నడిసంద్రంలో చదువుల నావ

ABN , First Publish Date - 2021-08-20T08:15:14+05:30 IST

ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం విద్యార్థుల చదువులను ప్రశ్నార్థకం చేస్తోంది.

నడిసంద్రంలో చదువుల నావ

సాయం ఆపేసి, లెక్చరర్లను తీసేస్తే విద్యార్థులకు పాఠాలు ఎవరు చెప్పాలి?

డిగ్రీమధ్యలో ఉన్నవారి పరిస్థితేంటి?

ఎయిడెడ్‌ కళాశాలలపై ప్రభుత్వ వైఖరితో 40వేల మందికిపైగా విద్యార్థుల్లో గుబులు

141 ఎయిడెడ్‌ కళాశాలలపై ప్రభావం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్‌ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం విద్యార్థుల చదువులను ప్రశ్నార్థకం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల మెడపై కత్తి పెట్టి...‘ప్రభుత్వంలో కలిపేయాల్సిందే...లేకుంటే ఇప్పటివరకు అందిస్తున్న సాయం కట్‌ చేస్తాం’ అంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు...40వేల మంది విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ప్రభుత్వ వైఖరితో డిగ్రీ విద్యార్థుల చదువు నడిసంద్రంలో నావలా తయారుకానుంది. ప్రభుత్వంలో కలిపేయడానికి చాలావరకు ఎయిడెడ్‌ సంస్థలు సిద్ధంగా లేవు. అభ్యుదయ భావాలతో, సమాజాభివృద్ధి కోసం ఎప్పుడో దాతలు విద్యాసంస్థలకు ఇచ్చిన ఆస్తులు, భూములు, భవనాలను ఇప్పుడు లాగేసుకుంటామంటే ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదు. ఇలా ఒప్పుకోని డిగ్రీ కళాశాలలకు సాయం కట్‌ చేస్తామని, అదేవిధంగా ఆయా కళాశాలల్లోని ఎయిడెడ్‌ లెక్చరర్లను ప్రభుత్వంలోకి తీసేసుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. కానీ డిగ్రీ మూడేళ్ల కోర్సు. ఎయిడెడ్‌ కళాశాలల్లో వాటికి దాదాపు ఫీజు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా సుమారు వెయ్యి రూపాయలు ఇలా వసూలుచేస్తారు. భూమి, భవనాలు దాతలు ఇవ్వడం, ఇతర మౌలిక సదుపాయాలను కూడా కళాశాలల యాజమాన్యాలే భరించడం...వాటికితోడు ఆయా కళాశాలల్లోని లెక్చరర్ల జీతాలకు ప్రభుత్వం సాయం అందిస్తుండడంతో విద్యార్థులపై భారం పడకుండా చదువులు సాగిపోతున్నాయి.


అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ సాయం కట్‌ చేసి...లెక్చరర్లను వెనక్కి తీసుకుంటామని చెప్తోంది. ఎయిడెడ్‌ కళాశాలల్లో ఇస్తున్న జీతాలనే ప్రభుత్వ కళాశాలల్లోకి తీసుకుని వారికి చెల్లిస్తుంది. కాబట్టి ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ ఉండదు. కానీ ఒకపక్క సాయం కట్‌ అయి, లెక్చరర్లు వెళ్లిపోతే ఎయిడెడ్‌ కళాశాలలు ఆ ఖర్చును విద్యార్థులపై వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రాము అనే విద్యార్థి ఒక ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలో చేరాడు. ఫీజు కట్టాల్సిన భారం లేకపోవడంతో అక్కడ చేరి మొదటి ఏడాది పూర్తిచేశాడు. ఇప్పుడు రెండో ఏడాది, మూడో ఏడాది చదవాల్సి ఉంది. కానీ ప్రభుత్వం సదరు కళాశాలను విలీనమన్నా చేయాలి, లేకుంటే ఎయిడ్‌ కట్‌ చేస్తాం....ప్రైవేటు కళాశాలగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. రాము చదువుతున్న కళాశాల విలీనం చేయకూడదని నిర్ణయించింది. దీంతో ప్రభుత్వం సాయం కట్‌ చేసేస్తుంది. లెక్చరర్లను తీసేసుకుంటుంది. మరి రాము రెండో ఏడాది, మూడో ఏడాది ఎలా చదువుకోవాలి? ప్రభుత్వ సాయం ఆపేస్తే...దాన్ని పూడ్చుకోవడానికి ఎయిడెడ్‌ కళాశాలలు విద్యార్థులపై భారం వేయాలా? విద్యార్థుల ఫీజులు పెంచాలా? పెంచితే వారు చెల్లించగలుగుతారా? మొదటి ఏడాది చేరేటప్పుడే ఏటా ఇంత ఫీజు అంటే చెల్లించగలిగినవారు చేరతారు.


లేదంటే లేదు. కానీ మొదటి ఏడాది అయిపోయాక ఇప్పుడు రెండో ఏడాది, మూడో ఏడాది కోసం ఫీజులు పెంచుతామంటే ఎలా చెల్లించగలుగుతారు?. ఒకవేళ వారు ఫీజులు చెల్లించలేం అంటే...ఆయా కళాశాలలు ఏదో అరకొరగా తరగతులు నడిపించేయవా? మరి అలాంటప్పుడు విద్యలో నాణ్యత ఎక్కడుంటుంది?...తదితర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది రాము ఒక్కడి సమస్య కాదు...141ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో ఉన్న ఎయిడెడ్‌ సెక్షన్లలోని 40వేలమంది విద్యార్థుల అవస్థ. అన్నివేల మంది విద్యార్థుల డిగ్రీ చదువులను నడిసంద్రంలో వదిలేసేలా ప్రభుత్వ నిర్ణయాలున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొందరు విద్యార్థులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయం, తప్పా, ఒప్పా అన్నది పక్కనపెడితే...తమ డిగ్రీ కోర్సు ముగిసేవరకైనా సాయం సాగకుంటే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. 

బడ్జెట్‌ 565కోట్లు కట్‌ 

ప్రభుత్వం హఠాత్తుగా ఉన్నట్టుండి సాయం నిలిపేసి, లెక్చరర్లను విలీనం చేసేసుకుంటే...ఎయిడెడ్‌ కళాశాలలు కొత్తవారిని నియమించుకోవాలి. కానీ కళాశాలలకు అంత సామర్ధ్యం ఉంటుందా అనేది సందేహమే. అంత ఆర్థిక సామర్ధ్యం లేకపోతే, లెక్చరర్లను నియమించకుండా తూతూమంత్రంగా కళాశాలలు నిర్వహించేస్తే విద్యలో నాణ్యత తగ్గిపోయి..విద్యార్థులకే నష్టం జరుగుతుంది. రాష్ట్రంలోని 141డిగ్రీ కళాశాలలకు కలిపి ప్రభుత్వం ఏటా కొంత బడ్జెట్‌ను కేటాయిస్తోంది. డిగ్రీ కళాశాలల్లోని కొంతమంది లెక్చరర్లకు జీతాల కోసమే ఈ మొత్తం ఇస్తోంది. ఇలా ప్రభుత్వ ఎయిడ్‌తో జీతాలు పొందేవారిని ఎయిడెడ్‌ లెక్చరర్లు అని పిలుస్తుంటారు. అదే ఎయిడెడ్‌ కళాశాలల్లో కొంతమందికి మాత్రం ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంటే...మరికొంతమందికి ఆయా కళాశాలల యాజమాన్యాలే చెల్లిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఎయిడెడ్‌ కళాశాలలకు చెల్లిస్తున్న ఏడాది బడ్జెట్‌ మొత్తం కలిసి రూ.565కోట్లే. కానీ ఎయిడెడ్‌ కళాశాలలు కల్పించిన సదుపాయాలు, నిర్మించిన భవనాలు, ఇచ్చిన భూములు, ఖర్చుపెడుతున్న మొత్తం కొన్ని వందల రెట్లు ఉంటుందంటున్నారు. అంత భారీగా ఖర్చుచేస్తున్న ఎయిడెడ్‌ కళాశాలలకు ఈ మాత్రం సాయాన్ని కూడా ప్రభుత్వం నిలిపేస్తాననడం దారుణమంటున్నారు. అలాగని ప్రభుత్వంలో ఎయిడెడ్‌ కళాశాలలన్నీ కలుస్తాయా? అంటే..దాతలిచ్చిన భూములు, భవనాలు, సొమ్ములతో ఒక సిద్ధాంతంతో నడుస్తున్న వాటిని విలీనం చేసేందుకు అన్నీ ముందుకురావడం లేదు. దీంతో అటు ప్రభుత్వం-ఇటు యాజమాన్యాల మధ్య డిగ్రీ మధ్యలో ఉన్న విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-08-20T08:15:14+05:30 IST