జగన్ నోటి వెంట వచ్చిన ఒకే ఒక్కమాట కోసం 700 కోట్లు!
ABN , First Publish Date - 2021-02-06T09:14:41+05:30 IST
ఎవరూ అడగకపోయినా, ఎవరికీ అవసరం లేకపోయినా సీఎం జగన్ అన్నారు ...

- అడగని వరం 700 కోట్లు
- ఇంటి వద్ద రేషన్ తీసుకొన్న సంతోషం ఏ ఒక్కరికీ లేదు
- వాహన యోగం పట్టిందన్న సంతృప్తి డ్రైవర్లలో కానరాదు
- జగన్ మాటకోసమే ఇంత ఖర్చు
అమరావతి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మాకు ఇంటికి రేషన్ కావాలని ఏ ఒక్కరూ అడగలేదు...అరకిలోమీటరు లోపలే ఉండే రేషన్ షాపునకు వెళ్లేందుకు ఇబ్బంది పడలేదు..వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ ఇస్తామంటే ఆసక్తీ చూపలేదు.. కేవలం సీఎం జగన్ నోటి వెంట వచ్చిన ఒకే ఒక్కమాట! ప్రజలు అడగని ఆ వరం ఖరీదు అక్షరాలా రూ.700 కోట్లు. ఎవరూ అడగకపోయినా, ఎవరికీ అవసరం లేకపోయినా సీఎం జగన్ అన్నారు కాబట్టి ఇవ్వాలి అంతే! భారం ఎంత పడుతుందనేది అనవసరం. అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనే దాంతో పనిలేదు. ఇంతా చేసి... తీరా సాధించిందేంటి? రేషన్ పంపిణీ మావల్ల కాదని వాహన డ్రైవర్లు చేతులెత్తేస్తుంటే... రేషన్ ఎప్పుడిస్తారా... అని పేదలు ఎదురుచూసే పరిస్థితి! ఇచ్చిన చోట్ల కూడా ఇంటింటికీ పంపిణీ కాస్తా వీధి చివర పంపిణీలా రేషన్ షాపుల తరహాలోనే క్యూలు కట్టే దుస్థితి.
అంతా భారమే..
రేషన్ పంపిణీ కోసం ప్రభుత్వం 9260 వాహనాలు కొనుగోలు చేసింది. ఒక్కో వాహనం విలువ రూ.5.81లక్షలు. అంటే మొత్తం రూ.539 కోట్లు వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం వెచ్చించింది. కార్డుదారులకు ఇచ్చే 2.1కోట్ల చేతి సంచులకు మరో రూ.40 కోట్లు అయ్యాయి. కొత్తగా వచ్చిన వాహనాలను నడిపే డ్రైవర్లకు నెలకు రూ.16వేలు వేతనం ఇవ్వాలి. ఆ భారం ప్రతినెలా రూ.15కోట్లు.... ఏడాదికి లెక్కేస్తే రూ.180 కోట్లు. ఇవన్నీ చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29 వేల మంది డీలర్లకు కమీషన్ ఇవ్వక తప్పదు. అది మరో రూ.22 కోట్లు. వీటితో పాటు వాహనాల్లో కాటాలు, వాహనాలకు రంగులు అదనపు ఖర్చు. ఇవన్నీ కలిపి ఎలా చూసినా ప్రభుత్వంపై రూ.700 కోట్లు భారం పడుతోంది. డోర్ డెలివరీ విధానం లేకపోయుంటే కేవలం డీలర్లకు ఇచ్చే రూ.22 కోట్ల కమీషన్‌తో యథావిధిగా రేషన్ పంపిణీ సాగిపోయేదని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.
వాహనం కోసం నగలు తాకట్టు
‘‘నెలకు రూ.16 వేలు వస్తుందని ఇంట్లోని నగలు తాకట్టు పెట్టి రూ.63 వేలు డీడీలు చెల్లించి వాహనాన్ని కొనుగోలు చేశాను. మొదట చెప్పిన దాని కంటే ఎక్కువగా పనులు చేయాల్సి వస్తోంది. వాహనంలో కేవలం 500 కేజీల బరువు మాత్రమే వేసుకోవాలి. అంతకు మించితే వాహనంపై లోడ్ పడుతోంది. తక్కువ వేసుకొంటే పదేపదే రేషన్ షాపుకు, కార్డుదారుల ఇళ్లకు తిరగాల్సి వస్తోంది. లోడ్ చేసేందుకు డీలర్లు సహాయం చేయడంలేదు’’ - రఘు, కర్నూలు
ఇదేం పంపిణీ!
ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం విజయవంతమైతే కనీసం ప్రజలు ఆనందిస్తారా అంటే అదీ కనిపించడం లేదు. ప్రస్తుత రేషన్ విధానంలో కార్డుదారులకు నెలలో 1 నుంచి 15వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి 12గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8గంటల వరకు పంపిణీ చేస్తున్నారు. కూలీ పనులు చేసుకునే పేదలు ఉదయం కూలికి వెళ్లకముందో లేక సాయంత్రం వెళ్ళొచ్చాకో రేషన్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం రేషన్ పంపిణీని 18 రోజులకు పెంచడమే కాకుండా ఏ రోజు ఎక్కడ ఇవ్వాలో మ్యాపింగ్ చేసింది. దీంతో వాహనం వచ్చే వరకూ పేదలు రేషన్ కోసం ఎదురుచూడక తప్పదు. పైగా వాహనం వచ్చే సమయానికి పేదలు కచ్చితంగా ఇంటి వద్దే ఉండి సరుకులు తీసుకోవాలి. ఒకవేళ వాహనం వచ్చిన సమయంలో సరుకులు తీసుకోకపోతే, మళ్లీ వారు రేషన్ షాపునకు వెళ్ళి తీసుకునే అవకాశం కూడా లేదు. తర్వాత అయినా మళ్లీ వాహనం వద్దే తీసుకోవాలి. దీంతో పలువురు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
రంగులు మారిస్తే పునఃపరిశీలన : ఎస్‌ఈసీ
గ్రామీణ ప్రాంతాల్లో డోర్ డెలివరీపై ఎస్‌ఈసీ... పౌరసరఫరాల శాఖకు శుక్రవారం మరోసారి లేఖ రాసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెండు రోజుల కిందట వాహనాలను పరిశీలించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్... తాజాగా ఆ రంగులన్నీ తొలగించాలని ప్రభుత్వానికి స్పష్టంచేశారు. రంగులన్నీ మార్చి మరోసారి వాహనాన్ని తీసుకొస్తే పంపిణీపై నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని పేర్కొన్నారు. దీంతో ఇక ఈనెలకు గ్రామాల్లో డోర్ డెలివరీ లేనట్టేననే స్పష్టత వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం వాహనాలను పూర్తిగా అధికార పార్టీకి చెందిన రంగులతో నింపేసింది. అందుకోసం చాలా ఖర్చు కూడా చేసింది. ఇప్పుడు ఆ రంగులన్నీ తొలగిస్తే ఎన్నికల అనంతరం మళ్లీ వేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ నెలకు గ్రామీణ ప్రాంతాల్లో డీలర్ల ద్వారానే రేషన్ పంపిణీ చేస్తారని తెలుస్తోంది.
