పద్దు దాటని ‘అగ్రి’ హామీలు

ABN , First Publish Date - 2021-05-21T07:12:29+05:30 IST

‘మేం అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు కేవలం ఆరు నెలల్లో చెల్లింపులు చేస్తాం. కోర్టు వ్యవహారాలు జాప్యమైనా ప్రభుత్వ ఖజానా నుంచి ముందు బాధితులకు ఉపశమనం కల్పిస్తాం’...

పద్దు దాటని ‘అగ్రి’ హామీలు

అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరటనివ్వని బడ్జెట్‌ కేటాయింపుల తీరు

మూడేళ్లుగా పోరాడుతున్న బాధితులు


అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): ‘మేం అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు కేవలం ఆరు నెలల్లో చెల్లింపులు చేస్తాం. కోర్టు వ్యవహారాలు జాప్యమైనా ప్రభుత్వ ఖజానా నుంచి ముందు బాధితులకు ఉపశమనం కల్పిస్తాం’...గుంటూరు జిల్లాలో 2018లో ప్రతిపక్ష నేత జగన్‌ ఇచ్చిన భరోసా ఇది. ‘అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ 20వేల కోట్లు. చెల్లించాల్సింది ఏపీ వరకూ నాలుగు వేల కోట్లే. కనీసం 1100 కోట్లు కేటాయిస్తే 20వేల లోపు డిపాజిటర్లందరి సమస్య తీరుతుంది.. ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం ఇంతకన్నా మరోటి ఉండదు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే చెల్లిస్తాం’ శ్రీకాకుళం జిల్లా పాదయాత్రలో రెండున్నరేళ్ల క్రితం ప్రస్తుత సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలివి. మరి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఎంత చెల్లించారంటే..మూడో సంవత్సరంలోకి ప్రభుత్వం అడుగు పెడుతున్నా రూపాయి కూడా చెల్లించలేదు.


అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన 2020-2021, 2021-2022 బడ్జెట్లలో రూ.200 కోట్లు చొప్పున కేటాయిస్తూ అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లను ప్రభుత్వం ఊరడించింది. అయితే, విడుదల కాని కేటాయింపులతో ఇంకెన్నేళ్లు తమను మభ్య పెడతారని డిపాజిటర్లు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం గుంటూరులో రూ.234కోట్లు బాధితులకు చెల్లించింది. అయితే అవి గత టీడీపీ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో విడుదల చేసిన నిధులు. అందులోనూ రూ.16కోట్లు కోత పెట్టి జగన్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.20వేల కోట్లు చేస్తాయని చెప్పిన ఆయనే 24 నెలలు గడుస్తున్నా కనీసం పట్టించుకోలేదని బాధితులు కన్నీరు పెడుతున్నారు. బడ్జెట్‌ పుస్తకంలో అంకెలు చూసుకోవడానికి తప్ప విడుదల చేయని కేటాయింపులు ఎన్ని వందల కోట్లు చేస్తే ఏమి లాభమని వాపోతున్నారు. 

Updated Date - 2021-05-21T07:12:29+05:30 IST