సచివాలయ ఉద్యోగినులపై.. వైసీపీ నేత అరాచకం

ABN , First Publish Date - 2021-09-03T08:58:49+05:30 IST

శ్రీకాకుళం జిల్లా పెనుబర్తి పంచాయతీ సర్పంచ్‌ తమ్మినేని ఝాన్సీ భర్త, వైసీపీ నాయకుడు తమ్మినేని మురళి..

సచివాలయ ఉద్యోగినులపై.. వైసీపీ నేత అరాచకం

  • కార్యాలయానికి పిలిచి దుర్భాషలు.. బెదిరింపులు
  • చెప్పినట్టు చేయకుంటే.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
  • ఆందోళనకు దిగిన ఉద్యోగులు.. స్టేషన్‌లో ఫిర్యాదు

పొందూరు, సెప్టెంబరు 2: శ్రీకాకుళం జిల్లా పెనుబర్తి పంచాయతీ సర్పంచ్‌ తమ్మినేని ఝాన్సీ భర్త, వైసీపీ నాయకుడు తమ్మినేని మురళి.. గోరింట సచివాలయ ఉద్యోగినులపై దాడికి పాల్పడ్డాడు. పింఛన్ల విషయమై మాట్లాడాలంటూ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ టి.సత్యరూప, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ పి.సంగీత లక్ష్మిలను బుధవారం తన కార్యాలయానికి పిలిపించాడు. తాను చెప్పినట్టుగా పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించడంతో.. తాము అధికారుల ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తామని వారిద్దరూ స్పష్టం చేశారు. దీనిపై మురళి ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘నేను చెప్పినట్టు చేయకపోతే బదిలీ వేటు తప్పదు. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు’ అని బెదిరిస్తూ దుర్భాషలాడాడు. వారిద్దరిపై చేయి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరూ సచివాలయానికి చేరుకుని తమకు జరిగిన అవమానాన్ని సహోద్యోగులకు చెప్పారు. దీంతో సచివాలయ ఉద్యోగులంతా గురువారం ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. సర్పంచ్‌ భర్త మురళి తమను కార్యాలయానికి పిలిచి దుర్భాషలాడాడని, చేయి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు, పోలీసులు కలిసి రాజీ ప్రయత్నాలు చేసినా.. మండలంలో అన్ని సచివాలయాల ఉద్యోగులు బాధితులకు అండగా నిలవడంతో తప్పని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2021-09-03T08:58:49+05:30 IST