వామ్మో.. ఒమైక్రాన్!
ABN , First Publish Date - 2021-12-30T07:49:12+05:30 IST
రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ క్రమంగా అన్ని జిల్లాలకూ విస్తరిస్తోంది.

- రాష్ట్రంలో ఒక్కరోజే 10 కేసులు నమోదు
- ఇప్పటి వరకూ 16 మందికి పాజిటివ్
- తూర్పున ముగ్గురికి కొత్త వేరియంట్
- కర్నూలు, అనంతల్లో ఇద్దరు చొప్పున,
- గుంటూరు, చిత్తూరు, పశ్చిమల్లో ఒక్కొక్కరికి
- విదేశాల నుంచి వచ్చినవారు 13 మంది
- మరో ముగ్గురు స్థానికులకూ నిర్ధారణ
- భర్త నుంచి భార్య, కుమారుడికీ వైరస్
- అందరూ కొవిడ్ నిబంధనలు
- తప్పనిసరిగా పాటించాలి: ఆరోగ్యశాఖ
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ క్రమంగా అన్ని జిల్లాలకూ విస్తరిస్తోంది. బుధవారం ఒక్కరోజే పది మందికి కొత్త వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో తూర్పుగోదావరిలో ముగ్గురు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, గుంటూరు, పశ్చిమ, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కువైత్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు రూరల్ మండలం ప్రత్తికోళ్లలంకకు వచ్చిన మహిళ(41)కు, నైజీరియా నుంచి గుంటూరు జిల్లా తెనాలి వచ్చిన వ్యక్తి(48)కి, సౌదీ అరేబియా నుంచి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామానికి వచ్చిన వ్యక్తి(50)కి, అమెరికా నుంచి తిరుపతి, అనంతపురం వచ్చిన ఇద్దరు యువకులకు, యూఏఈ నుంచి కర్నూలు వచ్చిన దంపతులకు ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. వీరిలో ఊబలంక వచ్చిన వ్యక్తి నుంచి అతని భార్య, కుమారుడికి కూడా కొత్త వేరియంట్ సోకింది. అలాగే అమెరికా నుంచి అనంతపురానికి వచ్చిన యువకుడి ద్వారా ఓ బాలిక(17)కు వ్యాధి సంక్రమించింది. బుధవారం హైదరాబాద్‌లోని సీసీఎంబీ వీరి రిపోర్టులను విడుదల చేసింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 16కు చేరిందని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
శరవేగంగా స్థానికులకు వ్యాప్తి
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులతో పాటు స్థానికులకు కూడా ఒమైక్రాన్ విస్తరిస్తోంది. నెమ్మదిగా లోకల్ ఒమైక్రాన్‌గా రూపాంతరం చెందుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ వచ్చినవారిలో 13మంది విదేశాల నుంచి వచ్చినవారు ఉండగా మరో ముగ్గురు స్థానికులు. కరోనా తొలిదశలో మొదటి కేసు నెల్లూరు జిల్లాలో నమోదయింది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెంది. అల్లకల్లోలం సృష్టించింది. ఒమైక్రాన్ వేరియింట్ కూడా కరోనా కంటే శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ తొలి కేసు విశాఖపట్నంలో నమోదయింది. గతనెల 27న విశాఖ చేరుకున్న 34 ఏళ్ల యువకుడికి ఒమైక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కానీ ఆ తర్వాత చేసిన పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అనంతరం ఈ నెల 22న కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమైక్రాన్ సోకింది. ఆ తర్వాత 24, 25 తేదీల్లో రెండేసి కేసులు చొప్పున బయటపడ్డాయి. ఇక బుధవారం ఒకేసారి 10 కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది.
అప్రమత్తంగా ఉండాలి: వైద్య నిపుణులు
ఒమైక్రాన్ వేరియంట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి స్థానికులకు వ్యాప్తి చెందితే తర్వాత రాష్ట్రాన్ని చుట్టేస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఆరోగ్యశాఖ కూడా ఒమైక్రాన్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రజలందరూ మాస్క్ ధరించాలని, శానిటైజర్ ఉపయోగించాలని, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరింది. విదేశాల నుంచి వచ్చినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను వెంటనే గుర్తించి, వారందరినీ ఐసొలేషన్ చేస్తే తప్ప ఒమైక్రాన్ వ్యాప్తిని అదుపు చేయడం సాధ్యం కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని సూచిస్తున్నారు.