కరోనా వ్యాక్సిన్ పేరుతో రియల్టర్‌ని బోల్తా కొట్టించిన మాయలేడి!

ABN , First Publish Date - 2020-05-18T22:54:35+05:30 IST

కరోనా వైరస్ వ్యాక్సీన్ పరిశోధనల పైరుతో ఓ మహిళ విసిరిన మాయాజాలానికి పుణేకి చెందిన రియల్టర్ ఒకరు...

కరోనా వ్యాక్సిన్ పేరుతో రియల్టర్‌ని బోల్తా కొట్టించిన మాయలేడి!

పుణే: కరోనా వైరస్ వ్యాక్సీన్ పరిశోధనల పైరుతో ఓ మహిళ విసిరిన మాయాజాలానికి పుణేకి చెందిన రియల్టర్ ఒకరు రూ.38.50 లక్షలు సమర్పించుకున్న వైనమిది. అమెరికాలో తాను కరోనా వ్యాక్సీన్ అభివృద్ధి చేస్తున్నాననీ.. అందుకు కావాల్సిన ప్రత్యేక తైలం భారత్‌లోనే దొరుకుతుందంటూ రియల్టర్‌ను సదరు మహిళ నమ్మించి మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల వరకు 14 సార్లు జరిపిన లావాదేవీల్లో అతడు ఈ మేరకు సొమ్ములు పోగొట్టుకున్నట్టు గుర్తించారు. ఫిర్యాదులో పేర్కొన్నదాని ప్రకారం.. కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం పరిశోధనలు చేస్తున్న ఓ కాలిఫోర్నియా కంపెనీలో తాను పనిచేస్తున్నానంటూ ఓ యువతి సోషల్ మీడియా ద్వారా రియల్టర్‌ను సంప్రదించింది.


‘‘తమ ల్యాబ్‌కు కేవలం భారత దేశంలో మాత్రమే దొరికే ఓ తైలం అవసరం ఉందని ఆమె నమ్మబలికింది. దాన్ని కొనుగోలు చేసేందుకు ఆయన సాయం కావాలంటూ డబ్బులు వసూలు చేసింది..’’ అని పోలీసులు పేర్కొన్నారు. ఈ తైలాన్ని విక్రయించే భారత వ్యాపారి నంబర్‌ అంటూ మోసగాళ్లు రియల్టర్‌కు ఓ ఫోన్ నంబర్ సైతం ఇచ్చారు. ‘‘ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు బాధితుడి దగ్గర్నుంచి 14 దఫాలుగా రూ.38.5 లక్షలు వసూలు చేశారు. తాను మోసపోయానంటూ అతడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.’’ అని అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-05-18T22:54:35+05:30 IST