ప్రియుడితో పెళ్లి కోసమే..

ABN , First Publish Date - 2020-06-23T10:04:17+05:30 IST

ప్రియుడితో పెళ్లి కోసమే..

ప్రియుడితో పెళ్లి కోసమే..

బర్కత్‌పుర, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ప్రియుడి కోసం ఇంటి యజమానురాలిని హతమార్చిందో పనిమనిషి. డబ్బుతెస్తే కట్టుకున్న భార్యకు విడాకులిచ్చి, ఆమెను పెళ్లిచేసుకుంటానని ప్రియుడు చెప్పడంతో ఆమె ఈ కిరాతకానికి పాల్పడ్డట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.  సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. తూర్పు మండలం డీసీపీ రమేశ్‌ వివరాలను వెల్లడించారు. ఓల్డ్‌ మలక్‌పేట ఎంసీహెచ్‌ కాలనీకి చెందిన వాసు భార్య దళాయి లక్ష్మి ఉప్పల్‌లోని విజయలక్ష్మి హోంకేర్‌ సర్వీసెస్‌ ద్వారా కాచిగూడ చప్పల్‌బజార్‌లోని కమలమ్మ(85) ఇంట్లో కేర్‌టేకర్‌గా పనికి కుదిరింది. నియమితులయ్యారు. మందుల మహేందర్‌ అనే వ్యక్తితో లక్ష్మి ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లిచేసుకుందామనుకున్నారు. అయితే.. తన భార్యకు విడాకులివ్వడానికి డబ్బులు కావాలని.. ఆ మొత్తం ఇస్తే, త్వరలో పెళ్లి చేసుకోవచ్చని అతడు చెప్పడంతో.. ఇంటి యజమానురాలిని చంపేందుకు లక్ష్మి పథకం పన్నింది. ఈ నెల 20న కమలమ్మ నిద్రలో ఉండగా.. ముఖంపై దిండును అదిమిపట్టి.. హత్య చేసింది. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, 10 తులాల బంగారు ఆభరణాలు, రూ. 26 వేల నగదును తీసుకుని పారిపోయింది. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కమలమ్మ సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా లక్ష్మి, ఆమె ప్రియుడు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వివరించారు. ఎలాంటి ఆధారాలు తీసుకోకుండా.. లక్ష్మిని పనికి కుదిర్చిన విజయలక్ష్మి హోంకేర్‌ నిర్వాహకుడు సతీశ్‌కుమార్‌పైనా కేసు పెట్టి, అరెస్టు చేశామని డీసీపీ తెలిపారు.

Read more