ప్రజల్ని మరోసారి మోసం చేస్తారా

ABN , First Publish Date - 2020-09-20T08:16:36+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.

ప్రజల్ని మరోసారి మోసం చేస్తారా

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమే మళ్లీ లక్ష ‘ఇళ్ల’ మాట : భట్టి విక్రమార్క 


హైదరాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సిద్ధమైందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని, ఎన్నికలు అయిపోగానే పంపిణీ చేస్తామంటూ సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రజల్ని దగా చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికలు రాగానే పేదల అవసరాలను, ఇబ్బందులను ఓట్లుగా మలుచుకుని.. అవసరం తీరాక వారిని పక్కన పెట్టడం సీఎం కేసీఆర్‌కు ఆనవాయితీగా మారిందని ధ్వజమెత్తారు.


గతంలో మోడల్‌ ఇళ్లను నిర్మించి పేద ప్రజలకు ఆశ చూపారని, ఎన్నికల్లో గెలిపిస్తే అలాంటి ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టారని మండిపడ్డారు. గ్రేటర్‌ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, తలసాని వివిధ సందర్భాల్లో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను శనివారం ఇందిరాభవన్‌లో ప్రదర్శించారు.


ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ ఎంపీలు వి. హన్మంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తదితరులతో కలిసి భట్టి విక్రమార్క మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మంత్రి తలసాని తనకు చూపించింది 3,428 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మాత్రమేనని చెప్పారు. లక్ష ఇళ్లు ఎక్కడని నిర్మించారని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మునిసిపాలిటీలో 2016 ఇళ్లను చూపించారన్నారు. మేడ్చల్‌ జిల్లాలోని నాగారం వెళ్లిన తర్వాత ‘ఇళ్ల జాబితా ఇస్తాం.. మీరే చూసుకోండి’ అని చెప్పి అర్థాంతరంగా మంత్రి తలసాని వెళ్లిపోయారని మండిపడ్డారు.


డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై వాస్తవాలను ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో మంత్రి సవాల్‌ను స్వీకరించి పర్యటించానని చెప్పారు. గతంలో వరంగల్‌ పట్టణంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ల వ్యవహారంలోనూ సీఎం కేసీఆర్‌ ఇలాగే వ్యవహరించారని విమర్శించారు. వీహెచ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇళ్లు కట్టడానికి స్థలం లేదంటూ ప్రభుత్వం నాటకమాడుతోందని, మియాపూర్‌లో ఉన్న 8 వందల ఎకరాల్లో ఇళ్లు కట్టిస్తే.. బాగుంటుందన్నారు. దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ భట్టి విక్రమార్కను అర్ధాంతరంగా నడిరోడ్డిపై వదిలేసిన టీఆర్‌ఎస్‌ నేతలందరినీ అదే రోడ్డుకు లాగుతామని హెచ్చరించారు. 


Updated Date - 2020-09-20T08:16:36+05:30 IST