మద్యం ఆదాయం మాయం!

ABN , First Publish Date - 2021-08-21T08:07:47+05:30 IST

రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుండగానే..

మద్యం ఆదాయం మాయం!

ఖజానాకు జమ చేయని ఎక్సైజ్‌ అధికారులు 

దొంగతనం, దుర్వినియోగం పేరిట దాటవేత 

వసూలైన సొమ్ము లెక్కల్లో భారీగా తేడాలు 

ఏడాదికి పైగా ఇదే తంతు... ఇతర శాఖల్లోనూ ఇదే 

తరహాలో గోల్‌మాల్‌? 

ఆ తర్వాత మిగిలేదే తుది ఆదాయంగా వెల్లడి 

వసూలైన సొమ్ము లెక్కల్లో భారీగా తేడాలు 

ఏడాదికి పైగా ఇదే తంతు... రికవరీలూ నిల్‌ 

ఇతర శాఖల్లోనూ ఇదే తరహాలో గోల్‌మాల్‌? 

(అమరావతి-ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. రాష్ట్ర ఖజానాకు జమ కావాల్సిన మద్యం ఆదాయం పక్కదారి పడుతోన్న విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం సాక్ష్యాధారాలతో సహా ఏడాది క్రితమే గుర్తించినప్పటికీ ఇప్పటికీ అదే తంతు కొనసాగుతోంది. మద్యం అమ్మగా వచ్చిన డబ్బును ఎక్సైజ్‌ అధికారులు సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా ఖజానాకు జమ చేయాలి. ఏరోజుకారోజు ఎంత వసూలైందనే సమాచారం ఆ శాఖ వద్ద మాత్రమే ఉంటుంది. ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులు సమావేశం నిర్వహించినప్పుడు మద్యం ఆదాయం వివరాలను రోజులు, వారాలు, నెలల వారీగా సమర్పిస్తుంటారు. ఏడాది క్రితం ఇలాటి సమావేశం జరిగినప్పుడు ఎక్సైజ్‌ అధికారులు సమర్పించిన మద్యం ఆదాయం వివరాలు, సీఎ్‌ఫఎంఎ్‌సలో జమ వివరాలను పోల్చిచూడగా భారీ వ్యత్యాసం కనిపించింది. దీంతో ఇకపై ఇలాంటివి జరగకూడదని మద్యం ఆదాయాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.


వసూలైన ఆదాయానికి, సీఎ్‌ఫఎంఎ్‌సలో జమ అవుతున్న మొత్తానికి ఎందుకు వ్యత్యాసం ఉందని ఎక్సైజ్‌ అధికారులను ఆర్థికశాఖ ప్రశ్నిస్తే... ‘దొంగతనం’, ‘దుర్వినియోగం’ అనే వింత సమాధానం చెప్పారు. అందుకే వసూలైన మొత్తం ఆదాయాన్ని ఖజానాలో జమ చేయలేకపోతున్నామని సమర్థించుకున్నారు. ఆర్థికశాఖ అధికారులు అడిగిన తర్వాత కూడా కొంతకాలం పాటు ఆ వ్యత్యాసం కొనసాగడంతో ఉన్నతాధికారుల సమావేశాల ద్వారా ఆ శాఖపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాకపోగా, మరో రకంగా జరుగుతోందని తెలిసింది. దొంగతనం, దుర్వినియోగం తర్వాత మిగిలేదే ఫైనల్‌ ఆదాయమని... అంటే సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా ఖజానాలో జమ చేయగలుగుతున్న ఆదాయమే వసూలైనట్టు ఎక్సైజ్‌ అధికారులు వివరాలు సమర్పించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ అదే తంతు కొనసాగుతోందని చెబుతున్నారు. మరోవైపు దొంగతనం, దుర్వినియోగానికి గురైన సొమ్ము ఇప్పటికీ రికవరీ కూడా కాకపోవడం గమనార్హం. 


మిగతా శాఖల పరిస్థితేంటి? 

ఈ సమస్య ఒక్క ఎక్సైజ్‌ శాఖకో, రిజిస్ర్టేషన్ల శాఖకో పరిమితం కాలేదని, పంచాయతీల నుంచి కమిషనరేట్ల వరకు వివిధ స్థాయుల్లో ఉందని కొందరు అధికారులు చెబుతున్నారు. రిజిస్ర్టేషన్ల శాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన డీఫేజింగ్‌ విధానం తరహాలోనే అన్ని శాఖలకు పటిష్ఠమైన చెల్లింపుల మాడ్యూల్‌ను తయారుచేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. పూర్తిగా కంప్యూటర్లపైనే ఆధారపడకుండా అధికారులు ఎప్పటికప్పుడు ఆదాయ వ్యవహారాలు పర్యవేక్షించి, సరిచూసుకుంటే అంతా సక్రమంగా ఉంటుందని పేర్కొంటున్నారు. చలానా నంబరును కంప్యూటర్‌లో సేవ్‌ చేసుకునే రిజిస్ర్టేషన్ల శాఖలోనే పరిస్థితి ఇలా ఉంటే దాఖలైన చలానాను ట్యాగ్‌కి గుచ్చి, ఫైలులో కట్టుకుని బీరువాలో దాచుకునే శాఖలే ఎక్కువ. వాటి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని, ఒకే చలానాను నాలుగైదుసార్లు వాడుతున్నారని కొందరు అధికారులు చెబుతున్నారు. రిజిస్ర్టేషన్‌ శాఖ తరహాలోనే మిగతా ప్రభుత్వ శాఖలు కూడా ఇప్పుడు నకిలీ చలాన్ల కోసం వెతుకులాట మొదలుపెడితే అంతా కలిపి ఎన్ని కోట్లవుతుందోననే చర్చలు మొదలయ్యాయి. 

వెలుగులోకి తెచ్చింది సబ్‌రిజిస్ర్టారే 

స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖలో ఇటీవల నకిలీ చలాన్ల ఉదంతాన్ని స్వయంగా సబ్‌రిజిస్ర్టార్లే వెలుగులోకి తెచ్చి వ్యవస్థను మరింత బలోపేతం చేసుకున్నారు. కడప సబ్‌రిజిస్ర్టారు అప్రమత్తతతో ఈ కుంభకోణం వెలుగుచూడటంతో అంతా బావుందనే భ్రమల్లో ఉన్న చెల్లింపుల వ్యవస్థ ఉలిక్కిపడింది. ఏ ప్రభుత్వ శాఖలో అయినా ఇలా జరగొచ్చేమోనని ఊహకు కూడా అందని మోసాన్ని, రిజిస్ర్టేషన్ల శాఖ వీధిలోకి లాక్కొచ్చి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఖజానాకు జరిగే నష్టాన్ని తప్పించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎక్సైజ్‌, ఇతర శాఖల్లో ఏళ్ల తరబడి సాగుతున్న ఆదాయం దొంగతనం, దుర్వినియోగంపై చర్చ మొదలైంది. ఈ విషయం ప్రభుత్వంలో చాలామందికి తెలిసినప్పటికీ సమస్య పరిష్కారానికి ఎవరూ చొరవ తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్థికశాఖ అడిగినప్పటికీ దొంగతనం, దుర్వినియోగం ఆగకపోగా, ఇలా మాయమవుతున్న మద్యం ఆదాయం ఎటుపోతోందనే అంశం ఇంతవరకూ ఎందుకు తేలలేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. నకిలీ చలాన్ల ఉదంతం బయటకి రాగానే ప్రభుత్వంలోని ఏ ఇతర శాఖల్లో లేనివిధంగా రిజిస్ర్టేషన్‌ శాఖలో తొలిసారిగా డీఫేజింగ్‌ మాడ్యూల్‌ తయారుచేసి క్షేత్రస్థాయిలో అమల్లోకి తెచ్చారు. ప్రతి సబ్‌రిజిస్ర్టారుకూ ఇప్పటికే కేటాయించిన డీడీవో కోడ్‌లకు ప్రజలు వివిధ సేవల నిమిత్తం చెల్లించిన సీఎ్‌ఫఎంఎస్‌ చలాన్లు రిజిస్ర్టేషన్‌ సర్వర్‌లో ప్రత్యక్షమవుతాయి. దీనిద్వారా ఒకసారి వాడిన చలాన్‌ను మళ్లీ వాడలేరు. నకిలీ చలాన్లు సృష్టించినా, వాటి వివరాలేవీ డీఫేజీంగ్‌ మాడ్యూల్‌కి సరిపోలవు. కాబట్టి ప్రభుత్వ ఖజానాకు నష్టం జరగదు. సరైన వ్యక్తే తను కట్టిన సరైన చలానా ద్వారా సేవలు పొందేలా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఈ రకమైన డీఫేజింగ్‌ విధానాలకు మారకపోతే నకిలీలు రేపు ఏ ఇతర శాఖలోనైనా ఎదురుకావనే భరోసా ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


Updated Date - 2021-08-21T08:07:47+05:30 IST