మీ సేవలు అందరికీ ఆదర్శం

ABN , First Publish Date - 2020-04-28T10:16:05+05:30 IST

గాంధీ ఆస్పత్రిలోని కరోనా ప్రత్యేక వార్డులో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని కేంద్ర బృందం ప్రశంసించింది. ఇక్కడి సేవలు ఇతర ప్రాంతాలకు

మీ సేవలు అందరికీ ఆదర్శం

  • గాంధీ వైద్య సిబ్బందికి కేంద్ర బృందం ప్రశంసలు
  • మూడో రోజూ హైదరాబాద్‌లో విస్తృత పర్యటన
  • గాంధీలో కరోనా వార్డు పరిశీలన.. వైద్యులతో సమావేశం
  • 90 శాతం కేసుల పరిస్థితి సాధారణమేనన్న వైద్యులు
  • నేడు కూడా ఇక్కడే కేంద్ర బృందం.. సీఎస్‌తో భేటీ


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలోని కరోనా ప్రత్యేక వార్డులో సేవలందిస్తున్న వైద్య సిబ్బందిని కేంద్ర బృందం ప్రశంసించింది. ఇక్కడి సేవలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడింది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు తీరు, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు సర్కారు తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేసేందుకు తెలంగాణకు వచ్చిన కేంద్ర అంతర్‌ మంత్రిత్వ శాఖ అధికారుల బృందం మూడో రోజు రాష్ట్ర రాజధానిలో పలు ప్రాంతాలను సందర్శించింది. ముందుగా మెహిదీపట్నంలోని సరోజినీ కంటి ఆస్పత్రిలోని హైదరాబాద్‌ జిల్లా సెంట్రల్‌ మెడికల్‌ స్టోర్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడి నుంచి ఖైరతాబాద్‌లోని ఓ కట్టడి ప్రాంతానికి వెళ్లి... క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించారు. హుమాయున్‌నగర్‌ కట్టడి ప్రాంతంలో డయాబెటిక్‌, పెర్సాలిన్‌, బీపీ ఇతర అత్యవసర సేవలు ఎలా అందిస్తున్నారో పరిశీలించారు. ఫీవర్‌ సర్వే, పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్‌ జరుగుతోన్న తీరును అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాల సరఫరా ఎలా చేస్తున్నారని స్థానికులను అడిగారు. అనంతరం గాంధీ ఆస్పత్రికి వచ్చిన బృందం.. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌, ఇతర విభాగాల వైద్యాధికారులతో సమావేశమైంది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి కల్పిస్తున్న వైద్య వసతులు, పీపీఈ కిట్లు, మందుల లభ్యతపై ఆరా తీసింది. కరోనా చికిత్స పొందుతున్న వారిలో 90శాతం మంది ఆరోగ్య స్థితి సాధారణంగానే ఉందని కేంద్ర బృందానికి వైద్యులు వివరించారు. 


అంతకుముందు గుడిమల్కాపూర్‌ కూరగాయల హోల్‌సేల్‌ మార్కెట్‌ను బృందం సందర్శించింది. మార్కెట్‌ నిర్వహణ, లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌కు కూరగాయలు తీసుకువస్తున్న రైతులు, కొనుగోలుదారులతో మాట్లాడారు. అంబేద్కర్‌ రిటైల్‌ మార్కెట్‌లో వ్యాపారం చేసే పలువురితో వ్యాపారం ఎలా ఉంది? ఏవైనా ఇబ్బందులున్నాయా? అని అడిగారు. మాస్క్‌లు ధరించాలని, కొనుగోలుదారులు భౌతికదూరం పాటించేలా చూడాలని సూచించారు. జలశక్తి అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోకా నేతృత్వంలో అంతర్‌ మంత్రిత్వ శాఖ అధికారులు డాక్టర్‌ చంద్రశేఖర్‌, డాక్టర్‌ హేమలత, ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, ప్రొఫేసర్‌ శేఖర్‌ చతుర్వేదీలతో కూడిన కేంద్ర బృందం వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, జోనల్‌ కమిషనర్లు రవికిరణ్‌, ప్రావీణ్య తదితరులు ఉన్నారు. మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం.. నాలుగో రోజు కూడా ఇక్కడే ఉండనుంది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానుంది. 

Updated Date - 2020-04-28T10:16:05+05:30 IST