కరోనా కట్టడికి బాధ్యతాయుతంగా పని చేయండి

ABN , First Publish Date - 2020-03-24T08:31:54+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడికి బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

కరోనా కట్టడికి బాధ్యతాయుతంగా పని చేయండి

కలెక్టర్‌ అబ్దుల్‌ అజీమ్‌


భూపాలపల్లి కలెక్టరేట్‌, మార్చి 23: కరోనా వైరస్‌ కట్టడికి బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ రాకుం డా ముందస్తుగా జిల్లాలో 402 సర్వేలెన్స్‌ టీంలను ఏర్పాటు చేశామన్నారు. సర్వే లెన్స్‌ టీంలు సమర్థవంతంగా పని చేస్తూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయన్నారు.


ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని గుర్తించి హోమ్‌ క్వారెంటైన్‌లో ఉంచి వైద్యసేవలందించాలన్నారు. అలాగే వారి బంధువులను గుర్తించి క్వారెంటైన్‌లో ఉంచాలన్నారు. కాళేశ్వరం, గణపురం హరిత హోటల్‌ల్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు పర్యవేక్షించాలన్నారు. చిట్యాల సీహెచ్‌సీ, భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకొవాలన్నారు. వై ద్య సిబ్బందికి కరోనాపై శిక్షణ ఇవ్వాలన్నారు. వ్యాధి తగ్గేంత వరకు వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌వో గోపాల్‌రావు, వైద్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read more