ఆ భూములపై ఉత్తర్వులు ఇవ్వలేదు

ABN , First Publish Date - 2021-10-07T08:22:52+05:30 IST

గుడివాడలో మంత్రి కన్నేసిన ఆలయ భూములపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని దేవదాయశాఖ స్పష్టం చేసింది.

ఆ భూములపై ఉత్తర్వులు ఇవ్వలేదు

  • గుడివాడ భూములపై దేవదాయశాఖ వెల్లడి
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గుడివాడలో మంత్రి కన్నేసిన ఆలయ భూములపై ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని దేవదాయశాఖ స్పష్టం చేసింది. అయితే గుడివాడ పేరు ప్రస్తావించకుండా ‘ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలిచిన భూములకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులూ జారీచేయలేదు’ అని పరోక్షంగా తెలిపింది. ‘ఆక్రమణలో లక్ష ఎకరాలు’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆ శాఖ స్పందించింది. తమ శాఖకు రాష్ట్రవ్యాప్తంగా 4.09 లక్షల ఎకరాల భూములు ఉన్నాయని, వాటిని రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు అవకాశం లేకుండా నిషేధిత జాబితాలో చేర్చామని వివరించింది. నిషేధిత జాబితా రూపొందించినప్పుడు పొరపాటున ఇతర భూములు అందులో చేరితే వాటికి మాత్రమే ఎన్‌వోసీలు ఇస్తున్నామని తెలిపింది. వ్యవసాయ భూములను బహిరంగ వేలం ద్వారానే కౌలుకు ఇస్తున్నట్లు పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ చట్టం కింద వివిధ శాఖలు తీసుకున్న భూమికి సంబంధించిన బకాయిలు రాబట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. భూముల ఆక్రమణల గురించి గానీ, ఎన్ని ఎకరాలను ఆక్రమణదారుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నారనే విషయాన్నిగానీ దేవదాయశాఖ తన ప్రకటనలో పేర్కొనలేదు. గతంలో లీజుకు తీసుకుని లీజు గడువు ముగిసినా భూములు అప్పగించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కూడా వివరించలేదు.

Updated Date - 2021-10-07T08:22:52+05:30 IST