ఏ వ్యాధికైనా ఇక్కడే వైద్యం!

ABN , First Publish Date - 2021-10-07T08:16:13+05:30 IST

ఎలాంటి వ్యాధికైనా మన రాష్ట్రంలోనే చికిత్స అందించే పరిస్థితి ఉండాలని, వైద్యం కోసం ఎవరూ ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు.

ఏ వ్యాధికైనా ఇక్కడే వైద్యం!

  • ఎవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు
  • స్పెషలైజేషన్‌ ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి
  • 2022 జనవరి 26 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ విధానం
  • మెడికల్‌ కాలేజీల నిర్మాణ సమస్యలు పరిష్కరించండి
  • ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సీఎం జగన్‌ ఆదేశం
  • కొవిడ్‌-19, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై సమీక్ష
  • ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి రాకూడదు: సీఎం


అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి వ్యాధికైనా మన రాష్ట్రంలోనే చికిత్స అందించే పరిస్థితి ఉండాలని, వైద్యం కోసం ఎవరూ ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో కొవిడ్‌-19 నివారణ, వ్యాక్సినేషన్‌తో పాటు హెల్త్‌హబ్‌లపై ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్‌ కాలేజీల నిర్మాణం, హెల్త్‌హబ్‌ల ఏర్పాటుపై చర్చించారు. మన రాష్ట్రం నుంచి ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో గుర్తించి ఇక్కడ కూడా ఆయా చికిత్సలు అందించే ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌ ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే వాటిని ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలన్నారు. 


నిర్మాణ పనులు శరవేగంగా సాగాలన్నారు. వచ్చే జనవరి 26 నాటికి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం పూర్తిస్థాయిలో అమలు కావాలని ఆదేశించారు. కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు-నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలు, 104 వాహనాల కొనుగోలు వంటివి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. స్వేచ్ఛ కార్యక్రమంపై బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యమివ్వాలన్నారు. ఆరోగ్యశ్రీపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలని, ఆరోగ్యశ్రీ రిఫరల్‌ విధానంపై ప్రచారం చేయాలని చెప్పారు. డిజిటల్‌ హెల్త్‌ కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. వైద్య పరీక్షలు, వాటి ఫలితాలు, చికిత్స, వినియోగిస్తున్న మందులు వంటి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలని కోరారు. దీని వల్ల దేశంలో ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందన్నారు.

Updated Date - 2021-10-07T08:16:13+05:30 IST