అమరావతిని విచ్ఛిన్నం చేసేలా ప్రభుత్వం చర్యలు: రాయపాటి సాయికృష్ణ
ABN , First Publish Date - 2021-10-29T19:19:05+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేలా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేలా జగన్ ప్రభుత్వం పని చేస్తోందని అమరావతి పరిరక్షణ యువజన జాక్ అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఉద్యమం 682 రోజులకు చేరిందన్నారు. రాష్ట్రంలో ఎదో ఒక వైఫల్యం జరిగితే దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అమరావతిలో అలజడి సృష్టించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో యువత, విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందన్నారు. అమరావతి ఉద్యమంలో యువత ముందుకు రావాలని, చురుగ్గా పాల్గొనాలని పిలుపిచ్చారు.
యువత భవిష్యత్ కోసం రైతులు భూములు ఇచ్చారని సాయి కృష్ణ అన్నారు. ప్రతిపక్షాలు మాట్లాడితే వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వమని డీజీపీ చెపుతున్నారని, పోలీస్ శాఖ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తాము న్యాయదేవతను నమ్ముకున్నామని, తమకు న్యాయం తప్పకుండా జరుగుతుందని సాయి కృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.