రాష్ట్రంలో సైకో పాలన

ABN , First Publish Date - 2021-10-07T08:57:55+05:30 IST

‘‘రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోంది. ఒక సైకో వల్ల అనేక వర్గాల ప్రజలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు.

రాష్ట్రంలో సైకో పాలన

ఇంత అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదు: చంద్రబాబు

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోంది. ఒక సైకో వల్ల అనేక వర్గాల ప్రజలు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. రాష్ట్రం అథమ స్థితికి దిగజారి మూల్యం చెల్లించుకొనే పరిస్థితి ఏర్పడింది’’ అని  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పరిశీలకులతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రెండున్నరేళ్లలో ఇంత అరాచకం సృష్టించిన ప్రభుత్వం మరొకటి లేదు. ఇంత తక్కువకాలంలో ఇంత అప్రతిష్టకు గురైన ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో లేదు. టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ చేసిన దుష్ప్రచారాన్ని అప్పట్లో ప్రజలు నమ్మారు. వారికి అసలు వాస్తవాలు ఇప్పుడు తెలిసివస్తున్నాయి. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చిన్న చిన్న పనులు చేసినవారికి బిల్లులు ఇవ్వకుండా వారు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి తెచ్చారు. ఈ ప్రభుత్వంలో పనులు చేసిన వారికి కూడా బిల్లులు ఇవ్వడం లేదు. 


మొత్తం రూ.70వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కట్టిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా నాశనం చేస్తున్నారు. ట్రూ అప్‌ మొదలుకొని రకరకాల పేర్లతో ప్రజలపై మోయరాని కరెంటు చార్జీల భారం మోపుతోంది. నాసిరకం మద్యం తయారుచేసి సొంత బ్రాండ్ల పేర్లు పెట్టి ప్రజలతో బలవంతంగా తాగిస్తున్నారు. ఆదాయం కోసం మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచుతున్నారు. మద్యం అమ్మకాలను చూపించి రూ.75వేల కోట్ల మేర అప్పులు తెస్తున్నారు. మద్యమే ప్రభుత్వానికి సర్వస్వంగా మారిపోయింది’’ అని ఆయన ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఎక్కడా వీసమెత్తు సంపద సృష్టి లేదని, ఆదాయం పెంచుకోకుండా ప్రజల ఆస్తులను అయినకాడికి అమ్మివేస్తున్నారని ఆరోపించారు.  సీమలో సాగునీటి పఽథకాలను జగన్‌రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో నదుల అనుసంధానానికి రూపకల్పన చేసి బనకచర్ల వరకూ నీటిని తీసుకువెళ్లే ప్రణాళిక రూపొందించామన్నారు. ఇప్పుడు దానిని పూర్తిగా అటకెక్కించారన్నారు. ఏ ప్రాంత అభివృద్ధి లేదని, విధ్వంసం ఒకటే మిగిలిందని చంద్రబాబు విమర్శించారు. 

Updated Date - 2021-10-07T08:57:55+05:30 IST