ఒక్క చాన్స్‌ అడిగి.. నాశనం చేసేశాడు: సత్యకుమార్‌

ABN , First Publish Date - 2021-10-07T08:52:39+05:30 IST

‘‘ఒక నాయకుడు ఒక్క చాన్స్‌ అడిగాడు. ఒక్కో వ్యవస్థనూ నాశనం చేసేశాడు’’ అని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు.

ఒక్క చాన్స్‌ అడిగి.. నాశనం చేసేశాడు: సత్యకుమార్‌

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘ఒక నాయకుడు ఒక్క చాన్స్‌ అడిగాడు. ఒక్కో వ్యవస్థనూ నాశనం చేసేశాడు’’ అని ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ వ్యాఖ్యానించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన మీడియా తో మాట్లాడారు. వైసీపీ పాలకులకు కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదన్నారు. రోడ్ల మరమ్మత్తుల కోసం కేంద్రం రూ.2,600 కోట్లు మంజూరు చేస్తే కనీసం గోతులు పూడ్చలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో విద్యుత్‌ చార్జీలు పెంచితే... ‘ముఖ్యమంత్రిని కాల్చి చంపాలి’ అన్న జగన్‌ ఆరుసార్లు చార్జీలు పెంచారని, మరిప్పుడు ఆయన్ను ఏమనాలని ప్రశ్నించారు. జాతీయ కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ గురించి చేస్తున్న వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఆంధ్రుడిగా సిగ్గుపడ్డానని తెలిపారు. డ్రగ్స్‌ వ్యాపారంలో వైసీపీ నాయకుల బంధువులు ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోయానన్నారు. 

Updated Date - 2021-10-07T08:52:39+05:30 IST