‘చెత్త’ కేంద్రాలకు వైసీపీ రంగులు తొలగించాం

ABN , First Publish Date - 2021-10-07T08:44:14+05:30 IST

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వేసిన వైసీపీ రంగులు తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

‘చెత్త’ కేంద్రాలకు వైసీపీ రంగులు తొలగించాం

  • భవిష్యత్తులో మరోసారి వేయకుండా ఆదేశాలు ఇచ్చాం 
  • హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం


అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వేసిన వైసీపీ రంగులు తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. భవిష్యత్తులో మరోసారి ఆ రంగులు వేయకుండా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, కోర్టు ఉత్తర్వులు అమలు చేశామని పేర్కొంది. ఆ వివరాలను నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కృష్ణాజిల్లా చందర్లపాడు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలాల పరిధిలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ జెండా రంగులు వేయడాన్ని సవాల్‌ చేస్తూ జై భీమ్‌ యాక్సెస్‌ టు జస్టిస్‌ కృష్ణాజిల్లా అధ్యక్షుడు పరసా సురేశ్‌కుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై విచారణ జరిపిన హైకోర్టు... అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేంద్రాలకు వైసీపీ రంగులు తొలగించడంతో పాటు భవిష్యత్తులో అలాంటి రంగులు వేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించింది. బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.... కోర్టు ఆదేశాల మేరకు రంగులు తొలగించినట్లు ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసిందన్నారు. 

Updated Date - 2021-10-07T08:44:14+05:30 IST