యాసంగికి విత్తనాలు పుష్కలం
ABN , First Publish Date - 2020-11-02T08:32:05+05:30 IST
యాసంగి సీజన్‌లో రైతులు సాగుచేయబోయే పంటల విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు అందుబాటులోకి అందుబాటులోకి వచ్చాయి.
65.70 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళిక
మొత్తం 17.69 లక్షల క్వింటాళ్లు రైతులకు అవసరం
రాష్ట్రంలో 22.11 లక్షల క్వింటాళ్ల విత్తనాల లభ్యత
హైదరాబాద్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో రైతులు సాగుచేయబోయే పంటల విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు అందుబాటులోకి అందుబాటులోకి వచ్చాయి. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అవసరాలకు మించి విత్తన లభ్యత ఉంది. రాబోయే యాసంగి(రబీ)లో 65.70 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు ప్రణాళికను తయారుచేసింది. ఇందుకు 17.69 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతుండగా.. 22.11 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ నివేదిక తయారు చేసింది. వానాకాలం సీజన్‌లో 52.56 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. యాసంగిలో కూడా 50 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వరి విత్తనాలు 12.50 లక్షల క్వింటాళ్ల అవసరముండగా.. 15.02 లక్షల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ నివేదికలో పేర్కొంది. సాధారణంగా యాసంగిలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుంది. కానీ రైతులు మొక్కజొన్న సాగుచేయొద్దని ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. దీంతో యాసంగి సాగు ప్రణాళికలో మొక్కజొన్న సాగు, విత్తన ప్రస్తావన చేయలేదు. వరి తర్వాత శనగ, వేరుశనగ సాగును పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
4.50 లక్షల ఎకరాల్లో శనగ సాగుచేయాలని, 1.35 లక్షల క్వింటాళ్లకు గాను 2.67 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 4 లక్షల ఎకరాల్లో వేరుశనగను ప్రతిపాదించారు. ఇందుకు సరిపడా 3.60 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరో లక్ష ఎకరాల్లో జొన్న సాగును ప్రతిపాదించారు. గోధుమలు, సజ్జలు, కంది, పెసర, మినుము, కుసుమలు, ఆముదం, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవాల సాగు విస్తీర్ణాన్ని కూడా నిర్దేశించటం గమనార్హం. మరో 2.96 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని లెక్కేసినా, విత్తనాల ప్రస్తావన మాత్రం ప్రణాళికలో లేదు.
కాగా, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ 5.22 లక్షల క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో 3.76 లక్షల క్వింటాళ్లు వరి విత్తనాలే ఉన్నాయి. 55 వేల క్వింటాళ్ల శనగ, 28 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు ‘హాకా’ సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. మరో 35 వేల క్వింటాళ్ల శనగ విత్తనాల సరఫరాకు మార్క్‌ఫెడ్ సిద్ధమైంది. నేషనల్ సీడ్ కార్పొరేషన్ 1.87 లక్షల క్వింటాళ్లు అందుబాటులోకి తెస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీల కంటే అధికంగా ప్రైవేటు ఏజెన్సీలే 9.68 లక్షల క్వింటాళ్ల విత్తనాలను మార్కెట్లోకి తేనున్నాయి. కాగా, దేశ విత్తన అవసరాల్లో తెలంగాణ 60 శాతం ఉత్పత్తి చేస్తోందని.. విదేశాలకు కూడా సరఫరా చేస్తున్న ఘనత మనదేనని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈ యాసంగి సీజన్‌కు అవసరమైన విత్తనాలన్నింటినీ సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.