‘కొల్లేరు’ అంబాసిడర్‌గా గూడకొంగ

ABN , First Publish Date - 2021-10-07T09:14:39+05:30 IST

వలస పక్షులకు ఆవాసమైన కొల్లేరులో హంగామా చేసే గూడకొంగ (పెలికాన్‌)కు అరుదైన గుర్తింపు దక్కింది.

‘కొల్లేరు’ అంబాసిడర్‌గా గూడకొంగ

  • ఎంపిక చేసిన రాష్ట్ర అటవీశాఖ
  • వలస పక్షికి అరుదైన గుర్తింపు

అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వలస పక్షులకు ఆవాసమైన కొల్లేరులో హంగామా చేసే గూడకొంగ (పెలికాన్‌)కు అరుదైన గుర్తింపు దక్కింది. రాష్ట్ర అటవీశాఖ ఈ గూడకొంగను కొల్లేరుకు అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొంగజాతుల్లో 40 శాతానికి పైగా గూడకొంగలు కొల్లేరులోనే ఉన్నాయి. దీంతో ఈ పక్షిని కొల్లేరు అంబాసిడర్‌గా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొల్లేరుకు ప్రతి ఏటా దేశవిదేశాల నుంచి అనేక రకాల పక్షులు వలసొచ్చి సందర్శకులకు కనువిందు చేస్తుంటాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన నీరున్న పెద్ద సరస్సుగా పేరున్న ఈ కొల్లేరు సరస్సు కాలక్రమంలో ఆక్రమణలకు గురైంది. కానీ పక్షుల రాక మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కొల్లేరులో సగ ప్రాంతం పక్షుల అభయారణ్యంగా, మరికొంత ప్రాంతం వెట్‌ల్యాండ్‌ (చిత్తడి నేల)గా ఉంది. ఇక్కడ గూడకొంగలు ఎక్కువగా ఉండడంతో ఆ పక్షినే కొల్లేరుకు అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు రాష్ట్ర అటవీ దళాధిపతి ఎన్‌ ప్రతీ్‌పకుమార్‌ ప్రకటించారు.


కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని రాష్ట్ర అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఏపీ జీవవైవిధ్య మ్యాప్‌, కొల్లేరు అంబాసిడర్‌ గూడకొంగ పోస్టర్లను బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లేరు ప్రాంత పరిరక్షణకు సేవా దృక్పథమున్న వారిని గుర్తించి, వెట్‌ల్యాండ్‌ మిత్రా్‌సగా నియమించనున్నట్లు తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణ ఆవశ్యకతను తెలిపేలా  అటవీశాఖ చైతన్య కార్యక్రమాలు చేపడుతోందని ఆయన వివరించారు.

Updated Date - 2021-10-07T09:14:39+05:30 IST