హా..స్పత్రులు!

ABN , First Publish Date - 2021-10-07T08:03:57+05:30 IST

‘‘ఎలాంటి వ్యాధికైనా మన రాష్ట్రంలోనే చికిత్స అందాలి.

హా..స్పత్రులు!

  • సర్కారు దెబ్బకు హాహాకారాలు
  • వైసీపీ ప్రభుత్వ తీరుతో అంతా రివర్స్‌
  • నాడు అమరావతికి వచ్చే యత్నాలు
  • ఏపీ వైపు ప్రముఖ సంస్థల చూపు
  • ‘హెల్త్‌ సిటీ’లో స్థలాలూ కేటాయింపు
  • సర్కారు మారగానే అమరావతి ఔట్‌
  • వైసీపీ ప్రభుత్వ ‘రివర్స్‌’ ఆలోచనలు
  • మారిన యాజమాన్యాల వైఖరి
  • ఉన్న వాటిలోనూ అభద్రతా భావం
  • అసంబద్ధ షరతులే కారణమనే ఆరోపణ
  • సూపర్‌ స్పెషాలిటీలో వెనుకబడ్డ ఏపీ
  • కరోనాలో అంబులెన్స్‌ల బారులు
  • మంత్రులు, అధికారులదీ అదే దారి
  • ప్రాణాలమీదికి వస్తే పొరుగుకు పరుగే
  • అలా కావొద్దని తాజాగా జగన్‌ ఆకాంక్ష

రావాలనుకుని... రాంరాం

మాతా అమృతానందమయి సంస్థ అమరావతిలో ఒక మెడికల్‌ కాలేజీతోపాటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముందుకు వచ్చింది. వెలగపూడిలోనే ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని, ఒప్పందం కూడా చేసుకుంది. ప్రస్తుతం అమరావతే లేదు. ఏపీలో మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్‌ ఏర్పాటు ప్రతిపాదనను అమృతానందమయి సంస్థ విరమించుకున్నట్లు తెలుస్తోంది. 


హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. ఏపీ నుంచి వందల సంఖ్యలో కేన్సర్‌ బాధితులు అక్కడికే వెళ్తున్నారు. అలాంటి సంస్థను మన రాష్ట్రానికే రప్పించాలని భావించి, భూమి కూడా కేటాయించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చాక పరిస్థితి మారిపోయింది.


ఇండో అమెరికన్‌ హాస్పిటల్‌, నేషనల్‌ మెడికల్‌ సెంటర్‌, కిమ్స్‌, అపోలో, మెడికవర్‌ వంటి ప్రముఖ ఆస్పత్రులు ఏపీకి రావాలనుకుని... అప్పటి ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపాయి. ఆ తర్వాత... ఏమైందో తెలియదు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి): ‘‘ఎలాంటి వ్యాధికైనా మన రాష్ట్రంలోనే చికిత్స అందాలి. వైద్యం కోసం ఎవరూ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు!’’... ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆకాంక్ష, ఆశ, లక్ష్యం! అసలు విషయం ఏమిటంటే, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న అనేక వైద్య సంస్థలు ఏపీ వైపు చూడటానికి వెనుకడుగు వేస్తున్నాయి. కొత్తగా  వచ్చే వాటి సంగతి పక్కనపెడితే... ఇప్పటికే సేవలు అందిస్తున్న సంస్థలూ అభద్రతాభావంతో ‘పక్క’ చూపులు చూస్తున్నాయి. అధికారంలోకి వచ్చీ రాగానే తీసుకున్న ‘రివర్స్‌’ నిర్ణయాలూ, కొవిడ్‌ సమయంలో ప్రైవేటు ఆస్పత్రులపై మితిమీరిన/అహేతుకమైన ఆంక్షలే దీనికి కారణమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. బీమా ఉండి, ఖర్చు భరించగలిగే శక్తి ఉన్న వారు ‘తీవ్రమైన’ ఆరోగ్య సమస్యలకు చికిత్స కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకే వెళుతున్నారు. గుండె శస్త్ర చికిత్సలకు అత్యధికులు హైదరాబాద్‌లోని బడా ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఇక... కేన్సర్‌ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది భాగ్యనగరంలోని బసవతారకం ఆస్పత్రే! బ్రెయిన్‌ సర్జరీలు, కాలేయ మార్పిడి చికిత్సలకూ పొరుగు రాష్ట్రాలకే పరుగు తీస్తున్నారు. నవ్యాంధ్ర ఏర్పడి ఏడేళ్లు దాటినా క్రిటికల్‌-సూపర్‌ స్పెషాలిటీ సేవలు తగిన స్థాయిలో లేవన్నది నిర్వివాదాంశం. మొన్నటికి మొన్న కరోనా సెకండ్‌ వేవ్‌  సమయంలో ఏపీలోని అన్ని వైపుల నుంచీ అంబులెన్స్‌లు హైదరాబాద్‌కు బారులు తీరాయి. చివరికి... ఇతర రాష్ట్రాల వారికి అనుమతి లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లోనే నిలిపివేసింది. సీఎంఓలోని పలువురు ఉన్నతాధికారులకు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. కొందరు మంత్రులూ కొవిడ్‌ పొరుగు రాష్ట్రంలోని ఆస్పత్రులనే నమ్ముకుని, అక్కడే చికిత్స పొందారు.



అమరావతితో పాటే అటకెక్కి...

హైదరాబాద్‌ తరహాలో అమరావతినీ ‘హెల్త్‌ హబ్‌’గా మార్చాలని గత ప్రభుత్వం భావించింది. అమరావతిలోని నవ నగరాల్లో... ‘హెల్త్‌ సిటీ’ కూడా ఒకటి. హైదరాబాద్‌లోని ప్రధాన కార్పొరేట్‌ ఆస్పత్రులు అనేకం ఇక్కడ తమ కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించాయి. అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. హెల్త్‌ సిటీలో ఆస్పత్రుల నిర్మాణానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. వీటిలో కొన్నిటికి ప్రభుత్వం భూములిచ్చింది. 2019 ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది. వైసీపీ సర్కారు అమరావతినే అటకెక్కించింది. అన్ని నిర్మాణాలను, ప్రాజెక్టులను నిలిపివేసింది. అమరావతే లేనప్పుడు... అందులో భాగమైన హెల్త్‌ సిటీ ఎక్కడుంటుంది? నిజానికి అమరావతిని ఆపివేస్తున్నట్లు ప్రకటన రాకముందే ఆస్పత్రుల యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరించాయి. కొత్త ప్రభుత్వ వ్యవహార శైలి చూశాకే అడుగు పెట్టాలనుకున్నాయి. 3నెలల్లోనే సర్కారు వారి ‘రివర్స్‌’ కథలు దేశానికి తెలిసిపోయాయి. ఏపీలో కోట్ల పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడడంకంటే... హైదరాబాద్‌లోనే ఉండి, మరికొంత విస్తరించుకోవడం మేలనే నిర్ణయానికి వచ్చాయి.


ప్రముఖ వైద్య సంస్థలు రాష్ట్రానికి వచ్చే సంగతి పక్కన పెడితే... ఇప్పటికే ఉన్న ఆస్పత్రులు ‘పక్క’ చూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ చర్యలతో అభద్రతా భావానికి గురవుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు చేసేదే వ్యాపారమే! ‘సేవ’ కాదు! కొన్ని ఆస్పత్రులు దోపిడీకి పాల్పడటమూ నిజమే! కానీ ప్రభుత్వం విధించిన అనేక అంక్షలు, నిబంధనలు సహేతుకంగా లేవని వైద్య వర్గాలు చెబుతున్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులపై వేధింపులు ఎక్కువని అంటున్నాయి. కొవిడ్‌ సమయంలో, సెకండ్‌ వేవ్‌లో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులన్నిటినీ జిల్లా ఉన్నతాధికారులు తమ పరిధిలోకి తీసుకున్నారు. తాము చెప్పిన వారినే ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని ఆదేశించారు. ఎంత బిల్లు వేయాలో కూడా నిర్దేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోని పడకల్లో సగానికిపైగా ఆరోగ్యశ్రీకి కేటాయించాలని ఆదేశించారు. లేదంటే పది రెట్లు పెనాల్టీ కట్టాల్సి వస్తుందంటూ ప్రత్యేక జీవో తెచ్చారు. అప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో పడకలన్నీ కరోనా బాధితులతో నిండి ఉన్నాయి. అప్పటికే చికిత్స పొందుతున్న వారిని ఉన్నపళంగా పంపడం ఎలా అని ప్రశ్నించినా... పట్టించుకోకుండా లక్షలకు లక్షలు జరిమానా విధించారు. ఒక్క కృష్ణా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల నుంచే రూ.5 కోట్ల జరిమానా వసూలు చేశారు.


మార్పు ఎలా సాధ్యం?

పొరుగు రాష్ట్రాల్లోని ప్రఖ్యాత వైద్య సంస్థలను నవ్యాంధ్రకు రప్పించేందుకు గత ప్రభుత్వ హయాంలో ఈ దిశగా ప్రయత్నం జరిగింది. పీడియాట్రిక్‌ కేర్‌ (చిన్న పిల్లల వ్యాధులు),  హృద్రోగ శస్త్ర చికిత్సలు, కేన్సర్‌... ఈ మూడు రకాల వ్యాధులకు మాత్రమే పొరుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్‌ వైద్యసేవ’ వర్తిస్తుందని అప్పట్లో నిబంధన పెట్టారు. దీంతో... నవ్యాంధ్రలోనూ తమ ఆస్పత్రులు ఏర్పాటు చేసే దిశగా ప్రముఖ వైద్య సంస్థలు ఆలోచనలు చేశాయి. అడుగులూ వేశాయి. వైసీపీ సర్కారు అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయింది. ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’లోని అన్ని రకాల ప్రొసీజర్లనూ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకూ వర్తింపచేశారు. దీంతో ప్రత్యేకంగా ఏపీలో తమ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఆయా ఆస్పత్రులకు కనిపించలేదు.


ఆక్సిజన్‌ పేరిట హడావుడి...

సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతతో ఆస్పత్రులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైంది. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి ఆక్సిజన్‌ కొరత తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సర్కారుదే. అయితే, ఆ భారాన్ని ప్రైవేటు ఆస్పత్రులపైన రుద్దింది. దీనిపై తాజాగా జీవో జారీచేసింది. దీనికోసం ‘ఆంధ్రప్రదేశ్‌ అల్లోపతిక్‌ ప్రైవేటు మెడికల్‌ కేర్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ రూల్స్‌-2007’కు ఆరోగ్యశాఖ సవరణలు చేసింది. వంద పడకలు దాటిన ప్రతి ఆస్పత్రీ ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సన్‌ట్రేటర్లు, ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. ప్లాంట్ల ఏర్పాటుకు ఎంతలేదన్నా రూ.కోటికిపైగా ఖర్చు అవుతుంది. ప్రభుత్వం చేయాల్సిన పని తమతో చేయించడమేమిటన్నది యాజమాన్యాల ప్రశ్న! ఇక ఆరోగ్యశ్రీ చికిత్స ప్యాకేజీలు తమకు గిట్టుబాటు కావడంలేదని, పాత ధరలకే చికిత్సలు చేయాల్సి వస్తోందని వాపోతున్నాయి. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఏపీకి ఎందుకు రావాలన్నది ప్రముఖ ఆస్పత్రుల ప్రశ్న! వాటిని ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందో చూడాలి మరి!

Updated Date - 2021-10-07T08:03:57+05:30 IST