అమర రాజా పరిశ్రమలో 9 యూనిట్లు మూత

ABN , First Publish Date - 2021-05-02T08:21:50+05:30 IST

అమరరాజా పరిశ్రమలో బ్యాటరీల తయారీకి సంబంధించిన తొమ్మిది యూనిట్లు మూతపడ్డాయి. శనివారం రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశాల మేరకు ఎస్పీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు

అమర రాజా పరిశ్రమలో 9 యూనిట్లు మూత

విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన ఎస్పీడీసీఎల్‌

దెబ్బతిన్న బ్యాటరీలు..సంస్థకు 50 కోట్లు నష్టం

16 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

పరోక్షంగా ఉపాధి పొందుతున్న 80 వేల మందికీ 

నిబంధనలు పాటించామని యాజమాన్యం వెల్లడి

సంస్థ పేరుతో ప్రకటన విడుదల 

రాజకీయ కక్షసాధింపు చర్యలేనని విమర్శలు

చర్యల తర్వాత సంస్థ పేరుతో ప్రకటన విడుదల 


తిరుపతి, మే 1 (ఆంధ్రజ్యోతి): అమరరాజా పరిశ్రమలో బ్యాటరీల తయారీకి సంబంధించిన తొమ్మిది యూనిట్లు మూతపడ్డాయి. శనివారం రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశాల మేరకు ఎస్పీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఉన్నట్టుండి విద్యుత్‌ సరఫరా ఆపివేయడంతో అమరరాజా సంస్థకు సుమారు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. తొమ్మిది యూనిట్లు మూతపడడంతో వీటిలో పనిచేస్తున్న 16 వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. అంతేగాక ఈ యూనిట్ల నుంచి జరిగే ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్‌ వంటి రంగాల ద్వారా దేశవ్యాప్తంగా మరో 80 వేల మందికి పైగా ఆధారపడి ఉన్నారు. వీరి ఉపాధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. 


చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మండలం కరకంబాడి ఆవరణలో నాలుగు, యాదమరి మండలం నూనెగుండ్లపల్లె వద్ద ఐదు యూనిట్లను అమరరాజా సంస్థ నెలకొల్పింది. ఈ యూనిట్ల నిర్వహణ వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో జలకాలుష్యం తలెత్తి ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని, సంబంధిత యూనిట్లను మూసివేయాలంటూ ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఏప్రిల్‌ 30న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్లకు విద్యుత్‌ సరఫరా ఆపేయాల్సిందిగా ఎస్పీడీసీఎల్‌ను కూడా ఆదేశించింది. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ప్రాసె్‌సలో ఉన్న వివిధ రకాల బ్యాటరీలు దెబ్బతిన్నట్టు సమాచారం. దానివల్ల అమరరాజా సంస్థకు సుమారు రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమరరాజా యూనిట్లకు విద్యుత్‌ సరఫరా తొలగింపు విషయంపై ఎస్పీడీసీఎల్‌ చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ డీవీ చలపతిని వివరణ కోరగా.. పీసీబీ నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేతకు ఆదేశాలు అందాయని చెప్పారు. పీసీబీ ఆదేశాల మేరకు విద్యుత్‌ తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.


ప్రభుత్వ చర్యలపై విమర్శలు

అమరరాజా పరిశ్రమలకు చెందిన తొమ్మిది యూనిట్లను మూసివేయించడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. పరిశ్రమ యాజమాన్య కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి టీడీపీలో కీలక నేతగా ఉన్నారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌ గుంటూరు నుంచి టీడీపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ఉద్యమంలో గల్లా జయదేవ్‌ కీలక పాత్ర పోషిస్తూ, లోక్‌సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపుగానే వారి సంస్థలపై చర్యలకు ఒత్తిడి తెచ్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. 


పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం

పర్యావరణ పరిరక్షణకు, అదే సమయంలో వాటాదారుల ప్రయోజనాలకు అమరరాజా సంస్థ  ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని యాజమాన్యం స్పష్టం చేసింది. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అమరరాజా బ్యాటరీస్‌ లిమిటెడ్‌ యూనిట్లను మూసివేయాల్సిందిగా ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి ఏప్రిల్‌ 30న తమకు ఆదేశాలు అందాయని అందులో పేర్కొంది. వీటిని పూర్తిస్థాయిలో సమీక్షించామని, దేశ విదేశాల్లో అతి కీలక రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలకు ఉత్పత్తులను అందజేస్తున్న తమ కంపెనీ వాణిజ్య, సామాజిక, పర్యావరణ పరిరక్షణల విషయంలో కచ్చితమైన నియమ నిబంధనలను పాటిస్తోందని పేర్కొంది. 


వాటాదారుల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా గత 35 ఏళ్ళుగా అంతర్జాతీయ ఖ్యాతి గడించామని వివరించింది. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో తమ సరఫరాలకు ఎలాంటి ఆటంకం కలిగినా దానివల్ల తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. పీసీబీ ఆదేశాలపై వెంటనే చర్యలు ప్రారంభించామని వివరించింది. కంపెనీ ఆధారిత రంగాలు, బ్యాటరీల సరపరాకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అన్ని మార్గాలనూ పరిశీలిస్తున్నామని పేర్కొంది. భద్రత, పర్యావరణ రక్షణలో ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను అందుకున్న సంగతిని ఈ సందర్భంగా యాజమాన్యం ప్రస్తావించింది. పర్యావరణం, ఆరోగ్య, భద్రతకు అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. సంస్థ వాటాదారులను దృష్టిలో ఉంచుకుని సంతృప్తికరమైన పరిణామం లభిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది. 

Updated Date - 2021-05-02T08:21:50+05:30 IST