టీఆర్‌‌ఎస్‌తో కుస్తీనే!

ABN , First Publish Date - 2020-12-19T07:35:23+05:30 IST

తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ప్రకటించారు.

టీఆర్‌‌ఎస్‌తో కుస్తీనే!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ట్రైలరే.. అసలు సినిమా ముందు చూపిస్తాం

2023లో సామాన్యుడే ముఖ్యమంత్రి

అవినీతిని అంతం చేసే వరకూ నిద్రపోం

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రానికి 2023లో సామాన్యుడే సీఎం అవుతారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ ఛుగ్‌ ప్రకటించారు. ఏ రాజా సాబ్‌ కుమారుడో... అల్లుడో, నిజాం చెంచానో సీఎం కాడు.. అని తేల్చిచెప్పారు.  జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో టీఆర్‌ఎస్‌కు ట్రైలర్‌ మాత్రమే చూపించామని అసలు సినిమా ముందుందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎ్‌సతో తాము చేస్తున్నది డూప్‌ఫైట్‌ కానే కాదని, ఆ పార్టీతో కుస్తీ(రెజ్లింగ్‌)కి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిజాం పాలనతోపాటు అవినీతిని అంతమొందించే వరకూ బీజేపీ నిద్ర పోదని తేల్చిచెప్పారు.


రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శుక్రవారం బండి సంజయ్‌తో కలిసి ఛుగ్‌ మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను రాజాబాబుగా సంబోధించిన ఆయన.. ఫాంహౌ్‌సను ఏడు నక్షత్రాల మహల్‌తో పోలుస్తూ విమర్శలు గుప్పించారు. ‘‘దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో తండ్రీకొడుకుల, కొన్ని రాష్ట్రాల్లో తల్లీబిడ్డల పాలన చూశా. తెలంగాణలో మాత్రం హిందూ అవిభాజ్య కుటుంబ పాలన సాగుతోంది. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, ఆత్మబంధువు(మజ్లి్‌స)తో కూడిన కుటుంబం రాష్ట్రాన్ని పాలిస్తోంది. ప్రజా ఽధనాన్ని లూటీ చేయడంలో ఈ కుటుంబంలో ఒకరికొకరు పోటీ పడుతున్నారు’’అని ఆరోపించారు.

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమితో గాబరాపడ్డ సీఎం... ఆగమేఘాల మీద జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించారని ఛుగ్‌ పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ మధ్య డూప్‌ ఫైట్‌ నడుస్తోందని, అందుకే ఫలితాలు వెలువడినా మేయర్‌ను ఎన్నుకోకుండా కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. 




అధికారంలోకి రావడమే లక్ష్యం

తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ శ్రేణులకు తరుణ్‌ ఛుంగ్‌ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎ్‌సతో రాజీ ప్రసక్తేలేదని పేర్కొంటూ, ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటాలు చేయాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నేతలతో కలిసి వివిధ విభాగాల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. తొలుత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్లు, పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమైన ఛుగ్‌.. వారి పోరాటపటిమను ప్రశంసించారు. 


Updated Date - 2020-12-19T07:35:23+05:30 IST