కార్మికులకు బానిసత్వంలోకి తీసుకుపోతున్న ప్రభుత్వాలు: సీఎల్‌సీ

ABN , First Publish Date - 2020-05-11T21:58:07+05:30 IST

ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో మూడేళ్ల పాటు కార్మిక చట్టాలను నిలిపివేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేసింది.

కార్మికులకు బానిసత్వంలోకి తీసుకుపోతున్న ప్రభుత్వాలు: సీఎల్‌సీ

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో మూడేళ్ల పాటు కార్మిక చట్టాలను నిలిపివేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఈ నిర్ణయాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలను తప్పుబట్టింది. ఈ నిర్ణయంతో కార్మికులు బానిసత్వంలోకి పోతారని, కార్మిక సంఘాల ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని పౌరహక్కులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో చట్టాల నిలిపివేత అంతర్జాతీయ కార్మిక సంస్థ మౌలిక సూత్రాలకు విరుద్థంగా ఉందని ఆయన ఆక్షేపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకురావడం రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కును హరించడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కార్మిక చట్టాలను ఉపసంహరించు కొనేవరకు కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, ప్రజాస్వామికవాదులు కార్మికవర్గానికి అండగా ఉండాలని కోరారు.


కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని లక్ష్మణ్ ఆరోపించింది. కరోనా వ్యాప్తి పేరుతో కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడమేంటని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను నిలిపివేయడం భారత రాజ్యాంగంలోని జీవించే హక్కును హరించివేయడమేనని ఆయన చెప్పారు. కార్పొరేట్ల, బహుళజాతి కంపెనీల మెప్పు కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తప్పుబట్టారు. చట్టప్రకారం పరిపాలన చేస్తామని చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కుతున్నాయని ఆయన మండిపడ్డారు. కార్పొరేటు పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా 125 సంవత్సరాల చరిత్ర గలిగిన కార్మిక చట్టాలను రద్దు చేయడం దారుణమని లక్ష్మణ్ తప్పుబట్టారు.


Updated Date - 2020-05-11T21:58:07+05:30 IST