తెలుగు వికీ ప్రాజెక్టు సమకాలీన సమాజానికి అవసరం- ప్రొ. నారాయణన్
ABN , First Publish Date - 2020-02-09T02:28:25+05:30 IST
తెలుగు వికీ ప్రాజెక్టు సమకాలీన సమాజానికి అత్యంత ఉపయోగకరమైనదని త్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పిజె నారాయణన్ అన్నారు.
తెలుగు వికీ ప్రాజెక్టు సమకాలీన సమాజానికి అత్యంత ఉపయోగకరమైనదని త్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పిజె నారాయణన్ అన్నారు. దీనికి అన్ని విధాలా సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న భారత ప్రభుత్వ, తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్రిపుల్ ఐటీ ఆధ్వర్యంలో ‘ తెలుగు వికీపీడియా-2020’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొ. నారాయణన్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం ప్రొఫెసర్ వాసుదేవ వర్మ ప్రాజెక్ట్ తెలుగు వికీకార్యకలాపాలు వివరిస్తూ ఈ ప్రాజెక్ట్ బృందాన్ని నాలుగు ఫోకస్ గ్రూపులుగా విభజించామని అన్నారు. ప్రతి శనివారం వికీ వర్క్‌షాప్‌ను త్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్నామని అన్నారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో తెలుగువికీ స్టార్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్ తెలుగు వికీలో స్వచ్చందంగా భాగస్వాములు కావడానికి 800 మంది ఔత్సాహికులు ముందుకు వచ్చారని తెలిపారు. వికీ నాణ్యత విషయంలో రాజీపడకుండా రాబోయే సంవత్సరాల్లో 30 లక్షల వికీ కథనాలను రూపొందించడం ప్రాజెక్ట్ తెలుగు వికీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు.
ట్యూరింగ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి ప్రాజెక్ట్ తెలుగు వికీపై తన ఆలోచనలు పంచుకున్నారు. సాంకేతిక సహాయంతో పెద్ద సంఖ్యలో తెలుగు వికీపీడియా వ్యాసాలు సృష్టించుకోవచ్చని అన్నారు. తర్వాత మానవ జోక్యంతో వాటిని సరిదిద్దుకోవచ్చని తెలిపారు. రాజ్‌రెడ్డి మాట్లాడుతూ కేవలం 5 నుంచి 10శాతం మంది భారతీయులు మాత్రమే ఇంగ్లీషులో పరిజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ వికీపీడియా రెండవ అత్యధిక వినియోగ దారులుగా ఉన్నారని అందుకే మాతృభాషలో మరింత ఎక్కువ విషయాన్ని సృష్టించే ప్రయత్నం భారత ప్రభుత్వాలు, సాంకేతిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు, భాషా నిపుణులు, స్వచ్చంద సహాయకులు చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ సంస్కృతి అనేది మానవాళితరతరాలుగా సమకూర్చుకున్న సామూహిక జ్ఞానం అని దీనిని విస్తృత అర్ధంలో చూడాలని అన్నారు. తెలంగాణ విభిన్న కళారూపాలు, గొప్ప సంస్కృతి, వారసత్వాలకు నిలయమని చెప్పారు. వీటిని వికీపీడియన్లు భవిష్యత్ తరాలకు అందజేయడం చాలా అవసరమని అన్నారు. దీనికి భాష, సాంస్కృతికశాఖ తన సహకారాన్ని అందిస్తుందన్నారు. భవిష్యత్‌లో తెలుగు వికీపీడియాకు తోడ్పాటు కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ మాట్లాడుతూ సమాచార సృష్టికి సంబంధించిన సవాళ్లు అన్నఅంశంపై ఉపన్యసించారు. వికీపీడియా ఔత్సాహికులు విషయ వ్యాప్తి కోసం కొత్త టెక్నాలజీ ప్లాట్‌ఫారంలను అన్వయించుకోవాలని సూచించారు. సమాచారాన్ని వ్యాప్తిచేసేందుకు వికీపీడియా సరికొత్త సాంకేతిక వేదిక అని అభిప్రాయపడ్డారు.