పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన యువతి

ABN , First Publish Date - 2020-05-17T20:36:14+05:30 IST

ట్యాంక్ బండ్‌పై వాకింగ్‌కు వెళ్లిన తమపై పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ నందిత అనే యువతి ట్విటర్ ద్వారా డీజీపీ మహేందర్ రెడ్డికి, హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు

పోలీసులపై డీజీపీకి ఫిర్యాదు చేసిన యువతి

హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై వాకింగ్‌కు వెళ్లిన తమపై పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారంటూ నందిత అనే యువతి ట్విటర్ ద్వారా డీజీపీ మహేందర్ రెడ్డికి, హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై కోటేష్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించింది.


వివరాల్లోకెళితే.. ఇవాళ ఉదయం ట్యాంక్‌ బండ్‌పై వాకింగ్‌కు వెళ్లిన తనతో, తన సోదరుడితో పోలీసులు అమర్యాదగా వ్యవహరించారని నందిత ఆరోపించింది. తమ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి వ్యక్తిగత వివరాలు అడిగారని పేర్కొంది. తన సోదరుడికి ఇటీవలే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, డాక్టర్ సూచనల మేరకు వాకింగ్‌కు తీసుకువచ్చామని చెప్పినా పోలీసులు వినలేదని సదరు యువతి ఆరోపించింది. అంతేకాదు.. పక్కనుంచే ఇతర మతానికి చెందిన వారు వెళ్తున్నా వారిని ఆపని పోలీసులు.. తమను మాత్రం ఆపి వేధించారని పేర్కొంది. కావాలనే తమను టార్గెట్ చేశారని ఆరోపించింది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వచ్చిన తన తండ్రిని కూడా పోలీసులు నోటికొచ్చినట్లు దూషించారని ఆరోపించింది. అకారణంగా తన తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఆయనపై, తన సోదరుడిపై కేసు పెట్టారని ఆరోపించింది. 


కాగా, యువతి ఫిర్యాదుకు స్పందించిన చిక్కడపల్లి ఎస్‌హెచ్ఓ(స్టేషన్ హౌస్ ఆఫీసర్) ట్విట్టర్‌లోనే వివరణ ఇచ్చారు. నందిత, ఆమె సోదరుడు మాస్క్ సరిగ్గా ధరించకుండా జాగింగ్‌కు వచ్చారు. ఇదే విషయమై అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారిని ఆపి ప్రశ్నించారని ఎస్‌హెచ్ఓ వివరించారు. అయితే ముస్లిం మతానికి చెందిన వారిని ఎందుకు ఆపడం లేదు, హిందూ మతానికి చెందిన వారినే ఎందుకు ఆపుతున్నారంటూ నందిత సోదరుడు తమ వాళ్లతో వాగ్వాదానికి దిగాడని ఎస్‌హెచ్ఓ పేర్కొన్నారు. విషయం తెలిసి తాను వెంటనే అక్కడికి చేరుకున్నానని అధికారి తెలిపారు. యువతి తండ్రి జేఆర్ శ్రీనివాస్ ఓ మ్యాగజైన్ రిపోర్టర్‌గా పని చేస్తున్నాడని, తాను వెళ్లే సరికి తండ్రీకొడుకులు ఇద్దరూ కానిస్టేబుళ్లతో గొడవకు దిగారని, నా పిల్లలనే ఆపుతావా అంటూ తండ్రి వాగ్వాదానికి దిగాడన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని అతనికి చెప్పినా వినకుండా వాదులాడాడని చెప్పారు. వారిద్దరూ మత పరమైన విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారని, విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారని అన్నారు. వారిని స్టేషన్‌కు తీసుకెళ్లే సమయంలో నందిత సోదరుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడని ఎస్‌హెచ్ఓ తెలిపారు. శ్రీనివాస్ తన బట్టలు తానే చించుకున్నాడని అన్నారు. దీంతో తండ్రి శ్రీనివాస్, కొడుకు వంశీ ఇద్దరిపై పెట్టీ కేసు బుక్ చేశామని ఎస్‌హెచ్ఓ వెల్లడించారు.

Updated Date - 2020-05-17T20:36:14+05:30 IST