ధర ఉన్నా దిగులే...మిర్చి రైతులకు తప్పని రంది

ABN , First Publish Date - 2020-03-08T11:11:52+05:30 IST

కర్షకులు కన్నీరు పెడుతున్నారు. మిర్చి రైతులకు వేదన తప్పడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకున్నా వారి కష్టానికి తగ్గ

ధర ఉన్నా దిగులే...మిర్చి రైతులకు తప్పని రంది

దిగుబడి లేక ఇబ్బందులు

మార్కెట్‌ ధర రూ. 15 వేలు కన్నా ఎక్కువే..

అయినా అంతంతమాత్రంగానే పంట


వాజేడు, మార్చి7:   కర్షకులు కన్నీరు పెడుతున్నారు. మిర్చి రైతులకు వేదన తప్పడం లేదు. రెక్కలు ముక్కలు చేసుకున్నా వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కడం లేదు. మార్కెట్‌లో ఽఅధిక ధర పలుకుతున్నా  దిగుబడి సరిగా రావడం లేదు. దీంతో వీరు ఆందోళన చెందుతున్నారు.  ములుగు జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగుడెం మండలాలలో రైతులు మిర్చి పంటను ఈ ఏడాది భారీగానే సాగు చేశారు. వాజేడు మండలంలో సుమారు 5వేల ఎకరాలు, వెంకటాపురం మండలంలో 7వేలు, ఏటూరునాగారంలో 7వేలు, మంగపేటలో 5వేలు ఎకరాలకు పైగానే మిర్చిని రైతులు ఈ ఏడాది సాగు చేశారని అంచనా. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అనుకున్న స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మిర్చి దిగుబడులు భారీగా తగ్గాయని రైతులు వాపోతున్నారు. గతేడాది ఎకరాకు 25 క్వింటాళ్లుకు పైగా వచ్చిన దిగుబడి.. ఈ ఏడాది 10 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. దీంతో  పెట్టిన పెట్టుబడులు సైతం వస్తాయో రావో అని  రైతులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలకు తోడు కూలీల కొరత కూడా భారీగా ఉండటంతో ఎకరాకు పెట్టుబడి రూపంలో రూ లక్షకు పైగానే ఖర్చు అవుతుందని రైతులు తెలుపుతున్నారు. బడా, సన్నాకారు రైతులకు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో లాభాలు రావని తెలుస్తోంది. పెట్టిన పెట్టుబడులు వస్తే చాలని రైతులు కోరుకుంటున్నారు. 


వైపరీత్యాల పరంపర 

ఈ ఏడాది మిర్చి రైతులకు ఆకాల వర్షాలు, వైరస్‌లు మిర్చి పంటను దెబ్బతీశాయి. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు మిర్చిపంట గోదావరి పరీవాహక ప్రాంతంలో కొట్టుకుపోవడంతో వందల ఎకరాల్లో భారీగా నష్టం చేకూరింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే గోదావరిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. కొట్టుకుపోతున్న పంటను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆకాల వర్షాల ప్రభావం మిర్చితోటలపై సైతం పడటంతో అక్కడక్కడ వైరస్‌లు సైతం సోకి దిగుబడిపై ప్రభావం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అదే విధంగా పక్క మండలమైన వెంకటాపురం(నూగూరు)లో మిర్చిపంటకు    అంతుచిక్కని వైరస్‌లు సోకడంతో అక్కడి మిర్చి రైతులు కోట్లలో నష్టపోయారు. తమను ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కినా ప్రయోజనం లేకపోయింది. సోకిన వైరస్‌ను కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు వచ్చినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ మండలంలోని మెజారిటీ రైతులు మిర్చిపంటను పండించి నష్టాలను చవిచూశారు. ఇక వాజేడు మండలంలో అక్కడక్కడ వైరస్‌లు సోకడంతో కొంత మేర నష్టపోయారు. 


ఫిక్స్‌ కాని బాండ్‌ కంపెనీ ధర

వాజేడు, వెంకటాపురం మండలాల్లో చాలా మంది రైతులు ఏవీటీ బాండ్‌ వ్యవసాయం చేస్తుండటంతో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. అయితే ఈ ఏడాది ఆ కంపెనీ ప్రతినిధులు ఇంత వరకు ధరను నిర్ణయించకపోవడంతో బాండ్‌ వ్యవసాయం చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు మార్కెట్‌ ధర రూ 15వేలకు పైగానే ఉండటంతో బాండ్‌ రైతులు అయోమయంలో పడుతున్నారు. ఆ బాండ్‌ కంపెనీ మార్కెట్‌ రేటు కంటే ఎక్కువగానే ఇస్తుండటంతో దాని వైపు మొగ్గుచూపిస్తున్నారు. 


అయితే.. ఈ ఏడాది ఆ బాండ్‌ కంపెనీ సైతం ధరను నిర్ణయించకపోవడానికి  కారణం మార్కెట్‌ ధర ఎక్కువగా ఉండటమేనని తెలుస్తోంది. మార్కెట్‌ ధర కంటే ఎక్కువగా ఇస్తే ఎలా అని బాండ్‌ కంపెనీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. మార్కెట్‌ ధర రూ. 8వేలు ఉంటే బాండ్‌ కంపెనీ ధర రూ 12వేలు నిర్ణయించి కొనుగోలు చేసేవారు.


అయితే.. ఇప్పుడు మార్కెట్‌ ధరే రూ 15 వేలుకు పైగా ఉండటంతో బాండ్‌ కంపెనీ ఎంత ధరను నిర్ణయిస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. ఓ వైపు కోతలు కోసి ఆరబెట్టిన రైతులు పెట్టుబడులు, వాతావరణ పరిస్థితులను చూసి ఆందోళన చెందుతున్నారు. బాండ్‌ కంపెనీ త్వరితగతిన కొనుగోలు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు. సాధారణ పద్ధతుల్లో సాగు చేసే రైతులు మాత్రం మార్కెట్‌ ధరను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


దిగుబడులు తగ్గినా రేటు బాగానే ఉందని, పెట్టుబడులు మాత్రం వస్తే గట్టెక్కుతామని అంటున్నారు.  ఈ ఏడాది జనవరిలో మిర్చి ధర ఒక్కసారిగా రూ. 20వేలుకు పైగానే ఉండటంతో రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు.అనంతరం చైనాలో కరోనా వైరస్‌ ప్రభావం మిర్చి మార్కెట్‌పై పడటంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. ఆ తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్‌ ధర  రూ. 15వేలు వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Updated Date - 2020-03-08T11:11:52+05:30 IST