మహిళలు..మహరాణులు
ABN , First Publish Date - 2020-03-08T11:07:47+05:30 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ స్వరాష్ట్ర సాధనతో స్వయం ప్రతిపత్తిగల జిల్లాగా ఆవిర్భవించింది.

రాజకీయ రంగంలో కలిసొచ్చిన రిజర్వేషన్
సర్పంచ్ సహా అమాత్య పదవీ ఆమెకే
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మహబూబాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్ స్వరాష్ట్ర సాధనతో స్వయం ప్రతిపత్తిగల జిల్లాగా ఆవిర్భవించింది. అక్కడ్నుంచి జిల్లా వ్యాప్తంగా మహిళా సాధికరితకు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. 2019 చివరాంకంలో కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఆపై ఆమాత్య పదవీలో కూర్చోబెట్టారు. మహిళ, శిశుసంక్షేమ, గిరిజన సంక్షేమం రెండు శాఖలు అప్పగించారు. దీంతో జిల్లాలో మహిళా అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కా రం, మహిళా శిశు సంక్షేమం అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ వస్తున్నారు.
ఇక చట్టసభలు కల్పించిన రిజర్వేషన్ ఫలాల్లో భాగంగా మహబూబాబాద్ తొలి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎస్టీ మహిళకు రిజర్వు కావడంతో గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న బయ్యారానికి చెందిన యువతీ కుమారి ఆంగోతు బిందు జడ్పీటీసీగా రంగంలో దిగి విజయం సాధించారు. ఆపై రాష్ట్రంలోనే అతిపిన్న వయసులో రాజకీయ రంగప్రవేశం చేసిన ఆంగోతు బిందు ద్వారా అభివృద్ధి సాధ్యమనే కోణంలో గుర్తించిన సీఎం కేసీఆర్ ఆమెకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవీని కట్టబెట్టారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ చేజారిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత 2019 మానుకోట ఎంపీగా టికెట్ దక్కించుకుని గెలిచి భారత పార్లమెంట్‌లో తొలి గిరిజన పార్లమెంట్ సభ్యురాలిగా మహిళా సమస్యలపై గళం వినిపిస్తూ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఎందరో ప్రజాప్రతినిధులు
మహబూబాబాద్ జిల్లాలో మహిళా రాజకీయ ప్రా తినిధ్యం శాసనసభ, పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ ఉంది. జిల్లా పరిధిలోని అటు రెండు-ఇటు రెండు పాక్షిక కొత్తగూడ, గంగారం-బయ్యారం, గార్ల మండలాల ప్రాతినిధ్య ములుగు, ఇల్లందు నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వుడ్ కావడంతో ఆయా స్థానాల నుంచి గత ఎన్నికల్లో ధన్నసరి సీతక్క, బానోత్ హరిప్రియలు ఎమ్మెల్యేలుగా గెలుపొంది రాష్ట్ర అసెంబ్లీలో మహిళల తరుపున తమ గళం వినిపిస్తున్నారు. ఈ జిల్లాకు వీరు మాత్రమే విశేషం కాదు.. ఇక పంచాయతీరాజ్ వ్యవస్థలో రిజర్వేషన్‌లతో పాటు స్వీయ అవకాశాల ద్వారా మహిళలకు ప్రజాప్రతినిధులుగా అనూ హ్య అవకాశాలు లభించాయి.
జిల్లాలో 461 గ్రామపంచాయతీలు ఉండగా అందులో 235 మంది సర్పంచ్‌లు.. మహిళ ప్రాతినిధ్యంలోనే ఉన్నారు. జిల్లాలో 92 మంది ఎంపీటీసీలు గెలుపొందగా అందులో 12 మం ది ఎంపీపీలు అయ్యారు. జడ్పీచైర్‌పర్సన్ మినహాయి స్తే మరో 10 మంది జడ్పీటీసీలుగా మహిళలే అధికారంలో ఉన్నారు. అంటే జిల్లా మొత్తం లో అత్యధికంగా ఉన్న మహిళా ఓటర్లకు అనుగుణంగానే సగం కన్నా ఎక్కువగానే మహిళలు అధికార పీఠాలను అధిష్టించి మహిళా సారథులుగా ముందుకు ఉరుకుతున్నారు.
మహిళా సమస్యలే అధికం...
ఏజన్సీ మండలాలు, గిరిజన తండాలు అత్యధికంగా కలిగిన మహబూబాబాద్ జిల్లాలోని ఎనిమిదిన్నర లక్షల జనాభా ఉంటే అందులో సగానికికన్న ఎక్కువగానే మహిళా ప్రాతినిధ్యం ఉంది. ఓటర్ల పరంగా చూసిన కూడా మహిళలే ఎక్కువగా ఉం టూ వస్తున్నారు.
వ్యవసాయాధారిత జిల్లాగా పేరున్నప్పటికి ఉపాధి అవకాశాలు మృగ్యమై వ్యవసాయేతరకాలాల్లో సబ్బండ వర్గాల శ్రామికులు, మహిళలు రైళ్లలో.... పట్టణాల్లో... వేరుశనగ పల్లిలు, సంత్రాలు, యాపిల్, తదితర చిరుతిండ్లు బుట్టల్లో పెట్టుకుని ప్రమాదపు అంచున ప్రయాణాలు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూ జీవిస్తున్నారు. గిరిజన తండాల్లోనైతే అనేక సంవత్సరాలుగా గుడుంబాను కుటీర పరిశ్రమగా చేసుకుని జీవించడం వల్ల.. గు డుంబా సేవనం ఎక్కువై పురుషుల మరణాలు పెరిగిపోయి పిన్నవయస్సులోనే వితంతువులుగా మారుతున్న యువతుల ఊదంతాలు కోకొల్లలు.
కొంతకాలంగా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో కొంతమేరకు గుడుంబా మరణాలు తగ్గినప్పటికి పూర్తిగా త యారీ నియంత్రణ ఇంకా జరుగలేదు. మరోపక్క ఏజె న్సీ తండాలు, పల్లెల్లో గర్భిణులో చైతన్యం కలిగించలేకపోవడంలాంటి కారణాలతో పౌష్టికాహార లోపంతో శిశువులు జన్మిస్తున్నారు. అనారోగ్యాలపాలవుతున్నా రు. మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా విభిన్న సమస్యల పరిష్కారానికి.. జిల్లాకు చెందిన మంత్రి సత్యవతిరాథోడ్, జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎంపీ మాలోతు కవితలు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైన ఉందని జిల్లా ప్రజానీకం గుర్తు చేస్తోంది.
ఉపాధి అవకాశాలు.. విద్యారంగాల్లో..
గిరిజన ప్రాబల్య మహబూబాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచే.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ డిమాండ్ కొనసాగుతూ వస్తోంది. పైగా... ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం తామూ పాటుపడతామని ప్రస్తుత మంత్రి సత్యవతిరాథోడ్, ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు ప్రకటనలు చేసివున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ఏకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ సాధించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళల్లో విద్యావంతులు, పదిపాసైన యువతులు అత్యధికంగా ఉండి ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నారు.
అందులో నర్స్ ట్రైనింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ హామీ ఉన్న దరిమిలా బీఎస్సీ నర్సింగ్ కోర్సు, డిప్లోమా నర్సింగ్‌లతో పాటు మహిళా ఐటీఐ, మహిళా పాలిటెక్నిక్, ఎంప్లాయిమెంట్ కెరీర్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని విద్యావంతులు కోరుతున్నారు. అంతేకాకుండ డిప్లొమా ఇన్ డొమిస్టిక్ సైన్స్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లాంటి ఒకేషనల్ కోర్సులకు విరివిగా ప్రాధాన్యం కల్పించాలంటున్నారు.
ఆకాశంలో సగమే కాదు... అవకాశంలోనూ సగంకంటే ఎక్కువనంటూ జిల్లాలో రాజకీయ ప్రజా ప్రాతినిధ్య రంగంలో ఓ మంత్రి, జడ్పీ చైర్‌పర్సన్, ఎంపీ, ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్ వ్యవస్థలోనూ పల్లెల పాలనా సారథులు మహిళలే ఉండడం ఈ జిల్లా మహిళా రంగానికి అభివృద్ధిపై ఎన్నెన్నో ఆశలు చిగురింపచేస్తున్నాయి. ఈ దిశగా ప్రస్తుత అంతర్జాతీయ మహిళా దినోత్సవం నుంచైనా మహిళా ప్రజాప్రతినిధులు స్పందించి మానుకోటను మహిళా కోటగా అభివృద్ధి వికాసానికి అడుగులు వేయించాలని ఆశిద్దాం...