మే నెలలోనే 1.30 లక్షల మరణాలు

ABN , First Publish Date - 2021-06-15T08:08:28+05:30 IST

‘కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్నే కాదు రాష్ట్రాన్ని కూడా కుదిపేసింది. సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయిలో విజృంభించిన మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో 1.30 లక్షల మరణాలు సంభవించాయి’ అని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది

మే నెలలోనే 1.30 లక్షల మరణాలు

ఆ నెలలో సాధారణం కంటే 400 శాతం అధికం

కేంద్ర ప్రభుత్వ మరణాల రిజిస్టర్‌లోనే నమోదు

కరోనా మహమ్మారి విజృంభణ వల్లే ఇంత విషాదం

మరణాల లెక్కలు దాచిపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

సర్కారు లెక్క ప్రకారం మే నెలలో 2,938 కరోనా మృతులు

మిగిలిన వారంతా ఎలా చనిపోయారు: పట్టాభిరాం  

జాతీయ వెబ్‌సైట్‌ కథనాన్ని ఉదహరించిన టీడీపీ 

మరణాల సమాచారం సేకరణకు మిస్డ్‌ కాల్‌ ఉద్యమం

8144226661 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని పిలుపు


అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్నే కాదు రాష్ట్రాన్ని కూడా కుదిపేసింది. సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయిలో విజృంభించిన మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో 1.30 లక్షల మరణాలు సంభవించాయి’ అని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. ప్రతి ఏటా మేలో సహజంగా సంభవించే మరణాల కంటే ఇవి 400 శాతం అధికమని పేర్కొంది. ఆ సమయంలో కరోనా మహమ్మారి విరుచుకుపడడం వల్లే ఇన్ని మరణాలు చోటు చేసుకున్నాయని ఆ పార్టీ ఆరోపించింది. సివిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం పేరుతో రాష్ట్రాల నుంచి అందిన సమాచారంతో కేంద్ర ప్రభుత్వం మర ణాల రిజిస్టర్‌ నిర్వహిస్తుందని.. అందులోని లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒక్క మే నెలలోనే ఇన్ని మరణాలు సంభవించాయని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్ర్కోల్‌ అనే జాతీయస్థాయి వెబ్‌సైట్‌ కేంద్ర ప్రభుత్వ సివిల్‌ రిజిష్టర్‌ నుంచి సమాచారం సేకరించి ఈ వివరాలను బహిర్గతం చేసిందని తెలిపారు. ‘ఏపీలో గత రెండేళ్లలో మే నెలలో సగటున 27 వేల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ.. ఈ ఏడాది మే నెలకు వచ్చేసరికి ఏకంగా 1.30 లక్షల మంది  మరణించారు. అంటే సాధారణంగా చోటు చేసుకొనే మరణాలకంటే 1.03 లక్షలు ఎక్కువ. కరోనా వైరసే దీనికి ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదైన సమాచారమే కేంద్రానికి అందుతుంది. కానీ.. ఇక్కడ దీన్ని బయట పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. ఈ ఏడాది మే నెలలో కరోనాతో 2,938 మంది చనిపోయారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మరి మిగిలిన లక్ష మంది ఎలా చనిపోయారు? బయటకు చెబితే రాష్ట్రంలో కరోనాను అదుపు చేయలేకపోతున్నారని విమర్శలు వస్తాయనో లేక వారందరికీ పరిహారం ఇవ్వాల్సి వస్తుందనో రహస్యంగా ఉంచారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రిజిష్టర్‌ ద్వారా మరణాల సంఖ్య బయటకు వచ్చింది’ అని పట్టాభిరాం పేర్కొన్నారు. 


సర్టిఫికెట్లపై కరోనాతో అని రాయొద్దు

మరణాలకు సంబంధించిన ధృవపత్రాలు జారీ చేసే సమయంలో కరోనాతో చనిపోయారు అని రాయొద్దని ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చిందని, ఇతర కారణాలతో మరణించారని వారితో రాయించిందని పట్టాభిరాం ఆరోపించారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఒకేరాత్రి 31 మంది చనిపోతే 11 మందే చనిపోయినట్లుగా చూపించారని, ఈ ఒక్క సంఘటనలోనే ఇరవై మంది మరణాలను దాచిపెట్టారని అన్నారు. 


మిస్డ్‌ కాల్‌ ఉద్యమం...

ప్రజల నుంచి కరోనా వల్ల చనిపోయిన వారి వివరాలు సేకరించడానికి తమ పార్టీ తరఫున మిస్డ్‌ కాల్‌ ఉద్యమం చేపట్టినట్లు పట్టాభిరాం వెల్లడించారు. ‘8144226661’ నంబర్‌కు ఎవరైనా ఒక మిస్డ్‌కాల్‌ ఇస్తే వారికి ఒక లింక్‌ పంపుతామని, అందులో చనిపోయిన వారి వివరాలు నమోదుచేసి వాట్సా్‌పలో తిరిగి పంపవచ్చని ఆయన వివరించారు. ఒకవేళ అలా నమోదుచేసి పంపలేని వారికి తమ పార్టీ తరఫున ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకొంటామని చెప్పారు. ప్రజల నుంచి వాస్తవ వివరాలు తీసుకొని ఆ సమాచారం మొత్తం ప్రభుత్వానికిచ్చి వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని పోరాడతామని ఆయన తెలిపారు. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు బిహార్‌ ప్రభుత్వం రూ.4 లక్షల పరిహారం ఇస్తోందని, ఇక్కడ మాత్రం ఎందుకివ్వరని ఆయన ప్రశ్నించారు.  వ్యాక్సిన్లు వేస్తేనే కరోనా నుంచి ప్రజల ప్రాణాలు దక్కుతాయని, కానీ ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పట్టాభి ఆరోపించారు. ‘రాష్ట్రంలో ఇప్పటికి 26 లక్షల మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేశారు. 67 లక్షల మందికి మొదటి డోసు వేశారు. ఇదే వేగంతో వేస్తూ పోతే రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్‌ అందించాలంటే మూడేళ్లు పడుతుంది. ఇదేనా పనిచేసే పద్ధతి’ అని ఆయన ప్రశ్నించారు.

Updated Date - 2021-06-15T08:08:28+05:30 IST