కేబినెట్‌ నిర్ణయమే సుప్రీం!

ABN , First Publish Date - 2021-10-07T08:50:36+05:30 IST

పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో కేంద్రం మరింత మొండిగా వ్యవహరిస్తోంది.

కేబినెట్‌ నిర్ణయమే సుప్రీం!

  • అదనపు నిధుల మంజూరుకు దాని ఆమోదం తప్పనిసరి
  • పోలవరం తాగునీటి పథకాలకు 4,068 కోట్లు అదనంగా ఇవ్వలేం
  • కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టీకరణ
  • జలశక్తి శాఖకు ఘాటుగా లేఖ


(అమరావతి-ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు నిధుల విషయంలో కేంద్రం మరింత మొండిగా వ్యవహరిస్తోంది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన తాగునీటి పథకాలకు రూ.4,068 కోట్లు చెల్లించాలని కేంద్ర జలశక్తి శాఖ రాసిన లేఖపై కేంద్ర ఆర్థిక శాఖ ఘాటుగా సమాధానం ఇచ్చింది. కేంద్ర కేబినెట్‌ నిర్ణయమే సుప్రీం అని, దాని ఆమోదం లేకుండా అదనపు నిధుల మంజూరు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ప్రాజెక్టు రెండో సవరణ అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఆమోదించాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పదే పదే కోరుతుండడంతో.. జలశక్తి శాఖ స్పందించింది. అదనపు నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫారసు చేసింది. ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో ఈ రెండు శాఖల మధ్య నడచిన ఉత్తర, ప్రత్యుత్తరాలు ఇటీవల వెలుగుచూశాయి. ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం ఎంత మొండిగా ఉందో వీటిని చూస్తే అర్థమవుతోందని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. 


పోలవరం ప్రాజెక్టులో భాగంగా తాగునీటి పథకాలకు రూ.4,068 కోట్లను అదనంగా మంజూరు చేయాలని జలశక్తి శాఖ లేఖ రాసింది. మహారాష్ట్రలోని గోసీ ఖుర్ద్‌ జాతీయ ప్రాజెక్టు, హిమాచల్‌ ప్రదేశ్‌లోని రేణుకా ప్రాజెక్టులకు సాగు నీటి పథకాలతో పాటు తాగునీటి పథకాలకూ అదనపు నిధులు మంజూరు చేయడాన్ని అందులో గుర్తుచేసింది. అయితే ఈ ప్రాజెక్టుల్లో తాగునీటి పథకాలను చేపట్టడానికి గల ఆవశ్యకతను గుర్తించాలని, అలాంటి పరిస్థితులు పోలవరం పరిధిలో లేవని ఆర్థిక శాఖ ఆగస్టు 24వ తేదీన రాసిన లేఖలో గట్టిగా బదులిచ్చింది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆదనపు నిధులివ్వాలంటే కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందాలంది. పైగా 2013-14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లకే 2017 మార్చి 15న జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్‌ ఆమోదించినందున.. అంతకు మించి నిధులు విడుదల చేయడం సాధ్యం కాదని తెలిపింది. 

Updated Date - 2021-10-07T08:50:36+05:30 IST