‘సఖి’ కౌన్సెలింగ్ కేంద్రంలో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-12-28T08:20:36+05:30 IST
కౌన్సెలింగ్ కోసం ‘సఖి’ సెంటర్‌కు వచ్చిన ఓ యువతి మానసిక వేదనతో ఆ కౌన్సెలింగ్ కేంద్రంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది

మైనర్ ప్రేమికుడితో హైదరాబాద్‌లో వివాహం
అనంతరం కర్ణాటకకు వెళ్లిపోయిన కొత్త జంట
తలిదండ్రుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
యువకుడికి మైనారిటీ తీరిన తర్వాత
పెళ్లి చేయాలని తల్లిదండ్రులకు అప్పగింత
కౌన్సెలింగ్ కోసం 22న ‘సఖి’ కేంద్రానికి యువతి
మానసిక వేదనతో కేంద్రంలోనే బలవన్మరణం
జనగామ టౌన్, డిసెంబరు 27: కౌన్సెలింగ్ కోసం ‘సఖి’ సెంటర్‌కు వచ్చిన ఓ యువతి మానసిక వేదనతో ఆ కౌన్సెలింగ్ కేంద్రంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. మృతురాలిని జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన శ్రీలేఖ (20) గా గుర్తించారు. జిల్లా కేంద్రం సమీపంలోని చంపక్ హిల్స్ సఖి సెంటర్ బాత్‌రూంలో చున్నీతో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. జనగామ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన సోమనర్సయ్య, ప్రేమలత దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు శ్రీలేఖ డిగ్రీ పూర్తి చేసింది. ఇదే గ్రామానికి చెందిన దేశగాని మనోహర్ (20) అనే యువకుడిని ఆమె ప్రేమించింది. ఈనెల 15న మనోహర్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిన శ్రీలేఖ 16న హైదరాబాద్‌లో ఓ దేవాలయంలో అతడిని ప్రేమ వివాహం చేసుకుంది.
కులాంతర వివాహం కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహం చేసుకొని కర్ణాటకకు వెళ్లిన ఆ జంటను కొడకండ్ల పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌లో కౌన్సెలింగ్ చేశారు. మనోహర్‌కు 21 ఏళ్ల వయస్సు లేకపోవడం, 11 నెలలు తక్కువగా ఉండడంతో మైనర్‌గా నిర్ధారించారు. ప్రేమికులిరువురికీ పోలీసులు నచ్చజెప్పారు. మనోహర్‌కు మైనారిటీ తీరిన తరువాత పెళ్లి చేయాలని సూచించి యువకుడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ పరిణామంతో శ్రీలేఖ మానసికంగా కుంగిపోయింది. దీంతో ఎస్‌ఐ సతీశ్ ఈనెల 22న కౌన్సెలింగ్ కోసం ఆమెను జనగామ సఖి సెంటర్‌లో చేర్పించారు. కౌన్సెలింగ్ పొందుతున్న ఆమె తీవ్ర మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. సఖి సెంటర్ సమన్వయకర్త రేణుక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లేశ్ తెలిపారు.