ఆంధ్రకు 95 టీఎంసీలు
ABN , First Publish Date - 2021-02-06T08:59:21+05:30 IST
వచ్చే మార్చి వరకు రెండు తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం నీటిని కేటాయించడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అంగీకరించింది.

తెలంగాణకు 83.. కేఆర్‌ఎంబీ నిర్ణయం
కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ నిర్ణయం
హైదరాబాద్/అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): వచ్చే మార్చి వరకు రెండు తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం నీటిని కేటాయించడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) అంగీకరించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 95 టీఎంసీలు, తెలంగాణకు 83 టీఎంసీలను కేటాయించనుంది. అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో కనీస మట్టం కంటే దిగువకు నీరు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఇం దుకు రెండు రాష్ట్రాలూ అంగీకరించాయి. కృష్ణా బేసిన్‌లోని నీటి లభ్యత, ఇరు రాష్ర్టాల వినియో గం, తాగు, సాగునీటి అవసరాలు, కేటాయింపుల పై బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఏపీ తరఫున ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నుంచి నాగార్జునసాగర్ సీఈ నరసింహా హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్చి వరకు 83 టీఎంసీల మేర నీటిని కేటాయించాలని తెలంగాణ ఇంజనీర్లు కోరారు. 108 టీఎంసీలు కావాలని ఏపీ ఈఎన్‌సీ అడిగారు. అయితే శ్రీశైలంలో కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) దిగువకు వెళ్లి 807 అడుగుల వరకు నీటిని వినియోగిస్తామని చెప్పడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. శ్రీశైలంలో 810, సాగర్‌లో 520 అడుగుల వరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాలని కోరింది. దీనికి బోర్డు సైతం అంగీకరిస్తూ ఇండెంట్‌ను తగ్గించాలని ఆంధ్రకు సూచించింది. దీంతో 95 టీఎంసీల మేరకు కొత్తగా ఇండెంట్ ఇచ్చేందుకు ఈఎన్‌సీ అంగీకరించారు.
విశాఖకు బోర్డు కార్యాలయం
కేఆర్‌ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని వీలైనంత త్వరగా విశాఖకు తరలిస్తామని రాయ్‌పురే చెప్పా రు. వచ్చే వారంలో హైపవర్ కమిటీ విశాఖలో ప ర్యటించి.. కార్యాలయాన్ని ఎంపిక చేస్తారని.. బహుశా ఏప్రిల్లో అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు.