ట్రెజరీ చెల్లింపుల నిలిపివేత!

ABN , First Publish Date - 2020-11-26T08:10:32+05:30 IST

రాష్ట్రంలో ట్రెజరీ చెల్లింపులపై అనధికారిక నిషేధం అమలవుతోంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల

ట్రెజరీ చెల్లింపుల నిలిపివేత!

ఉద్యోగుల జీపీఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌పై ప్రభావం..

45 రోజులుగా కొనసాగుతున్న ఫ్రీజింగ్‌ 

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ట్రెజరీ చెల్లింపులపై అనధికారిక నిషేధం అమలవుతోంది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, రిటైర్డ్‌ సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ వంటి వాటిని కూడా చెల్లించడం లేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత 45 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ ఏడాది భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, ఆదాయం మాత్రం ఆశించిన మేరకు రావడం లేదు. ముఖ్యంగా కరోనాతో రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.


ఇప్పుడు లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేస్తున్నారు. అయినా సాధారణ పరిస్థితులు నెలకొనడం లేదు. అంచనా మేరకు ఆదాయం రాని కారణంగా, అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పుల్ని తీసుకువస్తున్నది. ఈ ఏడాది తొలి ఆరు మాసాల్లోనే సుమారు రూ. 25 వేల కోట్లకు పైగా వివిధ రూపాల్లో అప్పుల్ని తీసుకువచ్చారు. అయినప్పటికీ నిధులు సరిపోవడం లేదనే వాదన ఉంది. అందుబాటులో నిధులు లేకపోవడంతో  కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. ఇలా ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్‌ బిల్లులే సుమారు రూ. 11 వేల కోట్లకు పైగా ఉన్నాయి.


ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ వంటి వాటిని కూడా చెల్లించడం లేదు. అన్ని జిల్లాల ట్రెజరీ కార్యాలయాల్లో బిల్లుల చెల్లింపుపై ఫ్రీజింగ్‌ కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. జీతాలు, పింఛన్లను చెల్లిస్తున్నప్పటికీ మిగతా వాటిని నిలిపి వేశారు. కరీంనగర్‌ జిల్లా ట్రెజరీలో బిల్లును ఆమోదించి ఆన్‌లైన్‌లో పంపిస్తున్నా చెల్లింపులు మాత్రం జరగడం లేదు. ప్రభుత్వం నుంచి ఆ మేరకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. 


Updated Date - 2020-11-26T08:10:32+05:30 IST