వర్తమానంలో స్వార్థం కోసం భవిష్యత్తు తాకట్టు!

ABN , First Publish Date - 2021-09-02T08:58:08+05:30 IST

‘‘వర్తమానంలో తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం... దేశ భవిష్యత్తు ప్రయోజనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. అప్పుల కోసం, ఇతర అవసరాల కోసం దేశ సంపదను విక్రయించడం, లీజు పేరిట ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఆమోదయోగ్యం కాదు’’ అని రాజకీయ, ఆర్థిక, సామాజిక, న్యాయ రంగాలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. ఒకవైపు ఏపీ సర్కారు అప్పుల కోసం భవిష్యత్‌ ఆదాయాన్ని తాకట్టు పెడుతుండగా... మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘మానిటైజేషన్‌’ పేరిట కీలక రంగాలను దశాబ్దాలపాటు ప్రైవేటుకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి..

వర్తమానంలో స్వార్థం కోసం భవిష్యత్తు తాకట్టు!

  • ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేదెవరు?
  • మానిటైజేషన్‌ పేరుతో లీజుకు దేశ సంపద..
  • సంక్షేమం కోసం ఎడాపెడా అప్పులు
  • ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం..
  • ప్రభుత్వాల పద్ధతి మారాలన్న నిపుణులు
  • ‘ఏబీఎన్‌’లో ఆలోచన రేకెత్తించే చర్చ


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘వర్తమానంలో తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం... దేశ భవిష్యత్తు ప్రయోజనాలను తాకట్టు పెట్టే హక్కు ఎవ్వరికీ లేదు. అప్పుల కోసం, ఇతర అవసరాల కోసం దేశ సంపదను విక్రయించడం, లీజు పేరిట ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఆమోదయోగ్యం కాదు’’ అని రాజకీయ, ఆర్థిక, సామాజిక, న్యాయ రంగాలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. ఒకవైపు ఏపీ సర్కారు అప్పుల కోసం భవిష్యత్‌ ఆదాయాన్ని తాకట్టు పెడుతుండగా... మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘మానిటైజేషన్‌’ పేరిట కీలక రంగాలను దశాబ్దాలపాటు ప్రైవేటుకు లీజుకు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీని హేతుబద్ధతను ప్రశ్నిస్తూ... ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానల్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ బుధవారం రాత్రి ‘తాకట్టులో భారతదేశం’ పేరుతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో... మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వికాస్‌ బన్సోడే ప్రత్యక్షంగా... ‘లోక్‌సత్తా’ వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌, ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ ఫోన్‌ ద్వారా ఈ చర్చలో పాల్గొన్నారు.


‘‘కేంద్రం అమలు చేస్తున్న మానిటైజేషన్‌ విధానం మంచిదేనా? ప్రజలు ఐదేళ్లకు అధికారం కట్టబెడితే.. పాతికేళ్లకు ప్రజా ఆస్తులను లీజులకిచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందా?’’ అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం దేశ సంపదను తాకట్టు పెట్టే వైఖరిపై సర్వత్రా చర్చ జరగాలని... అన్ని రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు కలిసి ప్రభుత్వాలను కట్టడి చేయాల్సిన అవసరముందని వక్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రాలు పరిమితిని మించి అప్పులు చేయడాన్ని నిరోధించేలా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం వచ్చినట్లుగా.... విచ్చలవిడి పథకాల అమలును నిరోధించేలా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. 


‘తాకట్టు’ సరైనదేనా: ఆర్కే

‘‘ మానిటైజేషన్‌ ఆస్ట్రేలియాలో విఫలమైంది. సింగపూర్‌లో మెట్రో నడపలేకపోతున్నామంటూ ప్రైవేటుకు ఇచ్చారు. హైదరాబాద్‌ మెట్రోలో ఎల్‌అండ్‌ టీ తనవాటా అమ్ముకోవాలని అనుకుంటోంది. అవే అనుభవాలు ఇప్పుడు మనకు వస్తున్నాయి. పవర్‌లైన్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు అమ్మాలనుకుంటారు. వేలంలో అసాంఘిక శక్తులో, ఉగ్రవాదులో విమానాశ్రయాలను సొంతం చేసుకుంటే పరిస్థితి ఏమిటి? కీలక రంగాలపై ప్రభుత్వ అజమాయిషీ పోతే ఎలా? ‘ఇండియా ఈజ్‌ మార్ట్‌గేజ్డ్‌’ అని తరిమెల  చెప్పినట్లుగా ముందుగా తనఖా పెడతారు. తర్వాత అమ్మేస్తారు. అప్పుచేసి పప్పు కూడు తిందామనుకోవడం కరెక్టేనా?’’ అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు. కాగా.. బీజేపీ నేత సుధీశ్‌ రాంభొట్ల మాట్లాడుతూ.. మానిటైజేషన్‌ ద్వారా వచ్చే నిధులనూ మౌలిక వసతుల మీద ఖర్చు పెడతామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 


సంపద సృష్టిస్తే మంచిదే..: జయప్రకాశ్‌ నారాయణ్‌

తాము చేయాల్సిన పని చేయకుండా.. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉంచకుండా తాత్కాలికమైన తాయిలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వాలకు లేదు. అప్పులు చేస్తాను పంచేస్తాను అంటే కరెక్ట్‌ కాదు. సంపద పెంచేందుకు అప్పు చేయవచ్చు. కానీ... అప్పు చేసి పప్పు కూడు అనే పద్ధతి తప్పు. పప్పూ బెల్లాల వలె పంచేందుకు ఆస్తులు అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు. అయితే...  ప్రైవేటురంగంలోనూ డబ్బుండాలి. మౌలికరంగం కచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. 


పంచి పెట్టేందుకు సీఎం ఎందుకు: ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ 

గంగవరం పోర్టులో ఏపీ తన వాటాను అమ్మేసింది. కానీ... విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కొంటామంటోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విలువ రూ.4 లక్షల కోట్లు. కానీ... దానిని 32 వేల కోట్లకు అమ్మేస్తామంటున్నారు. అంతకుముందు హిందూస్థాన్‌ జింక్‌ను అమ్మేశారు. ఇప్పుడు అక్కడ జింక్‌ తయారు కావడంలేదు. విల్లాలు తయారవుతున్నాయి. లండన్‌లో ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంటును ప్రైవేటుకు ఇస్తే రెండుసార్లు దివాలా తీసింది. హద్దూ అదుపులేని ప్రైవేటీకరణ వినాశనానికి దారితీస్తుందని వాజపేయి అన్నారు. సంక్షేమంలో రెండు రకాలు ఉంటాయి. ఉదాహరణకు... మధ్యాహ్న భోజన పథకం ప్రయోజనకరం. దీనివల్ల పాఠశాలలకు వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. అలాగే... పౌరులకు సామాజిక భద్రత కూడా ఉండాలి. అలాగని... విచ్చలవిడిగా పంచుతూ పోతే ముఖ్యమంత్రి ఎందుకు? ఆ స్థానంలో ఒక అకౌంటెంట్‌ను పెట్టినా సరిపోతుంది.ఆ హక్కు ఎవరికీ లేదు: వికాస్‌

ప్రజాప్రతినిధి ప్రజల ఆస్తులకు రక్షకుడు మాత్రమే అని రాజ్యాంగం చెబుతోంది. ప్రజా ఆస్తులను ఆమ్మే హక్కు ఏ ప్రజాప్రతినిధికీ లేదు. ప్రభుత్వ రంగ సంస్థలు పుట్టింది ప్రజల కోసమే. 1951లో మనకు కేవలం ఐదు పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలే ఉన్నాయి. 2019 నాటికి 348కు పెరిగాయి. పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే 1951 ఇండస్ట్రీ రెగ్యులైజేషన్‌ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఎందుకంటే పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పిస్తాయి. విశాఖలో ప్రభుత్వరంగ సంస్థలు అత్యధికంగా ఉన్నందునే అక్కడ తలసరి ఆదాయం హైదరాబాద్‌కంటే ఎక్కువగా ఉంది. రాజ్యం సంక్షేమ ప్రభుత్వంగా వెళ్లాలి. కానీ... విచ్చల విడితత్వం పెరిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. 


ప్రశ్నించేవారు లేకపోవడం విషాదం : ఉండవల్లి అరుణ్‌ కుమార్‌

మానిటైజేషన్‌ అంటే... ఆస్తులు అమ్మి సొమ్ము చేసుకోవడం! ఇప్పుడొక రోడ్డు వేస్తారు. దాన్ని అమ్మేస్తారు. మళ్లీ ఇంకో రోడ్డు వేస్తారు. దానినీ అమ్మేస్తారు. దీనివల్ల జరిగే అనర్థాలపై జర్నలిస్టులు, మేధావులు, రాజకీయవేత్తలు మాట్లాడాలి. కానీ... ఎవరూమాట్లాడడం లేదు. గతంలో కమ్యూనిస్టులు ఇలాంటి అంశాలపై స్పందించి... కరపత్రాలు, పుస్తకాలు పంపిణీ చేసి, పోరాడే వాళ్లు. ఇప్పుడు కమ్యూనిస్టులు కేరళకే పరిమితమయ్యారు. కమ్యూనిస్టు పార్టీలు ఇలా అయిపోవడం ఈ దేశానికి పెద్ద విషాదం. ఇక... కాంగ్రెస్‌ ఏ రాష్ట్రంలో బలంగా ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి.  బీజేపీ విధానాలను వ్యతిరేకించే  వారు కరువయ్యారు. ప్రభుత్వం ఒక ట్రస్టులా ఉండాలి. కానీ... వ్యాపారం చేసే స్థాయికి వస్తే... తనను ప్రశ్నించే వారిపై  కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో పార్లమెంటులో అసలు చర్చే జరగడం లేదు. బాధ్యతాయుత రాజకీయ పార్టీలు కూడా దీనిపై దృష్టి పెట్టడం లేదు. సమస్య కేవలం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కో, మరోదానికో పరిమితం కాదు. ఇది సమాజాన్ని పూర్తిగా క్యాపిటలిస్టిక్‌ మార్చే ప్రయత్నం. ప్రభుత్వ వ్యాపారం చేయదని కేంద్రం స్పష్టంగా చెబుతోంది. సొమ్ములు చేసుకోవడమే!

‘మానిటైజేషన్‌’ ఉద్దేశం ఇదే

‘మానిటైజేషన్‌’... హుందాగా, అందంగా ఉన్న ఈ ఆంగ్ల పదానికి అర్థం ‘సొమ్ము చేసుకోవడం!’ అంటే... ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవచ్చు. వాటిని అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకోవచ్చు. 2016లో ‘డీమానిటైజేషన్‌’ పేరుతో పెద్దనోట్లు రద్దు చేసిన మోదీ సర్కారు... ఇప్పుడు ‘మానిటైజేషన్‌’ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సుమారు 20  కీలక రంగాలకు చెందిన ‘అసెట్స్‌’ నుంచి సొమ్ము చేసుకోవడమే దీని ఉద్దేశం. వీటిని దీర్ఘకాలంపాటు ప్రైవేటు కంపెనీలకు లీజుకు ఇస్తారు. ‘మోనిటైజేషన్‌’లోని కీలక వివరాలు ఇవి...


ఏమిటీ ‘పథకం’?

‘నేషనల్‌ మోనిటైజేషన్‌ పైప్‌లైన్‌’ (ఎన్‌ఎంపీ) పేరిట ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేశారు. నాలుగేళ్లలో (2021-22 - 2025-26 మధ్య) దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా రూ.6,00,000 కోట్లు సంపాదించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.


ఎలా చేస్తారు?

ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే వ్యూహాత్మకమైనవిగా భావిస్తున్న 13 రంగాలను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇస్తారు. ఈ లీజు కాలం 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఆయా ఆస్తులపై లీజుదారులకు (ప్రైవేటు సంస్థలకు) విస్తృత స్థాయిలో అధికారాలూ కల్పిస్తారు. యాజమాన్య హక్కులు మాత్రం ప్రభుత్వం వద్దే ఉంటాయి. దీనికి సంబంధించి అనేక వివరాలను ఎన్‌ఎంపీ పత్రాలలో పొందుపరిచారు.


ఆ డబ్బుతో ఏం చేస్తారు?

మానిటైజేషన్‌లో భాగంగా వచ్చిన సొమ్ములను దేశంలో ‘మౌలిక సదుపాయాల’ కల్పనకు ఉపయోగిస్తామని కేంద్రం చెబుతోంది. అంటే... 75 సంవత్సరాలుగా దేశంలో అభివృద్ధి పరిచిన మౌలిక సదుపాయాలను లీజుకు ఇచ్చేసి, ఆ డబ్బులతో మళ్లీ కొత్త మౌలిక సదుపాయాలు కల్పిస్తారట!


లీజుకు ఎంపిక చేసిన రంగాలు...

రహదారులు, రవాణా,  రైల్వే, విద్యుత్‌ సరఫరా, విద్యుత్‌ ఉత్పత్తి, సహజ వాయువు, పౌర విమానయానం, షిప్పింగ్‌, రేవులు, జల మార్గాలు, టెలీకమ్యూనికేషన్లు, ఆహారం, ప్రజాపంపిణీ, మైనింగ్‌, బొగ్గు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, క్రీడా మైదానాలు, గిడ్డంగులు.  

Updated Date - 2021-09-02T08:58:08+05:30 IST