చిరుతిళ్లు తెగ తినేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-09-29T07:28:39+05:30 IST

దేశంలో ఎక్కువ మంది బియ్యం లేదా గోధుమల వంటి తృణధాన్యాలను శాస్త్రీయంగా సూచించిన పరిమాణం కంటే అధికంగా తీసుకుంటున్నారని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) వెల్లడించింది. ఇక ఇదే సమయంలో అధిక పోషకాలు ఉండే

చిరుతిళ్లు తెగ తినేస్తున్నారు!

  • పట్టణ ప్రజల ఆహారంలో 11 శాతం చిప్స్‌, స్వీట్లే
  • అసమతుల ఆహారంతో ఊబకాయం, మధుమేహం
  • పప్పుధాన్యాలు, పౌలీ్ట్ర ఉత్పత్తులు, చేపల వంటి 
  • ప్రొటీన్‌ ఆహారాన్ని తినేది 11 శాతమే

దేశంలో ఎక్కువ మంది బియ్యం లేదా గోధుమల వంటి తృణధాన్యాలను శాస్త్రీయంగా సూచించిన పరిమాణం కంటే అధికంగా తీసుకుంటున్నారని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) వెల్లడించింది. ఇక ఇదే సమయంలో అధిక పోషకాలు ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పప్పు ధాన్యాలు, పౌలీ్ట్ర ఉత్పత్తులు, చేపలను మాత్రం తినాల్సిన దానికంటే తక్కువగా తింటున్నారని తెలిపింది. ప్రత్యేకించి పట్టణ ప్రజలైతే.. తగినన్ని పోషకాలున్న ఆహారం తినకపోయినా చిప్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు, స్వీట్లను తెగలాగించేస్తున్నారని పేర్కొంది. పట్టణ ప్రజలు ఒక రోజులో తినే ఆహారంలో 11 శాతం దాకా ఇవే ఉంటున్నాయని.. గ్రామీణ ప్రజలూ వారి ఆహారంలో 4 శాతం మేర చిప్స్‌, చాక్లెట్స్‌, బిస్కెట్లే తీసుకుంటున్నారని ఆ సంస్థ తాజా నివేదికలో ప్రస్తావించింది. దేశంలో 97.1 శాతం మంది గ్రామీణులు, 68.8 శాతం మంది పట్టణ ప్రజలు సూచించిన పరిమాణం కంటే  అధిక మొత్తంలో తృణధాన్యాలు తీసుకుంటున్నారని వివరించింది.


పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు సూచించిన దానికంటే తక్కువగా తింటూ, అసమతుల ఆహారం తీసుకోవడం వల్ల మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారని ఆ సంస్థ తాజా నివేదికల్లో స్పష్టం చేసింది. పట్టణ ప్రజల్లో 18 శాతం, గ్రామాల్లో కేవలం 5 శాతం మంది ప్రజలు మాత్రమే సూచించిన పరిమాణంలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే పప్పులు, విత్తనాలు, పాలు, మాంసాహారం వంటివి తింటున్నారు. దేశ ప్రజల్లో 66 శాతం మంది కంటే ఎక్కువ మంది తగినంత ప్రొటీన్‌తో కూడిన ఆహారం తినడం లేదని జాతీయ పోషకాహార సంస్థ నివేదించడం గమనార్హం. ‘భారతీయులకు ఎలాంటి పోషకాలు అవసరం’? ‘భారతీయులు ఏం తింటున్నారు’? అనే అంశాలపై హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఐఎన్‌ రూపొందించిన నివేదికలను సోమవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ విడుదల చేశారు. కొవిడ్‌ వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో పోషకాహారానికి ప్రాధాన్యం పెరిగింది. ఈనేపథ్యంలో ఆహారపు అలవాట్లకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్‌ ద్వారా ప్రజల నుంచి నేరుగా సేకరించే పరిశోధనా ప్రక్రియకు కూడా ఎన్‌ఐఎన్‌ ఈసందర్భంగా శ్రీకారం చుట్టింది.


45 శాతం మించితే చిక్కే!

పోషకాహార నిపుణుల సూచనల ప్రకారం మనం తినే ఆహారంలో తృణధాన్యాలు 45 శాతానికి మించకూడదు. కానీ పట్టణ ప్రజల ఆహారంలో 51 శాతం, గ్రామీణ ప్రజల ఆహారంలో 65 శాతం బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలే ఉంటున్నాయి. అలాగే మనం రోజూ తీసుకునే ఆహారంలో పప్పుధాన్యాలు, విత్తనాలు, మాంసం, చేపలు 17 శాతం ఉండాలని నిపుణులు సూచిస్తుండగా వాస్తవానికి ప్రజల ఆహారంలో 11 శాతం మాత్రమే పోషకవిలువలు ఉండే ఆహారం ఉంటోంది. పట్టణాల కంటే గ్రామీణులు అధిక కార్బోహైడ్రేట్స్‌ ఉన్న ఆహారం తీసుకుంటున్నారు. అంటే బియ్యం, గోధుమలే వారి ప్రధాన ఆహారం కాగా పోషకాలు మాత్రం తక్కువగా తింటున్నారు. పట్టణాల్లో మధ్యవయస్కులు రోజుకు 1943 క్యాలరీలు ఆహారంగా తీసుకుంటున్నారు. అందులో 289 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, 51.6 గ్రాముల కొవ్వుపదార్ధాలు, 55.4 గ్రాముల ప్రొటీన్‌ ఉంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో 2081 క్యాలరీల ఆహారం తీసుకుంటుండగా అందులో 368 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌, 36 గ్రాముల కొవ్వు పదార్ధాలు, 69 గ్రాముల ప్రొటీన్‌ ఉన్న పదార్ధాలను తింటున్నారు. శరీరానికి అవసరమైన మొత్తం శక్తిలో అధికశాతాన్ని తృణధాన్యాల నుంచే పొందుతున్నారు. బియ్యం, గోధుమలు అధికంగా తీసుకొని.. తగిన మొత్తంలో కూరగాయలు, ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోకపోవడం.. చిరుతిళ్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అసమతుల ఆహారం తీసుకోవడం వల్ల పట్టణ ప్రజల్లో 53.6 శాతం మందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుండగా, 31.4 శాతం మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. 12.5 శాతం మంది స్థూలకాయం ముప్పును ఎదుర్కొంటున్నారు.


‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే ’...

రోజూ మనం తినే ఆహారంలో ఏ పదార్థాలు ఎంత మొత్తంలో ఉండాలనే వివరాలతో ‘మై ప్లేట్‌ ఫర్‌ ది డే ’ నివేదికను ఎన్‌ఐఎన్‌ వెల్లడించింది. మన భోజనంలో 270 గ్రాముల అన్నం లేదా తృణధాన్యాలు తీసుకోవాలి. 350 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, 150 గ్రాముల పండ్లు, 20 గ్రాముల బాదం, బీన్స్‌ తదితర విత్తనాలు ఆహారంగా తీసుకోవాలి. అలాగే పప్పుధాన్యాలు, గుడ్డు, మాంసాహారం 90 గ్రాములు తీసుకోవాలి. 27 గ్రాముల మాంసకృత్తులు, నూనెలను ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆ నివేదికలలో తెలిపారు.


‘పోషణ్‌ మాహ్‌’ భేష్‌: అమితాబ్‌ కాంత్‌

దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చిరుధాన్యాల వాడకాన్ని పెంచేలా ప్రోత్సహించాలని జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్‌)ను నీతి ఆయోగ్‌ ముఖ్య కార్యనిర్వాహణాధికారి అమితాబ్‌ కాంత్‌ కోరారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐఐఎంఆర్‌లో ఇండియన్‌ డైటెటిక్స్‌ అసోసియేషన్‌, న్యూట్రిషన్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియాలు సంయుక్తంగా నిర్వహించిన ‘పోషణ్‌ మాహ్‌’ వెబినార్‌లో ఆయన మాట్లాడారు. సెప్టెంబరును ‘జాతీయ పోషకాహార మాసం’ (పోషణ్‌ మాహ్‌)గా పరిగణించి చిరుధాన్యాల ఉత్పత్తుల వాడకాన్ని పెంపొందించడానికి ఐఐఎంఆర్‌ చేస్తున్న కృషిని అభినందించారు. ఏపీ, తెలంగాణలలో మహిళా, శిశు సంక్షేమ శాఖలు ఈ దిశగా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. 

Updated Date - 2020-09-29T07:28:39+05:30 IST