విభజన హామీలన్నీ నెరవేర్చాలి: ఎంపీ గల్లా
ABN , First Publish Date - 2021-12-15T08:57:09+05:30 IST
విభజన హామీలన్నీ నెరవేర్చాలి: ఎంపీ గల్లా

న్యూఢిల్లీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. మంగళవారం లోక్‌సభలో అదనపు పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తీవ్ర జాప్యమవుతోందని, సవరించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని (రూ.55650 కోట్లు) ఆమోదించాలని కోరారు. బుందేల్‌ఖండ్, కేబీకే తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి ప్రధాన మంత్రి పార్లమెంటులో హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేసి కేంద్రం చేతులు దులుపుకొందని విమర్శించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంటనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రకటన చేయాలని విజ్ఞప్తిచేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలన్నారు. రాష్ట్రానికి వరద సాయం నిధులను విడుదల చేయాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.