90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన చికిత్స

ABN , First Publish Date - 2021-05-02T08:54:12+05:30 IST

తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య, ఆయాసంతో బాధపడుతున్న 90 సంవత్సరాల వృద్ధురాలికి ఆంధ్ర హాస్పిటల్‌ వైద్యులు కోత, కుట్లు అవసరం లేకుండా టీఏవీఆర్‌ ప్రక్రియ ద్వారా అరుదైన చికిత్స చేశారు

90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన చికిత్స

కోత, కుట్లు లేకుండా అయోర్టిక్‌ వాల్వ్‌ రీప్లే్‌సమెంట్‌

విజయవాడ ఆంధ్ర హాస్పిటల్‌ వైద్యుల ఘనత 


విజయవాడ, మే 1(ఆంధ్రజ్యోతి): తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య, ఆయాసంతో బాధపడుతున్న 90 సంవత్సరాల వృద్ధురాలికి ఆంధ్ర హాస్పిటల్‌ వైద్యులు కోత, కుట్లు అవసరం లేకుండా టీఏవీఆర్‌ ప్రక్రియ ద్వారా అరుదైన చికిత్స చేశారు. ఆమె ప్రాణాలను కాపాడగలిగారు. హాస్పిటల్‌ చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ జె.శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆర్‌.దిలీ్‌పకుమార్‌, డాక్టర్‌ జె.రమేష్‌, క్రిటికల్‌కేర్‌ నిపుణుల బృందం విజయవంతంగా వృద్ధురాలికి చికిత్స అందించింది. ఆ చికిత్స ప్రత్యేకతలను డాక్టర్‌ జె.శ్రీరామన్నారాయణ శనివారం మీడియాకు వెల్లడించారు. ‘‘నిమ్మగడ్డ ఆదిలక్ష్మమ్మ తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య, ఆయాసంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ఆంధ్ర హాస్పిటల్‌ (హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో చేర్చారు. ప్రస్తుతం ఆమె సివియర్‌ కాల్సిఫిక్‌ అయోర్టిక్‌ స్టెనోసిస్‌, హార్ట్‌ ఫెయిల్యూర్‌, హార్ట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించాం. వెంటనే అవసరమైన పరీక్షలు నిర్వహించి అయోర్టిక్‌ వాల్వ్‌ రీప్లే్‌సమెంట్‌ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. 90 సంవత్సరాల వయసులో సర్జికల్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ రీప్లే్‌సమెంట్‌ సరికాదని భావించాం.


బాధితురాలి కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం ఆమెకు ప్రత్యామ్నాయంగా కోత, కుట్లు అవసరం లేకుండా ట్రాన్స్‌ కాథెటర్‌ అయోటిక్‌ వాల్వ్‌ రీప్లే్‌సమెంట్‌ (టీఏవీఆర్‌) చికిత్స ఉందని సూచించాం. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో ఈ నెల 22న టీఏవీఆర్‌ చికిత్సను విజయవంతంగా నిర్వహించాం. ఆ మరుసటి రోజే బాధితురాలు ఆరోగ్యం మెరుగుపడి, చక్కగా నడవగలిగారు’’ అని డాక్టర్‌ శ్రీమన్నారాయణ తెలిపారు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఈ టీఏవీఆర్‌ ప్రక్రియను పరిగణించవచ్చని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-05-02T08:54:12+05:30 IST