేజ్‌మెంట్లయితే ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసేశాయి. పొరుగునున్న తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోను యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఈనెల ఒకటో తేదీ నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. మన రాష్ట్రంలో మాత్రం అనిశ్చితి నెలకొంది.

 

80వేలమందికి రీయింబర్స్‌మెంట్‌ కట్‌?

ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్‌, పాలిటెక్నిక్‌ కళాశాలల వరకు అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి తరగతులు ప్రారంభమయ్యాయి. కొంత ఆలస్యమైనా ఇంజనీరింగ్‌ కళాశాలల అడ్మిషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. కానీ డిగ్రీ, పీజీ కళాశాలలకు మాత్రం మేనేజ్‌మెంట్‌ కోటా అన్న గ్రహణం పట్టింది. వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రమే ఇప్పటి వరకు మేనేజ్‌మెంట్‌ సీట్ల కోటా ఉంది. డిగ్రీ, పీజీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోటా  ఇప్పటివరకూ లేదు. మేనేజ్‌మెంట్‌ కోటా పెట్టే పద్ధతిని అటు విద్యార్థులు కానీ, ఇటు అత్యధిక కళాశాలల యాజమాన్యాలు కానీ కోరుకోవడం లేదు. కొన్ని కళాశాలలు మాత్రమే దీని కోసం రాజకీయ పైరవీ చేశాయని సమాచారం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ భారం తగ్గుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా దీని అమలుకు ప్రాథమికంగా నిర్ణయించిందని సమాచారం. మేనేజ్‌మెంట్‌ కోటా కింద 30శాతం సీట్లు తోసేస్తే, డబ్బున్న వాళ్లుగా పరిగణించి ఇక ఆ సీట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వక్కర్లేదు. అలాగే, ఆ సీట్లకు మూడురెట్ల ఫీజు వసూలుచేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. డిగ్రీలో మూడురెట్ల ఫీజు కట్టి కోర్సుల్లో చేరేవారు ఎవరుంటారో ప్రభుత్వానికే తెలియాలి. గతేడాది డిగ్రీ కళాశాలల్లో 2.63 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఈ ఏడాది కూడా అంతే మంది చేరతారని అంచనా. ఇందులో 30శాతం సీట్లు అంటే దాదాపు 80 వేలమందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.

 

ఇప్పటికిప్పుడే ఎందుకు?

మేనేజ్‌మెంట్‌ కోటా నిర్ణయాన్ని అడ్మిషన్ల ప్రక్రియ మొదలయ్యాక చేయడమేంటనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ పద్ధతిని ప్రవేశపెట్టాల్సినంత అవసరం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయిస్తే, ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియకు ఆటంకాలు ఉండేవి కావని అంటున్నారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమయ్యే కొద్దీ సిలబస్‌ పూర్తికాక, తూతూమంత్రంగా, హడావుడి బోధనతో విద్యలో నాణ్యత తగ్గే ప్రమాదముందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


సుమారు 80 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోత వేయొచ్చన్న ఆలోచనతో డిగ్రీ అడ్మిషన్లలోనూ మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయం మొత్తంగా డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియే నిలిచిపోయేందుకు కారణమైంది. తిరిగి ఎప్పుడు అడ్మిషన్లు చేపడతారో? కళాశాలలు ఎప్పుడు తెరుస్తారో? ఎప్పుడు తరగతులు ప్రారంభమవుతాయో? తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సమాధానాలు చెప్పలేక కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకోవడం గమనార్హం.

Updated Date - 2021-10-07T09:42:00+05:30 IST