చట్టం వైసీపీ చుట్టం!?
ABN , First Publish Date - 2021-10-21T09:57:03+05:30 IST
చట్టం తన పని తాను చేస్తోం దా? లేక.. అధికార పార్టీకి చుట్టంలా మారిపోయిందా? మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఈ అనుమానం తలెత్తక మానదు.
- కేసుల నమోదులోనే పోలీసుల పక్షపాతం
- పట్టాభి ఇంటిపై దాడి కేసులో అరెస్టుల్లేవ్
- కానీ... రెచ్చగొట్టారంటూ ఆయన అరెస్టు
- టీడీపీ కార్యాలయంలో విధ్వంసంపై స్టేషన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు
- అనుమానితుడిని పట్టుకుని అప్పగించిన
- టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ కేసు
- రాస్తారోకోపై కేసు నమోదు
గుంటూరు, అక్టోబరు 20: చట్టం తన పని తాను చేస్తోం దా? లేక.. అధికార పార్టీకి చుట్టంలా మారిపోయిందా? మంగళవారం ఉదయం నుంచి బుధవారం రాత్రి వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఈ అనుమానం తలెత్తక మానదు. టీడీపీ అధికార ప్రతినిధిపై దాడికి పాల్పడిన వారినెవరినీ అరెస్టు చేయలేదు. కానీ.. ఆయనను అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడిచేసి విధ్వంసానికి దిగిన వారెవరినీ అరె స్టు చేయలేదు. కానీ.. కార్యాలయంలో తొలుత అనుమానాస్పదంగా కనిపించిన ఆర్‌ఐని నిర్బంధించి, పోలీసులకు అప్పగించిన ఘటనపై కేసు నమోదు చేశారు. అందులోనూ.. ఆ ఘటన సమయంలో అక్కడలేని లోకేశ్‌పైనా హత్యాయత్నం, ఎస్సీ-ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కిం ద కేసు పెట్టారు. రాస్తారోకోలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ మహిళా నేతలు ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదు కానీ.. రాస్తారోకో చేసిన వారిపై కేసు పెట్టారు. మొత్తంగా.. చట్టం ఏకపక్షంగా, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు ఈ పరిణామాలతో స్పష్టమైపోతోంది.
మంగళవారం సాయంత్రం పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంలోకి చొరబడి విధ్వం సం సృష్టించిన సంగతి తెలిసిందే! అక్కడ విధుల్లో ఉన్న టీడీపీ ఐటీ విభాగం ఉద్యోగి సాయిబద్రీనాథ్‌తోపాటు అనిల్, విద్యాసాగర్ తదితర సిబ్బందిని కర్రలతో కొట్టి గాయపరిచారు. తలలు బద్దలుకొట్టారు. తమపై మారణాయుధాలతో దాడి జరిగిందని, హత్యాయత్నం చేశారని బద్రీనాథ్ ఫిర్యాదు చేశారు. అలాగే, టీడీపీ కార్యాలయంలో సృష్టించిన విధ్వంసకాండపై ఆ పార్టీ రిసెప్షన్ కమిటీ సభ్యుడు వల్లూరు కుమారస్వామి మరో ఫిర్యాదు ఇచ్చారు. బద్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రమే మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 427, 323, 324, 506 రెడ్‌విత్ 149 కింద కేసు పెట్టారు. ఇవన్నీ... దొమ్మీకి దిగడం, వస్తువులను ధ్వంసం చేయటం, చేతులు, కాళ్లతో, కర్రలతో కొట్టి గాయపరచడం, పథకం ప్రకారం గుంపుగా వచ్చి బెదిరించడం వంటి నేరాలకు సంబంధించినవే. వీటిలో కొన్ని జరిమానాతో, మరికొన్నింటిలో గరిష్ఠంగా మూడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. స్టేషన్ బెయిల్ మంజూరు చేసే కేసు పెట్టారు.
టీడీపీ నేతలపై గట్టి కేసులు
టీడీపీ కార్యాలయంపై వైసీపీ వర్గీయుల దాడి అనంతరం కార్యాలయంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అతన్ని వైసీపీ కార్యకర్తగా అనుమానించి ఆయనపై దాడికి యత్నించారు. ఇంతలో అక్కడే ఉన్న ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు వారిని వారించి అతని పేరు, వివరాలు అడిగారు. తాను ఇంటెలిజెన్స్ పోలీసునని చెప్పగా పార్టీ నాయకులు ఐడీ కార్డు అడిగారు. ఆయన చూపలేకపోవటంతో తమకు ఆయనపై అనుమానం ఉందని, మీడియా ముందు ఆ వివరాలు వెల్లడించి ఆయనను మంగళగిరి రూరల్ పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించారు. ఆయన పేరు సక్రూ నాయక్ అని, రిజర్వు ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) అని తర్వాత తేలింది. టీడీపీ కార్యాలయంలో లోకేశ్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, మరికొందరు టీడీపీ కార్యకర్తలు తనను పట్టుకుని ప్రశ్నించారని... చెప్పేది వినిపించుకోకుండా తనను కులం పేరుతో దూషించారని, గొంతుపిసికి చంపబోయారని, కొట్టారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు తీవ్రంగా స్పందించి.. లోకేశ్, అశోక్‌బాబు, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్ కుమార్, పోతినేని శ్రీనివాసరావు కార్యకర్తలపై ఐపీసీ 651/2021, 147, 148, 307, 332, 427, 323, 324, 342 రెడ్‌విత్ 149, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
రాస్తారోకోపై కేసు: టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు కొందరు మంగళవారం రాత్రి టీడీపీ కార్యాలయం ఎదుట 16వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశా రు. అయితే దీనిపై ఆత్మకూరు వీఆర్వో ఆళ్ల కృష్ణ ఇచ్చిన ఫిర్యా దు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా గుమిగూడి హైవేపే రాకపోకలకు అంతరాయం కలిగించారని, కరోనా నిబంధనలు ఉల్లంఘించారని, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలిపారు. అయితే, తమ ఒంటిపై పెట్రో లు పోశారని తెలుగు మహిళా నాయకురాలు, దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించలేదు.
24 గంటలైనా దర్యాప్తు లేదు: పట్టాభి నివాసంతోపాటు, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగి 24 గంటలు గడిచినా.. పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు ప్రారంభించలేదు. మంగళవారం రాత్రి నుంచి బందోబస్తు డ్యూటీలే సరిపోయాయని, కనీసం పోలీ్‌సస్టేషన్‌కు కూడా వెళ్లకుండా రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నామని బదులిచ్చారు.