నెలల తరబడి జీతాలు అందని 108 సిబ్బంది

ABN , First Publish Date - 2021-08-04T08:23:00+05:30 IST

అత్యవసర ఆరోగ్య వాహనాలైన 108 పథకం కింద పనిచేస్తున్న అంబులెన్సుల్లో సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని టీఎన్‌టీయూసీ కార్మిక యూనియన్‌ ఆరోపించింది. యూనియన్‌

నెలల తరబడి జీతాలు అందని 108 సిబ్బంది

రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తాం... టీఎన్‌టీయూసీ


అమరావతి, ఆగస్ట్‌ 3 (ఆంధ్రజ్యోతి): అత్యవసర ఆరోగ్య వాహనాలైన 108 పథకం కింద పనిచేస్తున్న అంబులెన్సుల్లో సిబ్బందికి నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదని టీఎన్‌టీయూసీ కార్మిక యూనియన్‌ ఆరోపించింది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టిముక్కల రఘురామ కృష్ణంరాజు మంగళవారం ఒక ప్రకటన చేస్తూ ఈ అంబులెన్సుల నిర్వహణ తీసుకున్న అరబిందో సంస్ధ అనేక నెలలుగా సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదని, ఆ సంస్ధ యజమాని విజయసాయి రెడ్డి వియ్యంకుడు కావడంతో  ఆ జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదని ఆరోపించారు. ‘పెద్ద ప్రచారార్భాటంతో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి విజయవాడ నడిబొడ్డున ఈ వాహనాలకు జెండా ఊపి   ప్రారంభించారు. సిబ్బంది జీవితాల్లో వెలుగులు నింపుతానని పాదయాత్ర సమయంలో ఊదరగొట్టారు. ఇప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వారిని ఏడిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సిబ్బంది ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు.


కరోనా సమయంలో ఈ వాహనాల సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేశారు. ప్రభుత్వం కనీస రక్షణ పరికరాలు ఇవ్వకపోయినా సొంత డబ్బులతో వాటిని సమకూర్చుకొని కరోనా బాధితులను ఆస్పత్రులకు తరలించారు. రోజుకు పధ్నాలుగు గంటలు పనిచేస్తున్నా ప్రభుత్వానికి కనికరం లేకపోవడం దారుణం’ అని ఆయన విమర్శించారు.   తక్షణ ప్రాధాన్యంగా గుర్తించి ఈ వాహనాల సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2021-08-04T08:23:00+05:30 IST