చలం కొనసాగింపే ధనికొండ
ABN , First Publish Date - 2020-03-02T09:51:23+05:30 IST
గుడిపాటి వెంకటాచలానికి కొనసాగింపే ధనికొండ హనుమంతరావు అని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు వకుళాభరణం రామకృష్ణ కొనియాడారు. స్త్రీ

మహిళల లైంగిక సమస్యలపై రచనలు: వకుళాభరణం రామకృష్ణ
స్త్రీ, పురుష సంబంధాలపై కథలు ఆయన ప్రత్యేకత: కె.శ్రీనివాస్
హైదరాబాద్ సిటీ, మార్చి1 (ఆంధ్రజ్యోతి): గుడిపాటి వెంకటాచలానికి కొనసాగింపే ధనికొండ హనుమంతరావు అని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు వకుళాభరణం రామకృష్ణ కొనియాడారు. స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి చలం మాట్లాడితే, అంతకన్నా ముందుకెళ్లి మహిళల లైంగిక సమస్యలపై ధనికొండ రచనలు సాగించారని అన్నారు. ప్రఖ్యాత అనువాదకుడు, రచయిత ధనికొండ హనుమంతరావు శతజయంతి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ధనికొండ కథా సాహిత్యంపై సదస్సు జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన వక్త వకుళాభరణం రామకృష్ణ ‘ధనికొండ కథలకాలం’ అంశంపై మాట్లాడారు. గుంటూరు, తెనాలి కేంద్రంగా సాగిన పోరాటాలు, ఉద్యమాల చరిత్రను ప్రస్తావించారు. ధనికొండ పుట్టి, పెరిగిన తెనాలి ప్రాంత సాంస్కృతిక, సామాజిక, చారిత్రక వైభవాన్ని, ఆనాటి స్థితిగతులను రామకృష్ణ ఉటంకించారు.
మరో ముఖ్య వక్త చరిత్ర అధ్యయనకారుడు సంగిశెట్టి శ్రీనివాస్.. ‘ఆ కాలపు తెలంగాణ, ఆంధ్ర కథలు’ అంశంపై ప్రసంగించారు. సంఘసంస్కరణోద్యమం, జాతీయోద్యమ కాలంలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య భిన్నత్వాన్ని ప్రస్తావించారు. తొలి సమావేశం నిర్వాహకుడిగా వ్యవహరించిన ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణజీవిత నేపథ్యంలోని స్త్రీ, పురుష సంబంధాలపై పలు కథలు రాయడం ధనికొండ సాహిత్యంలోని ప్రత్యేకతగా పేర్కొన్నారు. చలం, కొడవటిగంటి కుటుంబరావు, ధనికొండ హనుమంతరావు.. స్త్రీ, పురుష సమస్యలు ఇతివృత్తంగా ఎక్కువ రచనలు చేయడానికి, ఆనాటి ఆంధ్రా ప్రాంతంలోని మధ్యతరగతి ప్రాతినిధ్యమే ప్రధాన కారణమన్నారు. రెండో సమావేశంలో ‘కథారచయితగా ధనికొండ’ అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయం ఆచార్యులు, కవి మాడభూషి సంపత్‌కుమార్ మాట్లాడారు.
ధనికొండ సమగ్ర సాహిత్యం ఒక్క ఏడాదిలో 21 సంపుటాలుగా వెలువడటం తెలుగు సాహిత్యంలో అరుదైన సందర్భమన్నారు. నమ్మిన ఆదర్శాన్ని ఆచరణలో పెట్టిన ప్రభావశీలి ధనికొండ అని సాహితీవేత్త ఆచార్య ఏల్చూరి మురళీధర్‌రావు అన్నారు. స్త్రీల జీవితం ఈశ్వరుడికెత్తిన హారతిలా ఉండాలని చలం చెబితే, ఆ భారం స్త్రీల నెత్తిన పడకూడదని చెప్పిన రచయిత ధనికొండ అని సమావేశ నిర్వాహకురాలిగా వ్యవహరించిన గోపరాజు సుధ అన్నారు. ధనికొండ సాహిత్యంపై ఎంపిక చేసిన 40 కథలపై చర్చాగోష్ఠి జరిగింది.