యాదాద్రి గర్భాలయ తలుపులకు స్వర్ణశోభ

ABN , First Publish Date - 2020-08-18T07:04:06+05:30 IST

యాదాద్రిలో కొలువైన లక్ష్మీనృసింహుల గర్భాలయ ద్వారం స్వర్ణ కాంతులతో కొత్త శోభను

యాదాద్రి గర్భాలయ తలుపులకు స్వర్ణశోభ

  • అమరికకు సిద్ధమైన బంగారు తాపడ నృసింహ విగ్రహాలు, పద్మాలు

యాదాద్రి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిలో కొలువైన లక్ష్మీనృసింహుల గర్భాలయ ద్వారం స్వర్ణ కాంతులతో కొత్త శోభను సంతరించుకోనుంది. తామ్ర దేవతా విగ్రహాలు, పద్మాలు, రాజహంసలకు బంగారు తాపడం చేసి గర్భాలయ ముఖద్వార తలుపుల పలకలపై అమర్చడానికి సిద్ధం చేశారు. చెన్నైలోని స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థకు చెందిన శిల్పులు బంగారు తాపడం పనులు పూర్తి చేయడంతో దాదాపు 97 ఆర్టికల్స్‌గా గల విగ్రహాలు, పద్మాలను యాదాద్రికి తెచ్చి వాటిని తలుపులపై అమర్చడానికి ఆలయ స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ప్రధానాలయ ముఖ మండపం, గర్భాలయ పనులు తుదిమెరుగులు దిద్దుకుంటున్నాయి. గర్భాలయ ద్వారానికి పసిడి శోభను సంతరింపజేసే పనులు పూర్తిచేయడంపై దృష్టిసారించారు. దీనిలో భాగంగానే గర్భాలయ ముఖద్వారం తలుపులను స్వర్ణకాంతులతో శోభిల్లింపచేసే స్వర్ణ తాపడంతో 14 రూపాల నృసింహుల విగ్రహాలు, పద్మాలు, రాజహంసలు, బంగారు తొడుగులు నాలుగు రోజుల క్రితం యాదాద్రి కొండపైకి చేరుకున్నాయి. ద్వారానికి శ్రేష్టమైన టేకు కలప తలుపులను అమర్చడం పూర్తయింది. ఈ తలుపుల పలకల మధ్యన రాగితో చేసిన 14 నృసింహ రూపాల దేవతా మూర్తులు, కళాత్మకమైన పద్మాలు, రాజహంసలకు స్వర్ణతాపడం చేసి అమర్చనున్నారు. ఇందుకోసం మహాబలిపురంలో ఆగమ శాస్త్రపరంగా తామ్రలోహపు విగ్రహాల తయారీలో నిష్ణాతులైన శిల్పులతో తయారు చేయించిన దేవతా విగ్రహాలు, పద్మాలు, రాజహంసలకు స్వర్ణతాపడం చేసే పనులను స్మార్ట్‌ క్రియేషన్స్‌కు అప్పగించారు.

Updated Date - 2020-08-18T07:04:06+05:30 IST