అక్కసు ఖరీదు 1000 కోట్లు!

ABN , First Publish Date - 2021-10-07T08:43:11+05:30 IST

ప్రత్యర్థి పార్టీపై అక్కసు, వారిని ఆర్థికంగా దెబ్బతీయాలన్న వైఖరి ప్రభుత్వంపై భారీ భారం మోపింది.

అక్కసు ఖరీదు 1000 కోట్లు!

  • అనాలోచిత నిర్ణయాలతో సర్కారు సొమ్ము వృథా 
  • ప్రత్యర్థి పార్టీపై పగతో బిల్లుల నిలిపివేత 
  • కోర్టు ఆదేశాలతో వడ్డీతో చెల్లించాల్సిన పరిస్థితి
  • నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాలకు 
  • వైసీపీ రంగులు.. కోర్టు ఆదేశాలతో మళ్లీ మార్పు
  • అసంబద్ధ నిర్ణయాలతో కోర్టుల్లో ఎదురుదెబ్బలు
  • న్యాయవాదులకు కోట్లలో ఫీజులు చెల్లింపు 


‘ఆ ఉపాధి పనులన్నీ టీడీపీ సర్పంచుల హయాంలో జరిగాయి. వాటి బిల్లులు ఆపాల్సిందే’... ఇది అక్కసు!  ‘అధికారంలో ఉన్నది మనమే! ఆఫీసులకు మన పార్టీ రంగులే వేయాలి’... ఇది అనాలోచిత నిర్ణయం! ఈ చర్యల విలువ ఎంతో తెలుసా? అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు! ఖజానా ఖాళీ అయి అప్పుల మీద బండి లాగిస్తున్న సర్కారు వారి ‘వృథా వ్యధ’ ఖరీదు ఇది!


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ప్రత్యర్థి పార్టీపై అక్కసు, వారిని ఆర్థికంగా దెబ్బతీయాలన్న వైఖరి  ప్రభుత్వంపై భారీ భారం మోపింది. ఇతర అనాలోచిత నిర్ణయాలతో ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా దుర్వినియోగం చేశారు.  పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న పలు చర్యలు శృతిమించాయి. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులన్నింటికీ బిల్లులు నిలిపేయడం.. కోర్టులకు పదే పదే తప్పుడు సమాచారమివ్వడం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం.. కోర్టు మొట్టికాయలతో తిరిగి రంగులు మార్చడం.. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం.. కొత్త వారిని నియమించడం.. కోర్టు ఆదేశాలతో మళ్లీ పునర్నియామకం.. తాము తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను సమర్థించుకోవడానికి రూ.కోట్లు వెచ్చించి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయవాదులను నియమించడం.. వెరసి వైసీపీ సర్కారు వచ్చిన రెండేళ్లలో 1000కోట్లు దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


బిల్లులాపి 576 కోట్లు మూల్యం 

వైసీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే టీడీపీ నేతలు, కార్యకర్తలకు సంబంధించిన అన్ని బిల్లులు నిలిపేసింది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఇతర అవసరాలకు వినియోగించింది. 2018 అక్టోబరు నుంచి చెల్లించాల్సిన సుమారు రూ.2400 కోట్ల మేర బిల్లులు ఆపేసింది. ఈ బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి పనులు చేపట్టిన మాజీ సర్పంచ్‌లు తమకున్న ఆస్తులను అమ్ముకున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం కరుణించలేదు. దీంతో తమ బిల్లులు చెల్లించాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టుకు ప్రభుత్వ అధికారులు తప్పుడు సమాచారమిచ్చి మరింత జాప్యం చేశారు. ఆ తర్వాత ఆ పనులపై విజిలెన్స్‌ విచారణ చేపడుతున్నామని, విచారణ పూర్తయిన తర్వాత బిల్లులు చెల్లిస్తామని మరికొంత కాలం జాప్యం చేశారు. హైకోర్టుకు సరైన సమాచారం ఇవ్వడంలో కేంద్ర అధికారులు కూడా తాత్సారం చేశారు. చివరకు హైకోర్టు ఐఏఎస్‌ అధికారులపై ఒత్తిడి పెంచింది. ఈ బిల్లులకు సంబంధించి సీఎ్‌సను సైతం కోర్టుకు పిలిచింది. కోర్టు ఆదేశాలతో సర్కార్‌కు బిల్లులు చెల్లించక తప్పలేదు. ఈ పెండింగ్‌ బిల్లులకు సంబంధించి 12 శాతం వడ్డీతో చెల్లించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. దీంతో రెండేళ్లపాటు రూ.2400కోట్ల బిల్లుల బకాయిలకు సుమారు రూ.576 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంది. 


పార్టీ రంగులతో వృథా ఖర్చు 

గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు  వేయాలన్న విపరీత ఆలోచనకు పంచాయతీరాజ్‌ శాఖ శ్రీకారం చుట్టింది. మంత్రి ఆదేశించడమే తడువుగా తామే ముందున్నామంటూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ఖిఽ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలతో కమిషనర్‌ సర్క్యులర్‌ జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ భవనాలకు, వాటర్‌ ట్యాంకులకు, ఆఖరుకు గాంధీ, నెహ్రూ బొమ్మలకు కూడా వైసీపీ జెండా రంగులు బ్లూ, గ్రీన్‌ అద్దారు. దీనిపై గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కోర్టులో సవాలు చేశారు. దీనిపై కూడా పంచాయతీరాజ్‌ అధికారులు కోర్టుకు సరైన సమాచారమివ్వకుండా జాప్యం చేయడంతో నెలల తరబడి వ్యాజ్యం నడిచింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయరాదని హైకోర్టు తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేసింది. ఇందుకోసం లక్షలు వెచ్చించి లాయర్లను నియమించింది. సుప్రీం కోర్టులోనూ తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు క్రీం వైట్‌ కలర్‌ వేయాల్సివచ్చింది. ఈ మార్పులకోసం 400కోట్లు దాకా ఖర్చయినట్టు అంచనా. 


లాయర్లకు భారీ ఫీజులు

స్థానిక ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంతో అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగించారు. ఆఘమేఘాల మీద చెన్నై నుంచి రిటైర్డ్‌ జస్టిస్‌ కనగరాజన్‌ను నియమించారు. నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడంతో తిరిగి ఆయన్ను నియమించాల్సి వచ్చింది. అయితే, ఇందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో గవర్నర్‌ సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు, హైకోర్టు లాయర్ల ఫీజులు కోసం అడ్డగోలుగా ఖర్చు చేశారు. ప్రభుత్వ భవనాలకు రంగులు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు కేసుల్లో ప్రభుత్వం రూ.50 కోట్లకు పైగా వ్యయం చేసిందని లెక్కలు చెబుతున్నాయి. 


కోర్టు మెట్టెక్కిన ఐఏఎస్‌లు.. 

చట్ట విరుద్ధమైన నిర్ణయాలు అని తెలిసినా ఐఏఎస్‌ అధికారులు ప్రభుత్వ పెద్దలకు వంత పాడారన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ రంగులు వేయడం, ఎన్నికల కమిషనర్‌ను మార్చడం తదితర అంశాల్లో ఉన్నతాధికారులు రాజభక్తి ప్రదర్శించుకున్నారు. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఏది చెబితే దానికి తలూపారన్న విమర్శలు వచ్చాయి. పదే పదే కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు కోర్టుకు హాజరైనన్ని సార్లు మరే శాఖ అధికారులు హాజరు కాలేదు. ఓ వైపు హైకోర్టు, సుప్రీం కోర్టు తప్పుపడుతున్నా.. అధికారులు మాత్రం ప్రభుత్వ పెద్దల ఆదేశాలే శిరోధార్యంగా పనిచేసి, నిబంధనలకు నీళ్లు వదిలారన్న ఆరోపణలున్నాయి. ఈ అధికారులు సరైన సూచనలు చేసుంటే రూ.1000 కోట్లు నిధులు వృథా అయ్యేవి కావని అభిప్రాయ పడుతున్నారు. 

Updated Date - 2021-10-07T08:43:11+05:30 IST