31 దాంకా షట్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-23T09:03:57+05:30 IST

ఆదివారం ఇంట్లోనే ఉన్నారా!? మరో తొమ్మిది రోజులు ఇంట్లో ఉండాల్సిందే! కరోనాపై సమరంలో విజయం సాధించడానికి స్వీయ నిర్బంధం తప్పనిసరి!

31 దాంకా షట్‌డౌన్‌

 తెల్ల కార్డుదారులకు 1500 నగదు.. 12 కిలోల బియ్యం

ఇందుకు 2,417 కోట్ల నిధులు విడుదల

మరో 9 రోజులు ఇళ్లలోనే ఉండాలి

స్థానికులకు సోకకుండా ఈ జాగ్రత్త

జనతా కర్ఫ్యూ విజయవంతమైంది

రాష్ట్ర ప్రజలు అద్భుతంగా స్పందించారు

చప్పట్లతో సంఘీభావ సంకేతమిచ్చారు

శిరస్సు వంచి ధన్యవాదాలు చెబుతున్నా

నిత్యావసరాలకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు 

కొనుగోళ్ల కోసం ఇంటికి ఒకరికి అనుమతి

ప్రభుత్వోద్యోగులకూ సెలవులు

అత్యవసర సేవల్లోని వారు విధుల్లోనే..

రాష్ట్ర సరిహద్దులన్నీ మూసివేస్తున్నాం

చీమను, దోమను కూడా రానివ్వం: కేసీఆర్‌

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌

రైళ్లు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు,

మెట్రో సేవల నిలిపివేత: కేంద్రం

గూడ్స్‌ రైళ్లకు మాత్రమే అనుమతి


‘‘చరిత్రలో లేనివిధంగా తెలంగాణ ప్రజలు అద్భుతంగా స్పందించారు. వ్యాధి వ్యాప్తి కాకుండా ఇండ్లకే పరిమితమయ్యారు. చప్పట్లతో సంఘీభావ సంకేతం ఇచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఇందుకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. జనతా కర్ఫ్యూలో హైదరాబాద్‌, ముంబై ముందంజలో ఉన్నాయని జాతీయ మీడియా చెప్పింది. ఇది మనకు గర్వకారణం. వచ్చే వారం వరకూ ఇంటి లోపలే గడపండి’’

సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆదివారం ఇంట్లోనే ఉన్నారా!? మరో తొమ్మిది రోజులు ఇంట్లో ఉండాల్సిందే! కరోనాపై సమరంలో విజయం సాధించడానికి స్వీయ నిర్బంధం తప్పనిసరి! సాక్షాత్తూ సీఎం కేసీఆర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదివారం పాటించిన బంద్‌ మరో 9 రోజులు కొనసాగుతుందని తెలిపారు. కరోనా స్థానికులకు వ్యాపించకుండా నిలువరించడం అత్యంత కీలకమని, దీని కోసం మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌ చేస్తున్నామని ప్రకటించారు. అత్యవసర సేవలు, నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, పేదలు, కూలీలు ఇబ్బంది పడకుండా తెల్ల కార్డుదారులకు రేషన్‌ షాపుల ద్వారా ఉచితంగా బియ్యంతోపాటు కుటుంబానికి రూ.1500 నగదు ఇస్తామని ప్రకటించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఆయన ఉన్నతస్థాయిలో సమీక్షించారు.


అనంతరం, ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ పరిణామాలపై హైలెవల్‌ కమిటీ చర్చించింది. విమానాల రద్దుతో ఇతర దేశాల నుంచి వస్తున్న వారు ఆగిపోయారు. వచ్చినవారు హోం ఐసొలేషన్‌, ఆసుపత్రుల్లోనే ఉన్నారు. ఇప్పటికి ఇద్దరు స్థానికులకు మాత్రమే వచ్చింది. ఇది వ్యాప్తి చెందకుండా మన కోసం.. మనందరి కోసం మనం చొరవ చూపాలి. అందుకే, మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటిస్తున్నాం. ప్రజలు ఈ రోజు చూపిన క్రమశిక్షణను అప్పటివరకూ చూపించాలి’’ అని నిర్దేశించారు. ఇంట్లో ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.1,500 నగదు ఇస్తాం. రాష్ట్రంలో మొత్తం 1.3 కోట్ల కుటుంబాలు ఉండగా 87.59 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నాం. ఇందుకు 1.50 లక్షల టన్నులు అవుతోంది. ఇప్పుడు డబుల్‌ చేస్తున్నాం కనక.. 3.36 లక్షల టన్నులు అవుతుంది. రూ.1,103 కోట్లు ఖర్చవుతుంది. కుటుంబానికి రూ.1,500 చొప్పున ఇవ్వాలంటే రూ.1,314 కోట్లు అవసరం. మొత్తం రూ.2,417 కోట్లు విడుదల చేస్తున్నాం. వీరందరికీ బియ్యం, నగదు రేషన్‌ షాపుల ద్వారా త్వరలో ఇస్తాం.


నిత్యావసరాలకు అనుమతి

బయట ఐదుగురికి మించి గుమిగూడవద్దు. వచ్చినా 3 అడుగుల తేడా ఉండా లి. మందులు, పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, అత్యవసర వస్తువుల కోసం కుటుంబానికి ఒక్కరినే బయటికి అనుమతిస్తారు. ఇలాంటి స్థితుల్లో ఎవరో వచ్చి కాపాడరు. మనల్ని మనమే కాపాడుకోవాలి.


అత్యవసరం కాని వైద్య సేవలన్నీ బంద్‌

వైద్యులు, సిబ్బందిపై భారం తగ్గిస్తున్నాం. అత్యవసరం కాని శస్త్ర చికిత్సలన్నీ వాయిదా వేస్తున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేస్తున్నాం. వాటి పరిధిలోని గర్భిణులు, చిన్నారులకు పోషకాహార లోపం రాకుండా ఆహార సరఫరా కొనసాగుతుంది. ఈ నెల, వచ్చే నెలలో ప్రసవానికి సిద్ధంగా ఉన్నవారి జాబితా సిద్ధమవుతోంది. అవసరమైతే 500 అమ్మ ఒడి వాహనాలు ఉన్నాయి. కావాలంటే 1000కి పెంచుతాం.


ప్రభుత్వ ఉద్యోగులకు రొటేషన్‌ డ్యూటీలు

వైద్యం, విద్యుత్తు వంటి అత్యవసర శాఖల ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. వీరిలో20 శాతం రొటేషన్‌ క్రమంలో హాజరవుతారు. విద్యా శాఖలో ఈ నెల 31 వరకు అన్నీ బంద్‌ చేస్తున్నాం. పేపర్‌ ఇన్విజిలేషన్‌ ఉండదు. దానిపై 31 తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం.


సరిహద్దులు మూసివేత

ఇతర రాష్ట్రాల నుంచి కరోనా రాకుండా సరిహద్దులు మూసివేస్తున్నాం. మందులు, బియ్యం, కూరగాయల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తాం. చీమ, దోమను కూడా రానివ్వం. ప్రైవేటు బస్సులు, టాక్సీలు, ఆటోలు బంద్‌ చేస్తున్నాం. అంతర్రాష్ట్ర సర్వీసులు సైతం రద్దు చేస్తున్నాం. అంబులెన్స్‌, అత్యవసర సేవలకు ఇబ్బంది ఉండదు. మీడియాకు అనుమతి ఉంది.


ఈ వారం.. మన జీవితాల కోసం

ఇటలీలో వాళ్లే చెడగొట్టుకున్నారు. ఆ దుస్థితి రావద్దంటే వందకు వంద శాతం స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష. ఇది దుఖఃసమయం. భయోత్పాత స్థితి. రోజుకు వందలమంది చనిపోతున్నారు. ఆషామాషీగా తీసుకోవద్దు. ఇది వంద శాతం పౌర బాధ్యత. ఒక వారం నియంత్రణ మన జీవిత కాలంతోపాటు భవిష్యత్తు తరాల్లోనూ భారత్‌ను కాపాడుతుంది.


కుక్కలు మాట్లాడుకుంటున్నాయి

జనతా కర్ఫ్యూ విజయవంతంపై సంతోషం వ్యక్తం చేసిన కేసీఆర్‌.. సోషల్‌ మీడియాలో ప్రసారమవుతున్న ఓ జోక్‌ను ప్రస్తావించి నవ్వులు పూయించారు. ‘‘కుక్కలు మాట్లాడుకుంటున్నాయి. క్యా హువా భయ్‌.. సబ్‌ ఇన్సానోంకో..? బల్దియావాలే పకడ్‌కే లేగయే క్యా..’’ (ఈ మనుషులకు ఏమైంది..? బల్దియా వాళ్లు పట్టుకెళ్లిపోయారా..?)’’ అని వివరించారు.


కార్మికులకు జీతాలు ఇవ్వాల్సిందే

ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో ‘ఎపిడమిక్‌ డిసీజ్‌ యాక్ట్‌- 1897’ను రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. ఇది చాలా పవర్‌ఫుల్‌ యాక్ట్‌. దీని కింద ప్రభుత్వానికి ఎలాంటి హక్కయినా ఉంటుంది. అత్యవసరమైతే నేను ప్రయాణిస్తున్న కారును ఆపి.. అధికారులు తీసుకుపోవచ్చు. అంతేనా.. ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. భవన నిర్మాణ కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు ఈ కాలంలో యాజమాన్యాలు విధిగా జీతం అందించాలి. కంపెనీలు కేవలం లాభాలు మాత్రమే ఆర్జిస్తామంటే కుదరదు. కష్టకాలంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులను ఆదుకోవాలి. ప్రభుత్వ రంగంలోని ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులకు బంద్‌ కాలానికి ప్రభుత్వం కూడా జీతం చెల్లిస్తుంది.


తల్లిదండ్రులే అన్యాయం చేశారు

దుబాయ్‌ వెళ్లిన తల్లిదండ్రులు హైదరాబాద్‌ వచ్చారు. విమానాశ్రయంలో చికిత్స తీసుకోకుండానే వెళ్లిపోయారు. తద్వారా, కరోనాను వారి కొడుక్కి తగిలించి అన్యాయం చేశారు. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు మీరుగా డాక్టర్లు, పోలీసు, కలెక్టర్‌కు అయినా రిపోర్ట్‌ చేయండి. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు మీ అంతట మీరే నియంత్రణ పాటించాలి. 6 వేల బృందాలు హోం క్వారంటైన్‌లో ఉన్నవారి కోసం పనిచేస్తున్నాయి. ఈరోజు (ఆదివారం) దురదృష్టవశాత్తూ 5 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే. ఇద్దరు లండన్‌, ఇద్దరు దుబాయ్‌, ఒక్కరు స్కాట్లాండ్‌ నుంచి వచ్చారు. దీంతో, కరోనా పాజిటివ్‌ కేసుల మొత్తం సంఖ్య 26కి చేరింది. ఇప్పటివరకు అందరూ క్షేమంగా ఉన్నారు.

Updated Date - 2020-03-23T09:03:57+05:30 IST